Sun 14 May 00:02:17.633542 2023
Authorization
అమ్మకి ఇల్లు, బిడ్డలే సర్వస్వం. బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ ఉంటే ఆమెకి కన్నుల పండుగే. తన బిడ్డ తప్పు చేశాడంటే ఏ అమ్మా ఒప్పుకోదు. ఆమెకి తన బిడ్డల మీద అంత నమ్మకం మరి! తన బిడ్డ అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో అయినా సరే... తనకు మాత్రం ఇంకా చంటి బిడ్డే. సమయానికి తిన్నాడో లేదో, ఆకలితో వుంటాడేమో అనే ఆలోచిస్తుంది అమ్మ మనసు. అమ్మాయి జీవితంలో ఎన్నో పాత్రలున్నాయి. కూతురు, సోదరి, భార్య, కోడలు, అమ్మ, అత్త, అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మ... ఇలా ఎన్ని పాత్రల్లో ఒదిగిపోయినా అమ్మతనపు కమ్మదనాన్ని ఆస్వాదిస్తుంది.
'మ్మ్మ్మా....' అని పలికే నెలల పసిగుడ్డు దగ్గర నుండి ఇంటికి రాగానే 'మా... మా... అమ్మా... ఎక్కడున్నావ్?' అని గట్టిగా అరుస్తూ పిలిచే బిడ్డ వరకు తల్లికి అపురూపమే. ఆ పిలుపులోనే అంత కమ్మదనముంటుందేమో! అమ్మంటే... అనురాగం, ఆత్మీయత, ఓపికకు మారుపేరు, ప్రేమాభినాలకు ప్రతిరూపం... వీటన్నింటి కంటే ఇంకా ఓ మెట్టు పైకెక్కితే... స్వతంత్రం. ఏ బిడ్డకైనా అమ్మ దగ్గరున్న స్వతంత్రం ఇంకెవరి దగ్గరా వుండదు. అమ్మని హక్కుగా భావిస్తాం. అమ్మ మీద అరుస్తాం, కేకలేస్తాం, అలుగుతాం, కోప్పడతాం. ఆమె మీద సర్వ హక్కులు మనకి వుంటారు. ఆమెని ఎక్కడికీ కదలనివ్వం. అమ్మ ఒక్క రోజు ఇంట్లో లేకపోతే ఎక్కడి పన్లు అక్కడే ఆగిపోతాయి. ఏదో ఒకట్రెండ్రోజులకి నడిపించేసినా నాలుగైదు రోజులకి అమ్మ లేని ఇల్లు ఇల్లులా వుంటుందా చెప్పండి? ఏ వస్తువు ఎక్కడుందో కనిపించదు. ఆ వెతుకులాటలో ఇల్లు అరణ్యంలా మారిపోతుంది. మళ్ళీ అమ్మొస్తేనే అది ఇల్లులా తయారయ్యేది. అందుకే అమ్మ ఎక్కడికన్నా వెళ్తుందంటే 'ఇప్పుడెందుకు?, వెళ్ళొద్దు' అనే మాట వస్తుంది ఇంట్లో మిగతావాళ్లకి.
బిడ్డని ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్నగా దండించినా సరే, మరుక్షణమే బాధపడుతుంది తల్లి మనసు. బిడ్డ ఎంత నొచ్చుకున్నాడో అని తన మనసు కష్టపెట్టుకుంటుంది అమ్మ. అమ్మ మీద కేకలేసి అలిగి పడుకున్న బిడ్డ దగ్గరికి ప్లేట్లో అన్నం పట్టుకొచ్చి కలిపి మరీ ముద్దలు నోట్లో పెడుతుంది. అందుకేనేమో బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. తను కొట్టిన దెబ్బ అయినా సరే... ''దెబ్బ గట్టిగా తగిలిందా నాన్నా'' అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతుంది. అమ్మ మనసు అంతే!! మనం చేసిన తప్పులు నాన్నకు తెలీకుండా తప్పించుకోవాలన్నా, నాన్న చేతిలో దెబ్బలు తినకుండా వుండాలన్నా గొప్ప సాధనం అమ్మే. అమ్మ దగ్గరి కంటే మరెక్కడ రక్షణ దొరుకుతుంది మనకి. అమ్మ అన్న పదంలోనే ఆ గొప్పదనం వుందేమో! ఎంత జన సందోహంలో వున్నా, ఎవరు పిలిచినా గానీ, 'అమ్మా' అన్న పిలుపు వినిపిస్తేచాలు... తననే పిలుస్తున్నారనుకుని తిరిగి చూడని అమ్మ వుండదు! తనని కాదని తెలిసినా సరే, ఆ పిలుపుకి మురిసిపోతుంది. పిలిచిన పాపడి వైపు అనురాగంతో చూస్తుంది.
అమ్మకి ఇల్లు, బిడ్డలే సర్వస్వం. బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ ఉంటే ఆమెకి కన్నుల పండుగే. తన బిడ్డ తప్పు చేశాడంటే ఏ అమ్మా ఒప్పుకోదు. ఆమెకి తన బిడ్డల మీద అంత నమ్మకం మరి! తన బిడ్డ అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో అయినా సరే... తనకు మాత్రం ఇంకా చంటి బిడ్డే. సమయానికి తిన్నాడో లేదో, ఆకలితో వుంటాడేమో అనే ఆలోచిస్తుంది అమ్మ మనసు. అమ్మాయి జీవితంలో ఎన్నో పాత్రలున్నాయి. కూతురు, సోదరి, భార్య, కోడలు, అమ్మ, అత్త, అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మ... ఇలా ఎన్ని పాత్రల్లో ఒదిగిపోయినా అమ్మతనపు కమ్మదనాన్ని ఆస్వాదిస్తుంది. పిల్లలతో కలిసి తాను పసిపిల్లై అల్లరి చేసి, ఆడుతుంది. తప్పుచేస్తే దండించడానికైనా వెనుకాడదు. తప్పు చేసిన బిడ్డల్ని కొట్టి, కొట్టినందుకు ఏడ్చే అమ్మ కన్నీళ్ళని తుడిచిన వాళ్లమే కదా మనందరం కూడా.
ఎవరమైనా గానీ, సంతోషకరమైన విషయాన్ని ముందు అమ్మతో చెప్పడానికే ఇష్టపడతాం. ఆమె తప్పు లేకపోయినా అకారణంగా అమ్మ మీద కోప్పడుతుంటాం. కోపగించుకున్నప్పుడు సారీ చెప్పడం గానీ, ఆనందానికి కారణమైందని థాంక్స్ చెప్పడం గానీ చెయ్యం. ఒకవేళ సారీలు, థాంక్స్లు చెప్పినా అమ్మ మనసు ఓ పట్టాన ఒప్పుకోదు. తనని దూరం చేసినట్లు భావిస్తుంది.
ఒక్క మనుషుల్లోనే కాదు, పశుపక్షాదుల్లో కూడా అమ్మకు అమ్మే సాటి. పిల్లి తన పిల్లల్ని శత్రువుల నుండి కాపాడుకోడానికి పదిళ్లు తిప్పుతుంది. అలాగే కుక్క ఎవరేంచేస్తారోనని తన పిల్లల దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వదు. ప్రాణి ఏ రూపంలో వున్నా సరే అమ్మ మనసు అంతే. తన సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వుంటుంది. తను వున్నంత కాలం.