Sat 30 Apr 23:59:50.627012 2022
Authorization
పూర్వం త్రిలింగ దేశాన్ని నాగభైరవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కషి చేసేవాడు. సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండేవి. అతని పాలనలో ప్రజలు సుఖసంపదలతో తులతూగుతూ ఉండేవారు.
ఒకానొక సమయంలో త్రిలింగ దేశంలో ఒక వింత జబ్బు వచ్చింది. చాలా మంది ప్రజలు చనిపోయారు. అలాగే సైనికులు కూడా చనిపోయారు. అదే అదనుగా త్రిలింగ రాజ్య సంపదలను చూసి ఓర్వలేని పక్కదేశపు రాజు పెద్ద సైన్యంతో త్రిలింగ మీదకి దండెత్తి వచ్చాడు. నాగభైరవుడు పరాజయం పొందాడు. అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు.
తన ప్రజలు పరాయి రాజు పాలనలో బాధలు అనుభవించడం, తన పరాజయం కంటే ఎక్కువగా నాగ భైరవుడిని బాధించింది. పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. ఇక తను బతికి ఉండటం వధా అనుకోసాగాడు.
నాగభైరవుడు ప్రతిరోజూ కొంత సమయం అడవిలో తను ఉన్న గుహ బయటికి వచ్చి పరిసరాలు పరిశీలిస్తూ ఉండేవాడు. ఒకసారి నాగభైరవుడు అలా గుహ బయటకు వచ్చినప్పుడు ఒక పిల్లకోతి ఒక చెట్టు ఎక్కింది. అది ఆ చెట్టు కాయలు తింటూ తింటూ ఆ చెట్టు మీద ఉన్న కాకి గూడును పడగొట్టటం అతని కంటపడింది. ఆహారం కోసం బయటకు వెళ్ళిన కాకి సాయంత్రానికి తను నివసించే చెట్టు వద్దకు తిరిగి వచ్చింది. పడిపోయిన తన గూడును చూసి ఎంతో విచారించింది. రాత్రంతా నిద్రలేకుండా చెట్టు కొమ్మ మీద ఉంది. తెల్లారినాక పడిపోయిన గూటిని చాలా కష్టపడి కట్టుకుంది.
మరుసటి రోజు కూడా అదే కోతి ఆ చెట్టు ఎక్కి కాయలు తింటూ ఆ కాకి గూడును మళ్లీ పడగొట్టింది. ఆహారం కోసం బయటకు వెళ్ళి సాయంత్రానికి తన నివాసానికి తిరిగొచ్చింది కాకి. మళ్ళీ పడిపోయిన తన గూడును చూసి ఎంతో దుఃఖించింది. చాలా కష్టపడి మళ్లీ గూటిని నిర్మించుకుంది.
తరువాత రోజు కాకి తన గూటి నుండీ ఆహారం కోసం బయటికి వెళ్ళినట్టు వెళ్లి, వెనక్కి తిరిగి వచ్చింది. తను నివసించే చెట్టుకు కొంచెం దూరంగా ఉన్న మరో చెట్టు మీద కూచుని తన గూటి వంక చూస్తూ ఉంది.
కొంచెం సేపటి తర్వాత ఎప్పటిలాగే కోతి వచ్చి కాకి గూడును పడగొట్ట సాగింది. వెంటనే కాకి అక్కడికి వచ్చి కావుకావుమని అరిచింది. మిగతా కాకులన్నీ పోగయ్యాయి. అన్నీ కలిసి తమ ముక్కులతో కోతిని పొడవసాగాయి. కోతి పారిపోతున్నా చాలా దూరం వరకు పొడుస్తూ కోతిని వెంబడించాయి. కోతి కంటికి, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత కోతిపిల్ల ఆ పరిసరాలలో కనిపించలేదు.
'చిన్న జీవి అయిన కాకి తన గూడు కోసం ఇంత చేస్తే- తెలివి, ఆలోచన కలిగిన మనిషినైన నేను నా రాజ్యం సాధించటానికి ఎంత చేయాలి? ఆత్మహత్య చేసుకొని చనిపోవడం పిరికితనం' అనుకున్నాడు నాగభైరవుడు. అతనిలోని నిరాశ పటాపంచలయింది. అతని మనసుకు కొండంత బలం వచ్చింది.
నాగభైరవుడు అడవి నుండి బయటకు వచ్చాడు. మారు వేషంలో తన రాజ్యంలోకి ప్రవేశించాడు. దుర్మార్గంగా సాగుతున్న పరాయి పాలన పట్ల ప్రజలులోని తీవ్ర వ్యతిరేకతను గమనించాడు. కొంతకాలం శ్రమించి తన సైన్యాన్ని సమీకరించాడు. అనేక మంది సాధారణ ప్రజలు రహస్యంగా సైన్యంలో చేరారు. తన బంధువైన ఒక చిన్నరాజు సాయం కూడా తీసుకున్నాడు నాగభైరవుడు. సమయం చూసి శత్రువుపై దాడి చేసి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. మళ్ళీ తన ప్రజలను యధావిధిగా పారిపాలించుకున్నాడు.
- కళ్ళేపల్లి తిరుమలరావు, 9177074280