Sat 23 Apr 23:59:53.665115 2022
Authorization
సిద్ధవరం గ్రామంలో నివసించే రైతు రామయ్యకు ఒక్కగానొక్క కొడుకు సూరయ్య. రామయ్యకు పదెకరాల పొలం ఇల్లూ ఉన్నాయి. ఆస్తికన్నా చదువే విలువైనదని గ్రహించిన రామయ్య తన గ్రామంలోని పాఠశాలలో సూరయ్యను చేర్పించాడు.
రామయ్య పొలం పనులలో నిమగమయ్యాడు. చెడు సావాసాలకు దగ్గరైన సూరయ్య బడికి డుమ్మా కొట్టసాగాడు. ఊరి బయట చింతచెట్ల కిందకు తన సావాసగాళ్ళతో కలసి వెళ్ళేవాడు. ఆటలాడేవాడు, ఆటలలో పందేలు కాసేవాడు.
అప్పు తీర్చడం కోసం అమ్మను బతిమాలేవాడు. డబ్బులు ఎందుకని అమ్మ అడిగితే బళ్ళో స్నేహితులకు సహాయం కోసమని అబద్దం చెప్పేవాడు. సందేహం కలిగి అమ్మ ఇవ్వనపుడు ఇంట్లో అమ్మ దాచుకున్న డబ్బులు దొంగిలించే వాడు. విషయం గ్రహించి అమ్మ జాగ్రత్త పడేసరికి బయట దొంగతనాలు మొదలు పెట్టాడు సూరయ్య.
తన కొడుకు దారితప్పుతున్న విషయం ఆనోటా, ఈ నోటా రామయ్యకు తెలిసింది. ఈలోగా ప్రదానోపాధ్యాయులు నుండి కబురు రావడంతో బడికి వెళ్ళాడు. సరిగా బడికి రాకపోవడం, చదువులో వెనుకబాటుతనం తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చి కొడుకును దగ్గర కూర్చో పెట్టుకొని జీవితంలో తాను పడిన కష్టాలను వివరించాడు. చదువుకొని క్రమ శిక్షణతో పైకెదిగిన ఆగ్రామ యువకుల జీవితాలను కథలుగా చెప్పాడు.
తండ్రిగా నిన్ను నేను దండించగలను. కానీ, స్నేహితునిగా చెబుతున్నా, పెద్దవాడివి అవుతున్నావు. అర్ధం చేసుకో హితవు చెప్పాడు తండ్రి.
కాలం గడిచిపోసాగింది. పెద్దలు చెప్పిన సుద్దులు సూరయ్య చెవికెక్కలేదు. దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. అందినచోట అప్పులు చేయసాగాడు.
పరిస్థితి చేయదాటకముందే తగిన చర్యలకు ఉపక్రమించాడు రామయ్య. కొంత పొలం అమ్మి అప్పులు తీర్చాడు. ఊళ్ళో అప్పు దొరకకుండా జాగ్రత్త వహించాడు.
అలవాట్లుకు బానిసై అవసరాలు తీరక పోవడంతో ఒరోజు తండ్రిని ఆస్తిరాసివ్వమని అడిగాడు సూరయ్య, ఇది నా కష్టార్జితం, వద్ధుల ఆశ్రమానికి రాసిచ్చి మేమూ అక్కడికే వెళతాం ! కఠినంగా చెప్పాడు తండ్రి.
నేను నీ కొడుకును నీ ఆస్తికి వారసుణ్ణి, కనుక ఆస్తి నాకే చెందుతుంది అన్నాడు సూరయ్య.
నిజమే ! నువ్వు నా వారసుడివే నీకు జన్మనిచ్చింది నేనే. నీకు పొట్టతో పాటు రెండు చేతులు కూడా ఇచ్చాను. ఆ చేతులతో పనిచేసుకోని పొట్టను పోషించుకో.. తెగేసి చెప్పాడు తండ్రి.
ఆకలి బాధేమిటో తెలిసింది సూరయ్యకు. ఆకలి చెడు పనులు చేయించడమే కాదు... మంచి వైపు కూడా మళ్ళిస్తుంది పొట్ట చేతుల మర్మం బోధపడింది సూరయ్యకు. ఇప్పుడు మార్పు వైపు అడుగువేస్తున్నాడు సూరయ్య.
- బొల్లేపల్లి మధుసూదనరాజు
9440002982