Sat 19 Feb 23:13:21.691768 2022
Authorization
అనగనగా ఒక రాజు. ఆయన పరిపాలనలో రాజ్యంలోని ప్రజలంతా సుఖంగా ఉండేవారు. రాజుగారికి వయసు మీద పడుతుం డడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈ మధ్య తరుచుగా వస్తున్నాయి. తన వల్ల రాజ్యప్రజలు ఇబ్బంది పడకూడదు కనుక తన కుమారుడికి రాజ్యపాలన అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. యువరాజు విక్రమసింహుడు అన్ని యుద్ధ విద్యలలోనూ, సకల శాస్త్రాలలోనూ ఆరితేరినవాడు , రాజుగా బాధ్యతలు చేపట్టడానికి అన్ని విధాలా అరుÛ్హడు. కానీ మహారాజుగారు విక్రమసింహుడికి పట్టాభిషేకం చేయకుండా ఇంత కాలం ఆగడానికి గల కారణం విక్రముడి గర్వం. తాను తలుచుకుంటే ఏదయినా సాధ్యం అనే గర్వం యువరాజులో చిన్నప్పటి నుంచే ఉన్నదే. అయితే వయసుతో పాటు అతనిలో మార్పు వస్తుందని మహారాజుగారు ఇన్నాండ్ల ఎదురు చూశారు. గర్వం మనిషిలో వివేకాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల తన కుమారుడికి పాలన అప్పగిస్తే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడతారో అని రాజుగారి భయం. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది.
ఒక రోజు మహారాజు విక్రముడిని పిలిచి ''కుమారా ! నీకు మహారాజుగా బాధ్యతలు అప్పగించే ముందు నేను చేయలేకపోయిన మూడు పనులు నీకు అప్పగిస్తున్నాను. వాటిని నువ్వు పూర్తి చేసి చూపించగలవా?'' అని అడిగారు. తన శక్తియుక్తుల పట్ల అపార నమ్మకంగల యువరాజు తప్పకుండా పూర్తి చేయగలను అని తండ్రి చెప్పి రాజుగారు ఆదేశించిన పనులను పూర్తి చేయడానికి బయలుదేరాడు .
రాజు గారు ఇచ్చిన సూచనల ప్రకారం రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిని ఆనుకుని ఉన్న ఊరిలోని ముసలి అవ్వను కలిసాడు . ఆ అవ్వకు తన గురించి పరిచయం చేసుకుని ఆమెకు ఏమి కావాలో కోరుకోమని చెప్పాడు యువరాజు. ఆ అవ్వ ''యవ్వనంలో నా తల్లిదండ్రులతో గడిపిన క్షణాలు జీవితంలో అత్యంత మధురమైనవి. నాకు మళ్ళీ అప్పటి ఆనందాన్ని పొందాలని ఉంది. నీవు తిరిగి తేగలవా నాయనా'' అని అడుగుతుంది. యువరాజు ఆశ్చర్యపోతాడు. కొంచెం తేరుకుని'' అవ్వా! గడిచిన కాలాన్ని తిరిగి ఎలా తేగలను? నన్ను క్షమించు'' అని నిస్సహాయంగా వెనుదిరుగుతాడు. రాకుమారుడికి కాలం ఎంత విలువైందో అర్ధమయ్యింది.
అక్కడ నుంచి తండ్రి చెప్పిన రెండో పనిని అయినా పూర్తిచేయాలని అనుకుంటూ పొరుగు రాజ్యానికి వెళతాడు. అక్కడ తండ్రి చిన్ననాటి మిత్రుడిని కలిసి తను ఏ విధంగా అతనికి ఉపయోగపడగలనో సెలవీయమంటాడు యువరాజు. అప్పుడు అతను ''నేను మీ తండ్రి చిన్ననాటి నుంచి ఆప్తమిత్రులము. ఒకనాడు మా ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో నేను మీ తండ్రిని నా మాటలతో బాధపెట్టాను . మహారాజు అయినా మీ నాన్న నన్ను క్షమించి మా స్నేహాన్ని కొనసాగించాడు .నా తప్పును సరిదిద్దుకోవడానికి అప్పటి నుంచి ఎన్ని సార్లు క్షమించమని అడిగినా నాకు సంతృప్తి లేదు. ఆ రోజు నేను అన్న మాటలను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. నాకు జీవితంలో అదొక్కటే అసంతృప్తి. నీకు వీలుంటే నా బాధ తీర్చు'' అని చెప్పాడు. యువరాజు ''ఆడిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని మీకు కూడా తెలుసు కదండీ. మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి'' అని బాధగా అక్కడి నుంచి కదిలాడు రాకుమారుడు. మహారాజు స్థానంలో ఉండి కూడా స్నేహం కోసం అహాన్ని వదిలిన తండ్రికి మనస్సులోనే నమస్కరించాడు.
తండ్రి అప్పగించిన మూడో పనైనా తన వలన సాధ్యపడుతుందా అనే సంశయంతో గమ్యంవైపు వెళ్ళాడు. దట్టమైన అడవిలో చెట్టు కింద ఉన్న మనిషిని చూశాడు. ఆ మనిషి ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. అతని వద్ద నుంచి అతి విలువైన వస్తువును తీసుకురమ్మని తండ్రి చెప్పాడు. ఆ మనిషి పక్కనున్న కొలనులో మునిగి గంటసేపు పాటు అతనికి తెలిసిన వేదశాస్త్రాలను వల్లించాడు. అలా అతని దినచర్యనంతా గమించిన రాకుమారునికి అతని వద్దనున్న విలువైన వస్తువు అతని విద్య అని అర్ధమైంది. అతనినే గమనిస్తూ ఆ రోజు తనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. సకల విద్యలలోనూ తానే మేటి అనుకున్న యువరాజు గర్వం పటాపంచలైంది. నిత్యం విద్యార్ధిగా కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటేనే తన తండ్రి వలె రాజ్యాన్ని జనరంజకంగా పాలించగలనని అర్ధమయ్యింది.అక్కడి నుంచి మౌనంగా రాజ్యానికి బయలుదేరాడు.
తండ్రి అప్పజెప్పిన మూడు పనులలో ఒక్కటి కూడా తను చేయలేకపోయినందుకు యువరాజు నిరుత్సాహంగా రాజ్యానికి వెళ్లి మహారాజుని క్షమించమని కోరి ''తండ్రీ! దేన్నైనా గెలవగలననే నా గర్వానికి గుణపాఠం నేర్పింది ఈ ఓటమి. గర్వంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించారు'' అని తండ్రి పాదాలపై పడతాడు. తన కుమారుడు పట్టాభిషేకం చేయించుకునే యోగ్యత సాధించినందుకు మహారాజు ఆనందంగా విక్రముడిని ఆలింగనం చేసుకుంటాడు.
- డా|| హారిక చెరుకుపల్లి, 9000559913