Sat 14 May 22:58:21.83348 2022
Authorization
సంజీవపురం గ్రామంలో చంద్రయ్య అనే రైతు వుండే వాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు శ్రీవల్లి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు అదే గ్రామంలో బడికి వెళ్ళేది శ్రీవల్లి. కూతుర్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో చేర్పించాలని చంద్రయ్య పట్టుదల, కూతురు ఏది అడిగినా తక్షణమే కొనిచ్చే వాడు బాగా చదువుకొమ్మని అప్పుడప్పుడు చెప్తుండేవాడు. కొడుకుల్లేని కారణంగా అన్ని శ్రీవల్లిలోనే చూసుకునేవాడు.
రోజూలాగానే శ్రీవల్లి ఉదయాన్నే భోజనం చేసి బడికి వెళ్ళింది. పిల్లలందరూ హాజరయ్యారు ఉపాధ్యాయుడు రాగానే లేచి నమస్కరించి కూర్చున్నారు. ఈరోజు పాఠ్యాంశంగా చెట్టు పెంపకం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. పిల్లలందరూ ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు ''చెట్లు పెంచడం వలన కాలుష్యం తగ్గిపోతుంది. దాని వలన వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. మంచి గాలి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం చాలా మంచి పద్ధతి. పర్యావరణాన్ని రక్షించినవాళ్ళం అవుతాం. చెట్లు ఏపుగా పెరగడం వలన ప్రకతి ఎంతో రమణీయంగా కనిపిస్తుంది. చెట్ల వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి'' అంటూ ఉపాధ్యాయుడు బోర్డుపైన చెట్టు బొమ్మను గీసి చక్కగా వివరిస్తున్నాడు. శ్రీవల్లి ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా వింటోంది ''రేపు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ చెట్టు బొమ్మను కాగితం పైన గీసుకుని రావాలి'' అన్నాడు. అందరూ అలాగే అంటూ తలలు ఊపారు.
బడి ముగిసిన తర్వాత శ్రీవల్లి ఇంటికి వచ్చింది. ఇంటి ముందర చిన్న మొక్కను చూస్తూ కూర్చుండి పోయింది. రోజూ ఇంటికి రాగానే పుస్తకాల సంచి మూలన పడేసి తల్లి పార్వతి కొంగు పట్టుకుని ఇల్లంతా కలయతిరిగేది శ్రీవల్లి, ఈరోజు మౌనంగా కూర్చుని చెట్టు వైపే చూస్తుంటే చంద్రయ్య ఆశ్చర్యబోయాడు. ''ఏమైందమ్మా ఎందుకు అలా కూర్చున్నావు'' అని అడిగాడు. ''సారు చెట్టు బొమ్మను గీసుకురమ్మన్నాడు ఎలా గీయాలా అని చూస్తున్నాను'' అంది శ్రీవల్లి. ''ఓస్ అంతేనా నేను నేర్పిస్తానురా'' అంటూ కూతుర్ని ఇంట్లోకి తోడుకెళ్ళాడు చంద్రయ్య. కూతురు చేయు పట్టి బొమ్మ గీయించాడు.
మరుసటి రోజు బడికి వెళ్ళి అందరితోబాటు తను గీసిన బొమ్మను ఉపాధ్యాయునికి చూపించింది ''బొమ్మ చక్కగా గీసావు తల్లీ. నువ్వే గీసావా లేక ఎవరి చేతైనా వేయించుకుని వచ్చావా'' అని అడిగాడు. ''మా నాన్న నా చేయి పట్టి గీయించాడు సార్'' అంది శ్రీవల్లి. ఉపాధ్యాయుడు చాలా సంతోషించాడు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఈ మాత్రం శ్రద్ధ కనబరిస్తే చాలు, ఉన్నతంగా ఎదుగుతారు అని మనసులో అనుకుని తిరిగి పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. ఈ రోజు పాఠంలో కూడా చెట్ల ఆవశ్యకత గురించి పిల్లలకు తెలియపరిచాడు ఉపాధ్యాయుడు. ''మనం రేపటి నుండి చెట్లను పెంచడానికి నడుం బిగిద్దాం ఒక్కొక్కరు ఒక్కో చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం'' అన్నాడు ఉపాధ్యాయుడు. మరొక్కసారి పిల్లల చేత ''మనం చెట్లను నాటడానికి నడుం బిగిద్దాం'' అంటూ పలికించాడు.
ఈమాట శ్రీవల్లి మెదడులో బాగా నిలిచిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత పేరట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచించింది. నాలుగు రోజుల నుండి శ్రీవల్లిలో మౌనం గ్రహించిన చంద్రయ్యకు ఆశ్చర్యం వేసింది. అన్నం కూడా సరిగా తినడంలేదు. ఆరోగ్యం బాగలేదనుకుని ఒకరోజు అడిగాడు ''నాన్నా నాకు బెల్ట్ కావాలి'' అంది శ్రీవల్లి ''ఇంతేనా దీని కోసమేనా ఇంతగా ఆలోచిస్తున్నావు సరే తెస్తానుల'' అన్నాడు చంద్రయ్య. మరుసటి రోజే బెల్ట్ తెచ్చి శ్రీవల్లి చేతిలో పెట్టాడు. ''నాన్నా మొక్క ఒకటి తెచ్చి పెట్టు నాటాలి'' అంది శ్రీవల్లి. ''సరేనమ్మా అలాగే'' అంటూ తెచ్చి పెట్టాడు. పేరట్లోనే చిన్న పాది చేసి కూతురు కోరిక మేరకు చెట్టు నాటడానికి ప్రయత్నించాడు ''నాన్నా ఆగు అలా కాదు నేను ఇప్పుడే వస్తాను'' అంటూ ఇంట్లోకి పరుగున వెళ్ళి బెల్ట్ తెచ్చింది శ్రీవల్లి.
''బెల్ట్ దేనికి'' అని అడిగాడు చంద్రయ్య ''మొక్కలు నాటాలంటే నడుం బిగించాల న్నాడు టీచర్'' అంది శ్రీవల్లి. చంద్రయ్య గట్టిగా నవ్వేసాడు ''నడుం బిగించడమంటే ఇలా కాదమ్మా మనం చేయాల నుకున్న పని ఖచ్చితంగా చేయాలని అర్థం'' అంటూ ఆ పక్కనే నడుంకు కండువా చుట్టి చెట్లకు పాది చేస్తున్న పక్కింటి శివయ్యను చూపిస్తూ ''అదిగో అతన్ని చూడు మనం ఏదైనా పనికి వంగినప్పుడు నడుంకు గుడ్డ బిగిస్తాం. అది మనం చేసే పని పైన శ్రద్ధ కనబరుస్తుంది. పని ముగిసే వరకు ఆ గుడ్డ విప్పరు. అది పట్టుదలకు చిహ్నం. పెద్దల కాలం నుండి ఆ ఆచారం వస్తూనే వుంది నడుం బిగించడమంటే అదే అర్థం'' అని వివరంగా కూతురుకు చెప్పాడు చంద్రయ్య.
''ఓహో అలాగా'' అంటూ తలాడించింది శ్రీవల్లి. పిల్లలకు విద్యతో బాటు మంచి అలవాట్లను నేర్పిస్తున్న ఉపాధ్యాయుడికి లోలోపలే కతజ్ఞతలు తెలిపాడు చంద్రయ్య. మంచి చదువంటే బట్టీ కొట్టడం కాదు ఇలాంటి సమాజానికి పనికి వచ్చే విషయాల పట్ల పిల్లలకు అవగాహన పెంచాలి. తన సొంత ఖర్చులతోనే బడి పిల్లలందరికీ మొక్కలు పంచిన చంద్రయ్యను ఉపాధ్యాయ బందం మెచ్చుకుంది చెప్పింది. తూచా తప్పకుండా పాటించిన శ్రీవల్లిని గౌరవించింది.
- రజిత కొండసాని,
9949295459