Sat 16 Apr 23:33:07.853058 2022
Authorization
నిభిడారణ్యంలో నివసించే జింకకు ఆ రోజు నీళ్ళు ఎక్కడా కనపడలేదు. వెదుక్కుంటూ వెదుక్కుంటూ పక్కనే ఉన్న ముదిగుబ్బ గ్రామం వెళ్లింది. అలా వెళ్ళిందో లేదో దాన్ని చూసిన ఊర కుక్కలు మూడు వెంటపడ్డాయి. వాటికి దొరక్కుండా బలం కొద్దీ పరిగెత్తింది. అయినా రెండు కుక్కలు వెనుక తొడల మీద కరిచాయి. చంపి తినడానికి విశ్వ ప్రయత్నం చేశాయి. జింక తప్పించుకొని ప్రాణ భయంతో వేగంగా పరిగెత్తి ఊరి చివరనున్న గుడిసెలో దూరింది. ఆ గుడిసె ఒక మోచోడిది. భార్య, భర్త ఇద్దరూ గేదె తోలు ముందేసుకొని ఇంటి ముందు చెప్పులు కుడుతున్నారు . కుక్కలు పరిగెత్తుకొని రావడం చూసి, పక్కనున్న కర్ర చేతిలోకి తీసుకున్నాడు. కుక్కలు నిలబడి గసపోస్తూ, 'నోటికాడి మాంసం కాస్తా జారిపోయెనే' అని చింత పడుతూ, 'ముందుకు వెళితే పట్టు కర్రతో దెబ్బలు తప్పవు' అనుకొని మెల్లగా వెనక్కు మళ్ళాయి.
''ఇంట్లోకి ఏదో పరిగెత్తుకొని వచ్చింది. ఎవరి లేగదూడ...? ఈ మాయదారి కుక్కలు ఒంటరిగా కనపడితే గొర్రెల్ని కూడా బతకనీయడంలేదు. కాపరులు తెగ యాతన పడుతున్నారు. వాళ్ళ కుక్కల్ని కూడా ఏమార్చి మేకల్ని, గొర్రెల్ని చంపుతున్నాయి. గ్రామ పెద్దను కలిసి ఈ కుక్కల్ని అదుపు చేయమని చెప్పాలి'' అనుకుంటూ లేచి బుడ్డయ్య గుడిసెలోకి వచ్చాడు. కుండల చాటున నక్కి గడగడా వణుకుతూ కనిపించింది జింక.
వెనకాలే వచ్చిన బుడ్డమ్మ ''లేగ దూడ కాదండీ. జింక పిల్ల. ఇవ్వాళ్ళ మన పంట పండింది. దీని మాంసం చాలా ఖరీదైనది. ఇంక దీని తోలుతో డబ్బు సంచులు, సిరి చాపలు తయారు చేయొచ్చు'' అంది.
''ఛా .. ఊరుకో. మనిషైనా, జంతువైనా - ప్రాణ భయంతో శరణని వచ్చిన ప్రాణిని కాపాడటం మనిషి ధర్మం. కుక్కలు వెంట పడితే మన గుడిసె రక్షించింది. దీన్ని తల్లి వద్ద అడవిలో వదిలేసి రావడం మన ధర్మం'' అన్నాడు.
''నువ్వు ఒట్టి పిచ్చోడిలాగున్నావే. వదిలేస్తే మనకేమొస్తుంది. చంపితే, దీని మాంసానికి, చర్మానికి నాలుగు డబ్బులు వస్తాయి. చెవి కమ్మలు చేయించుకోవచ్చు'' అంది బుడ్డమ్మ.
''మనం ఇంతవరకు ఎప్పుడూ బతికున్న జంతువులని చంపి, వాటి తోలు తీసుకోలేదు. చనిపోయిన వాటితోనే చెప్పులైన, చెండ్రా కోలలైనా తయారు చేస్తున్నాము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిని మనలాగే బతకనివ్వాలి'' బుడ్డయ్య సౌమ్యంగా చెప్పాడు.
అయినా బుడ్డ మ్మ ఊరుకోక గుడిసె అంచుకు దోపిన కత్తిని చేతిలోకి తీసుకుంది చంపేందుకు.
''అమ్మా, నన్ను చంపకు. నీకు చెవి కమ్మలేగా కావలసింది. నా దగ్గర ఉన్నాయి. ఇస్తాను'' అంది.
ఆశ్చర్యపోయిన బుడ్డమ్మ ''నాకు మాత్రమే ఇస్తే సరిపోదు. మా ముసలయ్యకు బంగారు కడియం కావాలి.'' అంది కత్తి చూపి భయపెడుతూ.
''మీ ఇద్దరికీ కోరుకున్న ఆభరణాలు ఇస్తాను. నేను కోలుకొని, నా స్థావరానికి వెళ్లనీయండి'' అంది.
''మనం చేసే సహాయం ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. దాని ప్రాణంతో మనం లాభం పొందాలనుకోవడం మంచిది కాదు.'' అన్నాడు బుడ్డయ్య.
''మహా చెప్పొచ్చావులే. అది బంగారం ఇస్తానంటుంటే, వద్దనే వాడ్ని నిన్నే చూస్తున్నా. నీకు లేకున్నా నాకు కావాలి ఆభరణాలు'' అంది విసురుగా.
''పొట్ట, బట్ట వెళుతుంది కదా. ఇది చాలు మనకు. అయినా నువ్వు వినవులే. భయపెట్టి తీసుకునే ఏదైనా అనర్థాన్నే తెస్తుంది'' అన్నాడు భార్యతో. తరువాత జింకతో ''నాకెందుకమ్మా బంగారం. ముందు నీ గాయాలు మాననీ'' అన్నాడు జింకను ప్రేమగా చేతిలోకి తీసుకుంటూ. దాని అందమైన రూపాన్ని చూసి ముద్దు పెట్టాడు. గాయాన్ని చల్లటి నీటితో కడిగి, పసుపు అద్ది, గుడ్డతో కట్టు కట్టాడు. పచ్చ గడ్డి కోసుకొచ్చి, దాంతో పాటు తాము తినే అన్నం కూడా జింకకు పెట్టి భద్రంగా చూసుకున్నాడు. వారం దినాల్లో గాయం మానిపోయింది.
''ఇంక వెళతాను. మీరొస్తే, ఆభరణాలు ఇస్తాను.'' అంది జింక.
బుడ్డయ్య జింకను భుజం మీదకు ఎత్తుకొని, రక్షణగా కర్ర తీసుకొని అడవి బాట పట్టాడు. వెనుకాలే బుడ్డమ్మ చెవి కమ్మల కోసం బయలు దేరింది. అడవి లోపలకు వెళ్ళాక ''ఇక్కడ దించండి'' అంది జింక.
బుడ్డయ్య దింపగానే, గంతులు పెడుతూ, పక్కనే ఉన్న గుట్ట ఎక్కింది. కొద్ది సేపట్లోనే చెవి కమ్మలు, బంగారు కడియం నోటితో తీసుకొని వచ్చింది. బుడ్డమ్మ వాటిని సంబరంగా అందుకొని, కమ్మలు రెండూ చెవులకు పెట్టుకుంది. భర్త చేతికి కడియం తొడిగింది. జింక వెనక్కు మళ్లగానే, గ్రామం వైపు నడక సాగించారు దంపతులు.
బుడ్డయ్య చేతి కడియం కాంతులు వెదజల్లుతూ మెరిసి పోసాగింది. బుడ్డయ్య ముసలిదేహం క్రమేపీ యవ్వనంగా తయారవసాగింది. బుడ్డమ్మ చెవికమ్మలు అడుక్కు ఔన్సు చొప్పున బరువు పెరగసాగాయి. వాటిని తీద్దామని ఎంత ప్రయత్నం చేసినా చెవికి అతుక్కొని ఊడి రాలేదు. అవి చెవిని కోసుకుంటూ మూరెడు కిందికి సాగాయి. అడవి దాటేసరికి కమ్మల బరువుకు తల, నడుము వంగిపోయి గూని రూపం వచ్చేసింది బుడ్డమ్మకు .
''నేను చెప్పానా. నిర్మల హదయంతో సహాయం చేయాలని. స్వార్థంతో, భయపెట్టి ఆభరణాలు ఆశించావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు'' అన్నాడు.
ఆమె చనిపోయేదాకా చెవి కమ్మలతో పాటు గూని రూపం అల్లాగే ఉండిపోయింది.
- పుప్పాల కష్ణమూర్తి