Sat 25 Mar 21:18:42.896157 2023
Authorization
దేశంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే ఆశ్యర్యంతో పాటు ఆందోళన కూడా కలుగుతోంది. ఈ రోజుల్లో ప్రశ్నించడం, విమర్శించడం నేరమైపోయింది. గట్టిగా మాట్లాడితేచాలు తెల్లారిచూస్తే కటకటాల్లోకే! ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది. ఏం చేశారని? తమ అభిప్రాయం స్వేచ్ఛగా నలుగురితో పంచుకునే అవకాశం కూడా లేకపోతే ఎలా? ఏదైనా మాట్లాడదామంటే భయం.. ఇష్టమైంది తిందామంటే భయం.. నచ్చినబట్టలు కట్టుకోవాలన్నా భయం.. ఎంతకాలం ఈ మనోవేధన? దీనికి అంతం లేదా? ఇదే ప్రశ్న ఇప్పుడు యావత్తు ప్రజానికాన్ని వేధిస్తున్నది. సమాజంలో మంచీ, చెడు రెండూ ఉంటాయి. అయితే మనిషి అభివృద్ధికి ఈ రెండు ఉపయోగమే. ఎందుకంటే మనిషి తప్పుల నుంచే అనేక విషయాలు నేర్చుకుంటాడనేది జీవిత సత్యం. కానీ దేశ ఏలికలు దీన్ని గ్రహించకపోవడం, సహించకపోవడం బాధాకరం. ఏదైనా మాట్లాడితే 'దేశద్రోహం' అంటున్నారు. దీనికి మేధావులు, సినిమాస్టార్లు, సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు ఎవ్వరనీ తేడా లేదు. శిక్షించడంలో మాత్రం అందరికీ సమానహోదానే!
ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించకున్నా, వ్యక్తం చేసే వారి హక్కును గౌరవించడం ప్రజాస్వామ్య సంప్రదాయం. ఈ భావ ప్రకటనా స్వేచ్ఛని మన రాజ్యాంగం కూడా అనుమతించింది. అయితే ఎవరి మనో భావాలకు భంగం వాటిల్లకుండా చూడాలనేది అందులో ముఖ్యాంశం. అయితే సంఫ్‌ుపరివార్ దీన్నే బాగా పట్టుకుంది. మనోభావాల్ని నొప్పిస్తున్నారనే పేరుతో భావస్వేచ్ఛని హరిస్తుంది. దేశంలో జరుగుతున్న అరాచకాలపై ఇప్పటికే చాలామంది గళం వినిపిస్తూనే ఉన్నారు. కొంతమంది మేధావులైతే తమ ప్రావీణ్యతకు వచ్చిన అవార్డులను కూడా తీసుకోకుండా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. గతంలో తెలుగుసినీ నటి సాయిపల్లవి కూడా హిందూ, ముస్లింలపై చేస్తున్న దాడుల పట్ల తీవ్రంగా స్పందించారు. ఆమెను ఎంత బెదిరించినా ఆమె తన వ్యాఖ్యలకు కట్టుబడి నిలిచారు. అదే తరహాలో ఇటీవల బీహార్‌కు చెందిన బోజ్‌పుర్ జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ ఉత్తరప్రదేశ్ పాలనా వైఫల్యాలపై పాడిన పాటకు అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసి నోటీసు లిచ్చింది. ఆమె గొంతు నొక్కాలని చూసినా ఆమె భయపడ లేదు. విశ్వనటుడు కమల్‌హాసన్, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వీటిని కాషాయ పరివారం సద్విమర్శగా తీసుకునే ప్రయత్నం చేయడం లేదు.
కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా వారిమీద ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దీనిద్వారా ప్రశ్నను అణగదొక్కాలని, విమర్శను భయపెట్టాలని చూడటం అత్యంత శోచనీయం. అతిపెద్ద ప్రజస్వామ్యంగా చెప్పుకునే భారత్‌లో అమోదయోగ్యం కాని నిర్ణయం. టీవీలు, సినిమాల్లో హాస్యం, వ్యంగ్యంతో పేరుతో ఆడవాళ్లని అవమానించే విధంగా కొన్ని దృశ్యాలు ఉంటున్నాయి. వాటి పట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ కార్యక్రమాల్ని నిషేధించాలని ఎవరూ అనడం లేదు. రాముని గురించి మాట్లాడితే మనోభావాలు దెబ్బతీస్తున్నారని, ముస్లింల గురించి మాట్లాడితే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతున్నారనే వాదన తీసుకురావడం అనంగీకారం. ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని గౌరవించే దృక్పథం లేనివారు మాత్రమే విధినిషేధాల గురించి మాట్లాడుతారు. మన సమాజంలో ఆస్తికులు, నాస్తికులు మొదట్నుంచి ఉన్నారు. ఎవరి అభిప్రాయాల్ని వారు నిరభ్యంతరంగా వెల్లడిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా అనే అనుమానం ఎవరికైనా కలగక మానదు.
కాషాయ పరివారం అధికారంలోకి వచ్చిన్నప్పటినుంచి అసంగతాలు, అశాస్రీయాలు, హేతురహిత వాదనల్ని ముందుకు తీసుకొస్తున్నది. అయినప్పటికీ ఆలోచనాపరులైన వారు మౌనం పాటిస్తున్నారు. శాస్త్రీయంగా నిరూపితమైన డార్విన్ సిద్ధాంతం సరైంది కాదని వాదించినా అధికారంలో ఉన్నవారి అజ్ఞానం పట్ట మౌనం వహించడం తప్ప గత్యంతరం లేని వైచిత్రి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఎవరి సొత్తుకాదు. ఒక వర్గం వారి హక్కుకాదు. అందరికీ అభిప్రాయాల్ని తెలియజేసే హక్కు ఉంటుంది. వాటితో విభేదించే హక్కు ఇతరులకీ ఉంటుంది. కానీ 'మనోభావాల' పేరిట అభిప్రాయ వ్యక్తీకరణని అడ్డుకోవాలనుకోవడం అభ్యంతరకరం. భావ సంఘర్షణకు అవకాశం ఉండాలి. మంచీ చెడు జనం నిర్ణయించుకుంటారు. నూరుపూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ అన్న మాటల సారాంశం ఇదే కదా.