Sat 09 Apr 23:58:21.934056 2022
Authorization
పార్వతీపురంలో ఉండే సీతమ్మ మనవడు సోమన్న రావి చెట్టు నీడలో పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. అందరూ వెళ్ళాక సోమన్న రావి చెట్టును అనుకుని నిదుర పోసాగాడు. వచ్చిపోయే వారంతా ''సోమరిపోతు సోమన్నా.. నిదురపో నాయనా.. బాగా నిదురపో... నాయనమ్మ పెంచి పోషిస్తుంటే కాస్తయినా సిగ్గుపడడం లేదు'' అని అనుకుంటూ వెళ్లసాగారు. ఆ చెట్టు పైన ఉన్న ఒక చిలుక, పావురంతో ''వారి మాటలు విన్నప్పుడల్లా నాకు ఎంతో బాధ కలుగుతోంది... ఈ సోమన్నను ఎలాగైనా మార్చాలి'' అని అంది. ''సరే నువ్వు ఏం చేద్దామను కుంటున్నావో చెప్పు నీకు నేను సహకరిస్తాను'' అంది పావురం.
చిలుక పావురం చెవిలో ఏదో చెప్పింది. చిలుక చెట్టుపై నుండీ కిందకు వచ్చి సోమన్న ముందర మట్టిలో పడి ''దాహం దాహం'' అని దొర్లసాగింది. ఆ మాటలకు సోమన్న లేచి చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు పావురం వచ్చి ''నేను నీళ్ల బావిని చూపిస్తాను పద'' అని అంది.
పావురం ఎగురుతూ వెళుతుంటే సోమన్న అటువైపు వెళ్ళాడు. బావి వద్ద ఉన్న చేదతో నీళ్లు తోడి చిలుకకు తాగించాడు. ''హమయ్య... నా దాహం తీరింది... నీకు కతజ్ఞతలు'' అని అంది చిలుక. సోమన్న చిలుకను చేతిలోకి తీసుకుని ముందుకు నడుస్తూ వెళుతుంటే ''నువ్వు ఏమీ అనుకోకు ఇప్పుడు నాకు కాస్త ఆకలేస్తోంది?'' అంది చిలుక.
''నాతో రా కొద్ది దూరంలో ఒక మామిడి చెట్టు ఉంది'' అంది పావురం. ''నీకు ఇష్టమైనవి జామ పండ్లు కదా.. మామిడి పండ్లు కూడా తింటావా?'' అన్నాడు సోమన్న.
''ఆకలి తీరాలంటే అన్ని రకాల పండ్లు తినాల్సిందే'' అంది చిలుక.
సోమన్న చిలుకను చెట్టు కింద వదిలేసి మెల్లగా చెట్టు ఎక్కి రెండు బాగా మాగిన మామిడి పండ్లు తెంపి చెట్టు దిగి వచ్చాడు. అక్కడ చిలుక లేదు. పావురాన్ని అడిగితే చిలుక ఎగిరిపోయింది అని చెప్పింది.
''ఈ పండ్లను ఏం చేయాలి?'' అన్నాడు సోమన్న అమాయకంగా. ''నువ్వే తిను'' అని పావురం కూడా ఎగిరి పోయింది. అప్పటికే ఎంతో అలసిపోయిన సోమన్నకు నిజంగానే ఆకలేసింది. ఆ రెండు మామిడి పండ్లను తిన్నాడు. తిరిగి వస్తూ బావి వద్దకు వచ్చి దాహం తీర్చుకుంటుండగా ఒక అవ్వ కడవతో వచ్చి ''మా కోడలి ఆరోగ్యం బాగు లేదు ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క నీళ్లు లేవు. కాస్త నీళ్లు తోడి పెట్టు నాయన'' అని అంది.
సోమన్న చేదతో కడవ నింపాడు. అవ్వ కడవను లేపలేక పోయింది. ''అవ్వా మీ ఇల్లు చూపించు కడవను తీసుకు వస్తాను'' అన్నాడు సోమన్న. ''పద నాయనా'' అని అవ్వ ఇంటి దారి పట్టింది. సోమన్న కడవను అవ్వ ఇంట్లో పెట్టాడు ''నాయనా! నీళ్లు తోడి కడవను ఇంటి దాకా చేర్చావు... నీ రుణం ఉంచుకోకూడదు'' అని సోమన్నకు ఒక రూపాయి ఇచ్చింది అవ్వ.
సోమన్న ఆ రూపాయి తీసుకున్నాడు. ఇంటి దారి పడుతుండగా ఒక తాత ఎక్కువ బస్తాలున్న లాగుడు బండిని లాగా లేక అవస్థ పడుతుంటే సోమన్న చూసి ''తాతా.. నేను బండిని వెనుక వైపు తోస్తాను నువ్వు లాగు'' అన్నాడు. ''అలాగే నాయనా!'' అన్నాడు తాత. సోమన్న తోయగానే బండి కదిలింది. ''నాయనా ఆయాసంగా ఉంది సంత వరకూ సాయం పట్టవా?'' అన్నాడు తాతా. ''అలాగే తాతా'' అని బండిని సంత వరకూ తోశాడు సోమన్న.
''వస్తాను తాతా'' అని సోమన్న వెళ్లబోతుండగా ''ఆగు నాయనా. నాకు ఎంతో సాయం చేశావు. నీ కష్టం ఉంచుకోకూడదు ఇదిగో ఈ మూడు రూపాయలు తీసుకో'' అని ఇచ్చాడు. సోమన్న తాత ఇచ్చిన ఆ మూడు రూపాయలు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు.
''ఏరా సోమూ.. పొద్దుననగా వెళ్లి ఇప్పుడు వస్తున్నావు'' అని ఆందోళన పడింది సీతమ్మ. సోమన్న జరిగింది చెప్పాడు. ''అయితే ఈ రోజు నీ సంపాదన నాలుగు రూపయాలన్న మాట'' అంది సీతమ్మ. ''అవును నానమ్మా'' అన్నాడు సోమన్న. ''నువ్వు ఇలాగే కష్టపడి పని చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి. అప్పుడు నిన్ను ఎవ్వరూ సోమరి అని అనరు'' అంది సీతమ్మ.
అది మొదలు సోమన్న సోమరితనాన్ని పక్కన పెట్టి కష్టపడడం నేర్చుకున్నాడు. పెరటిలోని జామ చెట్టు మీద నుండి చిలుక ఎగిరి వచ్చి సోమన్న చేతి మీద వాలి ''బాగున్నావా? సోమన్న'' అని అంది. ''నీ వల్లే నా సోమరితనం పోయింది'' అన్నాడు సోమన్న.
- యు.విజయశేఖర రెడ్డి