Sat 29 Jan 22:52:02.548296 2022
Authorization
సీతారామపురం ఊరి చివరన చిన్న గుడిసెలో అంజన్న అనే పేదవాడు వుండేవాడు, తను ఒక కోతిని పెంచుకున్నాడు. తనకు వచ్చిన ఏకైకవిద్య కోతిని ఆడించడం, దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు, ప్రతిరోజూ కోతికి కొత్త కొత్త ఆటలన్నీ నేర్పించేవాడు. బయటికి వెళ్లినప్పుడు తన భార్యను కూడా తీసుకెళ్ళేవాడు. ఆమె డప్పు వాయిస్తుంటే అంజన్న కోతిని ఆడించేవాడు. జనాలు గుంపులుగా పోగయ్యి అంజన్న ''కోతిఆట'' ఆనందంగా చూసేవారు.
అతను తమ ఊరికి ఎప్పుడు వస్తాడా అని చుట్టు పక్కల గ్రామాలలోని పిల్లలు పెద్దలు ఆశగా ఎదురు చూసేవారు, అందరూ.. అంజన్న కోతి ఆటను తెగ మెచ్చు కునేవారు, అంజన్న రోజూ కోతికి కొత్త కొత్త ఆటలు నేర్పిస్తూ.. బాగా సాధన చేయించేవాడు, ఒక్కోరోజు ఒక్కో ప్రదర్శన ఇచ్చేవాడు. దానితో డబ్బు కూడా బాగానే సంపాదించాడు.
కొన్నాళ్లుకు అంజన్నలో చాలా మార్పు వచ్చింది. అందరితో కలివిడిగా వుండే మనిషి ఇప్పుడు ఎవరినీ పలకరించడం మానేసాడు. పూరి గుడిసెస్థానంలో రేకుల ఇల్లు కట్టుకున్నాడు.
కోతిని ఆడించడం మానేసి దానికి తిండి పెట్టడం కూడా
మర్చి పోయాడు, తిండిలేక పాపం
కోతి అక్కడి నుండి వెళ్లి పోయింది, ఇంటిపట్టునే హాయిగా తింటూ కూర్చుని జల్సా చేయడం మొదలు పెట్టాడు అంజన్న.
''నిన్ను ఇంత స్థితికి చేర్చిన కోతిని ఎందుకు వదిలేసావు?'' అని ఎవరైనా అడిగితే...
''ఏం అది లేకుంటే బ్రతకలేమా? '' అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చేవాడు. ''అలా అనవద్దు అంజన్న నువ్వు ఈరోజు ఈ స్థాయికి ఎదిగావంటే నువ్వు నమ్ముకున్న విద్యే కారణం, ఏరు దాటాక తెప్ప తగలెట్టడం మంచిది కాదు'' అంటూ కొందరు మొహంపైనే అనేసే వారు. ఐనా అంజన్న అవేవి పట్టించుకోకుండా తను అనుకున్న విధంగా నడిచేవాడు.
కొద్ది రోజులకు అంజన్న భార్య అనారోగ్యంపాలైంది, ఎంతోమంది వైద్యులకు చూపించాడు, డబ్బులు ఖర్చు అయ్యాయి, కాని జబ్బునయం కాలేదు. అతనికి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది, కూడబెట్టిన ధనం మొత్తం ఐపోయింది ఐనా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. చివరికి చనిపోయింది.
అంజన్న ఇప్పుడు డబ్బులేని నిరుపేద అయ్యాడు... తనకు కోతిని ఆడించడం తప్ప ఇంకే పని రాదు, వదిలేసిన కోతిని వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎక్కడ కనిపించలేదు తోటలన్నీ గాలించాడు ఐనా కూడా కనపడలేదు, చివరికి ఊరి బయట ఒక చెట్టుపై కనిపించింది. పట్టుకుని ఇంటికి తెచ్చుకున్నాడు.
మరుసటి రోజు ఆడటానికి ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కోతి ఆడలేదు. అది నేర్చుకున్న విద్యనంతా మరచిపోయింది. అంజన్న చాలా దిగులు పడ్డాడు.
''బాధ పడకు ఇదంతా నువ్వు చేసుకున్నదే ధన అహంకారంతో విద్యను కూడా కించ పరిచావు, ఏవస్తువైనా సాన పడుతుంటేనే మన్నికగా వుంటుంది, బాయిలో నీళ్లు తోడుతుంటేనే ఊట పడుతుంది. సాధన చేస్తుంటేనే ఏ విద్య అయినా వంటబడుతుంది. చదువుతూ వుంటేనే జ్ఞానం వస్తుంది. పాడుతూ వుంటేనే రాగం కుదురుతుంది. నువ్వు పెంచిన కోతికి విద్యను అభ్యసించడం మధ్యలో ఆపేసావు. పైగా వదిలేసావు. కాబట్టే అది నేర్చుకున్నవన్నీ మరచిపోయింది అది నీ తప్పే'' అన్నాడు ఆ గ్రామ ప్రెసిడెంటు.
అంజన్నకి జ్ఞానోదయమైంది తను చేసిన పొరబాటుకు చింతించాడు పశ్చాత్తాప పడుతూ, కోతికి మళ్లీ ఆటలు నేర్పించాలి అనుకుంటూ... ఇంటికి బయలుదేరాడు.
- రజిత కొండసాని, 9949295459