Sat 16 Oct 23:27:00.904724 2021
Authorization
ఒక అడవిలో 'ఉడుత' మంత్రిగా ఉంది. నక్క, తోడేలు, ఎలుగుబంటి, కోతి మొదలైన జంతువులు ''అంతటి మగరాజుకి, ఇంతటి ఉడుత మంత్రిగా ఉండటం ఏంటి''? అని అనుకున్నాయి నక్క తన అతి తెలివితో జంతువుల మధ్య తగాదాలు పెట్టింది .దానితో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో గొడవలు, కొట్లాటలు మొదలైనాయి. అవన్నీ రాజుగారి చెవిన పడ్డాయి .
అంతలో నక్క హడావిడిగా రాజుగారి దగ్గరికి వచ్చి ''ఓ మగరాజా ! మీ ఉడుత మంత్రి చేతకానితనం వల్ల జంతువుల మధ్య విభేదాలు వస్తున్నాయి. మీరు ఏం చూసి ఉడుతను మంత్రిగా నియమించారో తెలియడం లేదని'' చెప్పింది. మగరాజుకి నక్క జిత్తులు అర్థమయ్యాయి. సరే !
''రేపు నీకు, నా మంత్రి ఉడుతకు చిన్న పరీక్ష పెడతాను . అందులో గెలిచిన వారికే ఆ మంత్రి పదవి'' అని చెప్పింది .
మరునాడు మగరాజు పరుగుల పోటీ పెట్టింది . దానికి న్యాయనిర్ణేతలుగా నక్కను, ఉడుతను ఉండమంది .
ఆ పరుగుల పోటీలో పాల్గొనడానికి ''ఏనుగు, జింక, కోతి, కుందేలుతో పాటు కప్ప, చీమ'' కూడా వచ్చాయి . వాటిని చూడగానే నక్క ''పోటీ లేకుండగానే విజేత ఎవరో నేను చెప్పగలను'' అంది . అంతలో మగరాజు పోటీ నియమాలను పూర్తిగా విను అంటూ, పోటీలో పాల్గొనే జంతువు పది నిమిషాల పాటు పరిగెత్తాలి. దానిని బట్టి విజేత నిర్ణయించాలని చెప్పింది .
పందెం మొదలైంది. ఏనుగు, జింక నాలుగు నిమిషాలలోనే చాలా దూరం వచ్చాయి. వెనక్కి తిరిగి చూస్తే కనుచూపు మేరలో ఏ జంతువు కనబడలేదు. ఆయాసం అనిపించి ఆ రెండు ఓ పక్క విశ్రాంతిగా కూర్చున్నాయి. మరో మూడునిమిషాలలో కోతి కూడా ఏనుగు, జింకల వద్దకు వచ్చి ఆయాసం తీర్చుకోవడానికి కూర్చుంది. మరో రెండు నిమిషాలకి కప్ప కూడా ఆ జంతువులతో కలిసి నొప్పులను తీర్చుకుంటోంది. పది నిమిషాలు పూర్తి అయినాయి. చీమ మాత్రం కొంచెం దూరం మాత్రమే వెళ్లగలిగింది. అక్కడ ఉన్న జంతువులన్నీ చీమను చూసి నవ్వుకున్నాయి. అది ఎలా పెద్ద జంతువులతో పోటీ పడగలనని అనుకుందోనని ఎగతాళి చేశాయి .
అప్పుడు నక్క ముందుకు వచ్చి, ''ఏనుగు విజేతగా ప్రకటించింది'' . అంతలో ఉడుత వచ్చి ''ఈ పోటీ విజేత చీమ'' అని చెప్పింది. గట్టిగా పది అడుగులు కూడా వెళ్లని చీమ ఎలా విజేత అని నక్క ప్రశ్నించింది? ఉడుత, నక్కతో మగరాజు చెప్పిన పోటీ నియమం ప్రకారం పది నిమిషాల పాటు పరిగెత్తాలి. విజేతని దూరాన్ని బట్టి కాదు నిర్ణయించేది . ఏనుగు, జింక, కోతి, కప్ప చాలా దూరం వచ్చామనుకొని, సమయానికి ముందే విశ్రాంతి తీసుకున్నాయి. చీమ పది నిమిషాలపాటు ఆగకుండా పరిగెత్తుతూనే ఉంది . కనుక అదే ఈనాటి విజేత అని మరోసారి చెప్పింది .
ఆ తీర్పు విన్న జంతువులన్నీ, ఉడుత తెలివితేటలను మెచ్చుకున్నాయి. చిన్న, పెద్ద జంతువులన్నీ ఉడుత మంత్రిగా కొనసాగటం తమకి ఇష్టమే నని ఏకకంఠంతో చెప్పాయి.
- నీరజ అమరవాది, 9849160055