Sat 08 Jan 23:32:26.787774 2022
Authorization
పార్ధు చాలా సోమరి. ;ప్రతిరోజూ బడికి వెళ్ళడం, చదువుకోవడం చాలా కష్టంగా తోచేది. తనకు అద్భుత శక్తులు ఉండి, తను కోరుకున్నవన్నీ లభిస్తే బాగుండునని అనుకునేవాడు. ఆ శక్తులతో తోటివారికి కూడా సహాయం చేసి, వారి దగ్గర గొప్పవాడిగా కీర్తించబడాలని కలలు కనేవాడు. ఒకరోజు వాడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథను విన్నాడు. ''ఆ కథలో మాదిరి కోరుకున్నవన్నీ చిటికెలో చేసిపెట్టగల; అద్భుత వస్తువు ఎక్కడ దొరుకుతుంది?'' అంటూ ;తన తాతగారైన కోదండయ్యను ;అడిగాడు.
పార్ధు మనసు తెలిసిన కోదండయ్య బాగా ఆలోచించి, ''నాకు కొందరు; స్నేహితు లున్నారు. ;వారు కోరుకున్నవన్నీ వెంటనే జరిగి పోతుం టాయి. వారి దగ్గర అద్భుత దీపం లాంటి వస్తువు ఉండే ఉంటుంది.'' అంటూ పార్ధుకు చెప్పాడు. ''అయితే నన్ను మీ స్నేహితుల దగ్గరకు తీసుకుని వెళ్ళండి తాతయ్యా!'' బతిమలాడాడు పార్ధు.
కోదండయ్య పార్ధును మొదటగా శ్రీనివాసులు అనే;స్నేహితుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ''ఇతని దగ్గరకు ప్రతినిత్యం; ఎందరో రోగులు వచ్చి, తమ జబ్బులను నయం చేసుకుని వెళ్తుంటారు.'' అంటూ శ్రీనివాసులను చూపించాడు కోదండయ్య. శ్రీనివాసులు పార్ధును దగ్గరకు తీసుకుని ''నా దగ్గర ఒక అద్భుత వస్తువు ఉంది. దాని సహాయంతో నేను ఎటువంటి జబ్బునైనా నయం చేయగలను'' అని చెప్పాడు. ''నాకు ఆ వస్తువును చూపించగలరా?'' అంటూ శ్రీనివాసులును అడిగాడు పార్ధు. శ్రీనివాసులు వైద్య శాస్త్రం చదివిన పట్టాను చూపించి, ''దీని సహాయంతోనే నేను రోగులకు జబ్బులను బాగు చెయ్యగలుగుతున్నాను.'' అని చెప్పాడు.
కోదండయ్య పార్ధును మరో స్నేహితుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ''ఇతని పేరు లోకనాధం, న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. పేదల తరపున కోర్టులో వాదించి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తాడు.'' మరో స్నేహితును దగ్గరకు తీసుకెళ్లి, ''ఇతని పేరు హరినాధం, వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఏడాదంతా కష్టపడి పనిచేసి ధాన్యం, కూరగాయలు, పండ్లు పండించే రైతులకు వ్యవసాయ మెళుకువలు నేర్పిస్తాడు.; ;తద్వారా దేశ ప్రజలకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండేట్లు కృషి చేస్తున్నాడు.'' అని చెప్పాడు.
ఆఖరుగా మరో స్నేహితుని దగ్గరకు తీసుకెళ్ళాడు కోదండయ్య. అతని దర్శనం కోసం అక్కడ డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, రైతులు, ;ఇలా అన్ని వర్గాలకు చెందిన వారున్నారు. ఒక్కొక్కరూ లోనికి వెళ్ళి కోదండయ్య స్నేహితునితో తమ కష్టాలు చెప్పుకుని వస్తున్నారు. తమ వంతు రాగానే కోదండయ్య, పార్ధు ఇద్దరూ లోనికి వెళ్లారు. ''ఇతని పేరు ఆంజనేయులు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇతనికి చెప్పుకుంటారు. ఇతని దగ్గర ఒక అద్భుతమైన వస్తువు ఉంది. దాని సహాయంతో అధికారులను ఆదేశించి, ఇక్కడికి వచ్చిన వారి సమస్యలను చిటికలో పరిష్కరిస్తాడు.'' అని చెప్పాడు. పార్ధు ఆశ్చర్యంగా ఆంజనేయుల వైపు చూశాడు. ''పార్ధూ! నన్ను జిల్లా కలెక్టర్ గా పనిచేయమని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. దీని సహాయంతో నేను జిల్లా స్థాయిలో అన్ని అధికారాలూ కలిగి ఉన్నాను. నా దగ్గరకు సహాయార్ధం వచ్చే వారి సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే అధికారం ఉంది నాకు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటివి కథలలోనే ఉంటాయి. నిజ జీవితంలో ఉండవు. బాల్యంలో మనం కష్టపడి చదువుకుని, ఏదో ఒక రంగంలో తిరుగులేని నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ నైపుణ్యమే అద్భుత దీపంలా మనకు, మన చుట్టూ ఉన్న వారికి ;వెలుగునిస్తుంది.'' అని చెప్పాడు. ఆంజనేయులు చెప్పింది పార్ధుకు బాగా అర్ధమయ్యింది. తను కూడా కష్టపడి చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి, తన చుట్టూ ఉన్న వారికి ;సహాయం చేసి, వారి కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు పార్ధు.
- పేట యుగంధర్, 9492571731