Sat 28 May 23:10:26.699525 2022
Authorization
ఆ అడవిలో దుప్పిలు చిరుత పులుల బారిన పడటంతో పాటు, జింకల సంఖ్య కూడా తగ్గిపోతున్నాయి. దీంతో జింకలు, దుప్పిలు అందోళన చెందాయి. చిరుతపులుల దాడి నుంచి ఎలా తప్పించు కోవడం అని ఆలోచించాయి. చివరకు జింకలు, దుప్పిలు అన్ని కలసి వద్ధ దుప్పి దగ్గరకు వెళ్ళాయి. వాటిని చూడగానే వద్ధ దుప్పికి సంగతి అర్థమైపోయింది. ఏదో అపాయం ముంచుకు వచ్చిందని. ''ఏమిటీ ఇలా వచ్చారు'' అంది. వాటిలో ఓ దుప్పి ''మేము గడ్డి మేస్తుండగా హఠాత్తుగా మా మీద పడుతున్నాయి చిరుతలు'' అని మొరపెట్టుకున్నాయి.
అందుకు వృద్ధ దుప్పి నవ్వి ''అది మీద పడింది నోట కరచుకుంది బాగానే ఉంది. అంత వరకు నీకు సమీపంలో ఉన్నది చూస్తూ ఊరుకుంది. వెంటనే వెళ్ళి కొమ్ములతో లేపేసి ఉంటే దాని తిక్క కుదిరేది. అది మీద పడగానే మీరందరూ పిరికి వాళ్ళ మాదిరి చెల్లాచెదరు అవుతున్నారు, బతుకు జీవుడా! అని పరుగు లక్కించు కుంటున్నారు. అలా మీరు ఉండకూడదు. మీలో ఒక దానిపై అది దాడి చేసినా శక్తి ఉన్నంత వరకు పోరాడండి. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి, గుంపులుగా ఉండండి. అది దాడి చేస్తే మిగతావి కొమ్ములతో నెట్టి వేయాలి. ఆ బాధకు అది విలవిల లాడుతుంది. నా జీవితంలో నేను చాలా వరకు ఆత్మ రక్షణ కొరకు పోరాడా, శక్తిని అంతా కూడదీసుకుని ఆ చిరుతలను కొమ్ములతో కుమ్మాను. నా దెబ్బకు చాలా చిరుతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేను గడ్డి మేస్తుండగా అవి నా బలాన్ని, ధైర్యాన్ని చూసి దగ్గరకు కూడా రాలేక పోయేవి. ముందు మీరు ధైర్యం తెచ్చుకోండి. ఒక్క చిరుత మీద పడినా, మిగతావి వెంటనే కొమ్ములతో పొడి చేయాలి. ఆ దెబ్బకు అవి దగ్గరకు కూడా రావు. వెళ్ళండి, ఒంటరిగా ఉండకండి, గుంపులుగా ఉండండి'' అని సలహా ఇచ్చింది. ఆ రోజు నుంచి దుప్పిలు, జింకలు గుంపులుగా ఉండేవి. ఓ రోజు ఓ చిరుత వాటిని చూసి 'ఏమి నా భాగ్యం' అనుకుని ఓ బలిసిన దుప్పిని నోట కరచుకుంది. వెంటనే మరో దుప్పి దాని కడుపులో బలంగా పొడిచింది. ఆ దెబ్బకు అది దిమ్మ తిరిగి పడిపోయింది. మరో దుప్పి కొమ్ములతో లేపేసింది. తోక ముడిచి పారి పోయింది చిరుత. అలా ప్రతి సారి జింకలపై, దుప్పిలపై దాడి జరుగుతుంటే అన్ని ఐక్యమై చిరుతలను తరిమి కొట్టాయి. అప్పటి నుండి అవి గుంపులుగా ఉంటే ఏ చిరుత కూడా దాడి చేయలేదు.
ఈ మార్పుకు దుప్పిలు, జింకలు సంతోషించాయి. మన వద్ధ దుప్పి మంచి ధైర్యం, సలహా మరువలేనిది. మనలో ఐక్యతతో పాటు, ప్రాణాపాయం నుండి తప్పించుకునే ధైర్యాన్ని ఇచ్చింది అనుకున్నాయి.
- కనుమ ఎల్లారెడ్డి