Sun 27 Mar 07:08:51.937526 2022
Authorization
ఒక చిన్న పల్లెటూరిలో వెంకడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన తాతలకాలం నుండి వస్తున్న వత్తినే నమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. వెంకడి మంచితనం వలన ఆ ఊళ్ళోని వారందరూ తమ బట్టలు ఉతకడానికి వెంకడికే ఇచ్చే వారు. వెంకడు ఎంతో శ్రద్ధగా తన పని చేసుకునేవాడు. వెంకడి కొడుకు రాములు. కొంచెం బద్ధకస్తుడు. తండ్రికి పనిలో కొంచెం సహాయంగా ఉండమంటే రాములు చదువుకుంటా నంటూ పని నుండి తప్పించుకునేవాడు. రాములు చదువు పట్ల ఆసక్తి చూపుతున్నందుకు వెంకడు చాలా సంతోషించేవాడు. తండ్రి దగ్గర తప్పించుకోవడానికి రాములు చదువును ఒక వంకగా వాడుకోవడం మొదలుపెట్టాడు. నిజానికి రాములుకి చదువుకో వడం అసలు ఇష్టం ఉండేది కాదు. వెంకడు తను సంపాదిం చిన ప్రతీ రూపాయిని రాములు చదువు కోసం అడిగిందల్లా కొనడానికే ఖర్చు పెట్టేవాడు.
అలా ఎదుగుతున్న కొద్దీ రాములు తండ్రిని మోసం చేస్తూ చదువు పేరుతో డబ్బులు తీసుకుని వథాగా ఖర్చు పెట్టేసే వాడు. కొంత కాలానికి రాములు చదువు సంగతి పూర్తిగా నాటకమని తేలిపోయింది.అప్పటి నుండి వెంకడు కొడుకుని తనతో పాటు బట్టలు ఉతకడానికి రమ్మని పిలిచేవాడు. తను నమ్ముకున్న వత్తి అయినా రాములుని సరైన దారిలో పెడుతుందని వెంకడు ఆశించాడు. కానీ రాములు తండ్రి మాట వినకుండా బట్టలు ఉతకడం తనకు గౌరవం కాదని అనుకున్నాడు. పైగా ఊరంతా బట్టలు తండ్రికే ఇస్తారు కనుక తండ్రి సంపాదనతో తిండికి లోటు ఉండదను కున్నాడు. వెంకడుకి ఓపిక ఉన్నంతకాలం బట్టలు ఉతుకుతూ కుటుంబాన్ని పోషిం చాడు. వయసు పైబడడంతో ఇంక పని చేయలేక విశ్రాంతి తీసుకోవాలని ఒక రోజు కొడుక్కి చెప్పకుండా ఆశ్రమా నికి వెళ్ళిపోయాడు. వెళ్తూ రాములు కోసం బట్టలు ఉతక డానికి ఒక కొత్త బండని ఇంట్లో ఉంచి వెళ్ళాడు.
తండ్రి తన కోసం ఎంతో కొంత సొమ్ము వదిలి పెట్టి ఉంటాడని రాములు ఇల్లంతా వెతికాడు. ఏమీ కనపడ లేదు కొత్త బండ తప్ప. డబ్బు కాకుండా ఉపయోగం లేని బండను ఇచ్చినందుకు తండ్రిని బాగా తిట్టుకున్నాడు. అప్పటికే ఊరిలో సోమరిగా పేరున్న రాములు కి ఎవరూ పని ఇవ్వడానికి ముందుకు రాలేదు. నాలుగు రోజులుగా ఆకలితో బాధపడి నీరసించిన రాములుని చూసి కొందరు జాలిపడి అతడి తండ్రి వత్తినే కొన్నాళ్ళు చేయమని సలహా ఇచ్చారు. అలాగే వాళ్ళ బట్టలు ఇచ్చి రాములుకి పని చేసే అవకాశం ఇచ్చారు. తండ్రి వదిలిన బండను వాడక తప్పలేదు రాములుకి. మొదటి రెండు రోజులు చాలా కష్టంగా అనిపించింది. తండ్రి ఎంత కష్టపడి సంపాదించేవాడో అర్ధమయ్యింది. తను సరిగ్గా చదువుకో నందుకు బాధపడ్డాడు. ఎలాగో నాలుగు డబ్బులు సంపాదించుకున్నాడు.
కొన్నాళ్ళు గడిచేసరికి రాములు పనితనం ఊరిలో తెలిసి అందరూ వెంకడికి ఇచ్చి నట్టే వాళ్ళ బట్టలన్నీ రాములుకి ఇవ్వడం మొదలుపెట్టారు. పని లో పడ్డ రాములుకి ఇప్పుడు సంపాదనకు లోటు లేదు. కానీ కొత్త చిక్కొకటి వచ్చి పడింది. తన బట్టల బండ రోజురోజుకీ అరిగిపోతోంది. బండ చిన్నదై పోతోంది. తన అనుమానం నిజమో కాదో తేల్చుకోవడానికి కొలిచి మరీ చూసుకున్నాడు రాములు. నిజమే! బండ అరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే తన బతుకు బాగుంది అనుకుంటుండగా ఇలా బండ అరిగిపోతుండడంతో భయం వేసింది రాములుకి. ఈ విషయం ఎవరికైనా చెప్తే తనకు బట్టలు ఇవ్వడం మానేస్తారేమోనని ఎవరికీ చెప్పలేదు. బట్టలు ఉతుకుతూ తన పని తను చేసుకుంటున్నా రాములుకి ఒక పక్క బెంగ గానే ఉంది. ఎందు కంటే ఆ బండ అతనికి దైవంతో సమానం.
ఒక రోజు బాగా ఎక్కువ బట్టలుం డడంతో రాములు పనిలో నిమగమై ఉండగా ఒక్కసారిగా బండ బద్దలైంది. రాములు భయంతో వణికిపోయాడు. బండ లోపల చిన్న మూట ఉంది. దానిని తెరిచి చూశాడు రాములు. అందులో తండ్రి దాచి ఉంచిన డబ్బు ఉంది. దానితో ఒక ఉత్తరం ''నీకు శ్రమ విలువ తెలిసిన రోజున దక్కిన ఫలితం ఇది'' అని ఉంది. దానితో పాటు తండ్రి మెడలో ఎప్పుడూ ఉండే తాయెత్తు. రాములు ఎంతో ఇష్టంగా దానిని మెడలో వేసుకున్నాడు.
- డా|| హారిక చెరుకుపల్లి,
9000559913