Sat 12 Feb 22:51:57.887421 2022
Authorization
''ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులతో జాగ్రత్తగా మసలుకో ముఖ్యంగా పులితో '' అంటూ తల్లి కుందేలు తన పిల్లకు జాగ్రత్తలు చెప్ఫసాగింది. పిల్ల కుందేలు ఆ మాటలను వింటూనే అక్కడి నుంచి గెంతు కుంటూ వెళ్ళి పోయింది!.
చీకటి పడు తోంది అయిన కూడా కుందేలు పిల్ల తిరిగి రాకపోయేసరికి తల్లి కుందేలు గాబరా పడుతూ తన పిల్లను వెదు కుతూ అడివిలో కనిపించిన జంతువులను అడుగుతూ వెళ్ళ సాగింది ఆందరూ కూడా ''మాకు కనపడలేదు!'' అంటూ సమాధానం ఇవ్వడంతో అడవి అంతా తిరిగి తిరిగి నీరసంతో పిల్లకు ఏంజరిగిందో అన్న ఆదుర్దాతో ఇంటిదారి పట్టింది. ఇంటికి చేరగానే గుమ్మంలో ఉన్న తన పిల్లను చూసే సరికి ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది! ''ఎక్కడికి వెళ్లావు? నాకు చెప్పకుండా? ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పానా!'' అంటూ కోప్పడింది తల్లి కుందేలు. ''నేను ఎక్కడికి వెళ్ళలేదు అమ్మా ఇక్కడే పక్కన పొలంలో ఆడుకుంటూ ఉన్నాను, అయిన ఎందుకు అంత కంగారు పడుతున్నావు అమ్మా?'' అన్నది పిల్ల కుందేలు. ''ఏం లేదమ్మా ఈ అడవిలో ఒక పులి ఉన్నది అది మనలాంటి జంతువులు కనబడితే చంపి తినేస్తుంది! ఆ పులి బారిన పడే మీ నాన్న చనిపోయాడు! నువ్వు ఎక్కడ ఆ పులి బారిన పడతావో అన్న భయం!'' అన్నది తల్లి కుందేలు ''లేదమ్మా ఆపదల నుంచి ఎలా బయటపడాలో నువ్వు నాకు నేర్పించావుగా నాకు ఏమీ కాదు'' అన్నది పిల్ల కుందేలు ''అయినా సరే నీవు జాగ్రత్తగా ఉండు'' అన్నది తల్లి ''అలాగేనమ్మ'' అన్నది పిల్ల.
కొంతకాలం గడిచింది ఒకరోజు పిల్ల కుందేలు ఎలాగైనా సరే ఆ క్రూరమైన పులి మనసు మార్చాలని భావించి పులి ఉన్న గుహ దగ్గరకు వెళ్లి ఒక చెట్టు పక్కనుంచి ఆ గుహను గమనించ సాగింది. ఆ గుహలో ఉన్న పులి ఏదో జంతువును తింటున్నట్టు కనిపించింది! అది తినడం పూర్తవగానే గుహ దగ్గరకు వెళ్ళి ''పులి మామ! ఓ పులి మామ!'' అంటూ పిలిచింది. ''ఎవరు? ఎవరు నన్ను పిలిచేది?'' అంటూ గట్టిగా గర్జించింది పులి. ఏ మాత్రం భయపడకుండా ''నేను పులి మామా కుందేలు పిల్లని'' అంది. ''ఎంత ధైర్యం నువ్వు నా గుహ వద్దకు వచ్చి నన్నే పిలుస్తావా?'' అంది పులి. ''పిలవడానికి ధైర్యం ఎందుకు పులి మామ నోరు ఉంటే చాలు!'' అన్నది పిల్ల కుందేలు. ఆ మాటలు విన్న పులి ఆశ్చర్యపోయి, పిల్ల కుందేలు అమాయకపు మాటలు నచ్చి ''అసలు విషయం ఏమిటి చెప్పు?'' అన్నది. ''నువ్వు నన్ను చంపి తినను అని మాట ఇస్తేనే నీకు చెబుతాను'' అంది పిల్ల కుందేలు. ''నిన్ను చంపనులే విషయం ఏంటో చెప్పు అన్నది'' పులి. ''ఏం లేదు పులి మామా నువ్వు తెలివిలేనివాడ వంట, మూర్ఖుడవంట! అంటున్నారు అది విన్న నాకు చాలా బాధేసింది అది నీకు చెబుదామని వచ్చాను'' అన్నది. ''ఎవరు? ఎవరు? ఆ మాటలు అన్నది?'' అని అరచింది పులి, ''ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులు నీ ముందు మంచిగా నటిస్తూ నిన్ను తిట్టి పోస్తున్నాయి'' అన్నది పిల్ల కుందేలు. ''అవునా!'' అంటూ ఆశ్చర్యపోయిన పులి, పిల్ల కుందేలు చెప్పేవి వినసాగింది. ఆ రోజు నుంచి పులితో పిల్ల కుందేలు రోజూ కబుర్లు చెప్పసాగింది! ఆ విధంగా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. పిల్ల కుందేలు చెప్పే విషయాలను పులి పూర్తిగా నమ్మసాగింది.
తన పిల్ల పులితో స్నేహంగా ఉంటుందన్న విషయాన్ని తెలిసిన తల్లి కుందేలు భయపడుతూ ''నువ్వు పులితో స్నేహం చేయడం మంచిది కాదు, అది మీ నాన్నను చంపి తినేసింది, క్రూర జంతువుతో స్నేహం మానుకో'' అని నచ్చజెప్పింది కానీ పిల్ల కుందేలు ''ఏమీ కాదమ్మా! ఎంత క్రూర జంతువైనా మనం చెప్పే విధానంలో సరిగ్గా చెబితే వింటుంది!, నేను పులిని మారుస్తాను నాలాగా ఇంకా ఎవరు తండ్రిని కోల్పోయి బాధపడకూడదు!'' అని అన్నది పిల్ల కుందేలు. ''నీ ఆశయం బాగానే ఉంది కానీ నీకు ఏమన్నా అవుతుందేమోనన్న భయం'' అన్నది తల్లి కుందేలు. ''నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అమ్మా! మేము మంచి స్నేహితులమయ్యాం అయిన ఆపద వస్తే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో నువ్వు నాకు నేర్పించావు కదా'' అన్నది పిల్ల కుందేలు.
ఒకరోజు పిల్ల కుందేలు పులిని వెంటబెట్టుకుని తన ఇంటికి రావడాన్ని దూరం నుంచి గమనించిన కుందేలుకు ప్రాణం పోయినంత పనైంది! ఏం చేయాలో తెలియక పారి పోదామంటే పులి పక్కన తన పిల్ల ఉంది పారిపోతే దానిని చంపేస్తుందేమో అని ధైర్యం చేసి పారిపోకుండా అక్కడే ఉంది. పులితో వచ్చిన పిల్ల కుందేలు ''అమ్మా! ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడాల్సిన అవసరం లేదు, పులి మామా పూర్తిగా మారిపోయింది! ఇప్పుడు ఈ పులి మామ జంతువులను చంపి తినకుండా కేవలం చనిపోయిన జంతువులను మాత్రమే తింటుంది!. వేటిని ఇక నుంచి చంపదు!'' అన్నది ''అవును మిత్రమా! కుందేలు నీ పిల్ల వల్ల నా తప్పును నేను తెలుసుకున్నాను. అడవిలో ఉన్న జంతువుల స్వభావం నీ పిల్ల నాకు తెలియచెప్పి నా కళ్లు తెరిపించింది! నన్ను క్షమించు కుందేలు మిత్రమా! నీ భర్తను చంపి తిన్నందకు, ఇక నుంచి ఏ జంతువునూ చంపి తినను నేనే కాదు ఈ అడవిలో ఉన్న అన్ని మాంసాహార జంతువులు కూడా ఈ పద్ధతినే పాటించాలి అని చాటింపు కూడా వేయిస్తాను'' అన్నది పులి.
తెలివితో, చాకచక్యంతో, ధైర్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పులి మనసును మార్చినందుకు పిల్ల కుందేలును అభినందనలతో ముంచెత్తాయి అడవిలో ఉన్న జంతువులు అన్నీ! అది చూసిన తల్లి కుందేలు ఆనందంతో మురిసిపోయింది. అప్పటి నుంచి అడవిలో ఉన్న జంతువులు అన్ని హాయిగా ఏ భయం లేకుండా జీవించ సాగాయి.
- ఏడుకొండలు కళ్ళేపల్లి, 9490832338