Sat 22 Apr 21:49:04.417331 2023
Authorization
'మంచి పుస్తకం దగ్గరుంటే మంచి మిత్రుడు వెంట వున్నట్లే' అని గాంధీగారి సూక్తి. ఆ మాటలో ఎంతో నిజముంది. కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తుంది. మనిషికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఒక్క పుస్తకం మాత్రమే ఇవ్వగలదు. కొన్ని సార్లు ఎంత ఆత్మీయుల మాటలైనా పెడచెవిన పెట్టేవారు కూడా పుస్తకాల్లోని మంచి మాటల ద్వారా ప్రభావితమవుతారు. మహనీయులు రాసుకున్న అనుభవాల అడుగుజాడల్ని సమీక్షించుకుని ముందడుగు వేస్తారు. ఎన్నో వందల, వేల ఏండ్ల పూర్వీకుల సంపాదించుకున్న జ్ఞానాన్ని ముందు తరాల వారికి అందిస్తున్నది ఈ పుస్తకాలే.
'చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో' అని కందుకూరి వీరేశలింగం గారు పుస్తకం మనిషికి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు. పుస్తకాలను చదవటం ఒక కళ. ఒక్కసారి పుస్తక పఠనం అలవడితే చాలు.... మనకు ఓ ఆత్మీయ స్నేహితుడు వెన్నంటే వున్నట్టు. ఏదో ఓ సమయంలో చుట్టూ ఎంతమంది వున్నా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం. పుస్తకంలోని అక్షరాలు, పదాలు చదువుతున్నప్పుడు మనకి తెలీకుండానే అందులో లీనమైపోతాం. అటువంటప్పుడు పుస్తకాన్ని మించిన ఆత్మీయుడు మరొకరు వుండరు. పుస్తకంలో లీనమైతే మనకు తెలీకుండానే నవ్వు, ఏడుపు, కోపం, బాధ, ఆనందం, ఇలా ఒక్కటేమిటి... నవ రసాలనూ అనుభవిస్తాం. ఒక్కోసారైతే చుట్టూ వున్న ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయా అనిపిస్తుంది కూడా. కానీ అది నిజం కాదు. ఎందుకంటే... పుస్తక పఠనం ఒక్క అలవాటు చాలు.... ప్రపంచాన్ని చుట్టి రాడానికి. కథలు, నవలల్లో కొన్ని జీవితాలు, సంఘటనలు తెలుసుకోగలిగితే, మరికొన్ని పుస్తకాల్లో పూర్వీకుల చరిత్రని తెలుసుకుంటాం. ఇంకొన్ని పుస్తకాల్లోని వివిధ దేశాల సంస్కృతులు, పద్ధతులు, అలవాట్లు మనల్ని ఆకట్టుకుంటాయి. ఏదైనా దేశానికి వెళ్తే తెలుసుకునేది ఆ ఒక్క ప్రదేశం గురించే. కానీ పుస్తక పఠనం అలవాటైతే... కాలు కదపకుండానే ప్రపంచంలోని వింతలూ, విడ్డూరాలు తెలుసుకోవచ్చు. మేథస్సు పెరుగుతుంది. విదేశాలు చూడాలంటే పాస్‌పోర్టులు, వీసాలు కావాలేమో కానీ, పుస్తకాలు చదివి తెలుసుకోడానికి అవేమీ అవసరం లేదు. విశ్వవ్యాప్త సంస్కృతికి, వేలాది మంది అనుభవాలకు చిహ్నం పుస్తకాలు.
తల దించుకుని నన్ను చూస్తే, నిన్ను తలెత్తుకునేట్టు చేస్తానని పుస్తకం అంటున్నట్టున్న ఓ కొటేషన్ చదివాను. ఎంత మంచి సూక్తి కదా అనిపించింది. నిజమే... చదువుకునే వయసులో చదువుకోకుండా సమయాన్ని వృధా చేసుకుని, కొన్నేండ్ల తర్వాత జీవితంలో స్థిరపడే సరైన అవకాశాలు లేక జీవితాన్ని నరకం చేసుకున్న వారికి ఇలాంటి మంచి మాటలు ఎవరూ ఎందుకు చెప్పలేదా అనిపిస్తుంది.
'మంచి పుస్తకం దగ్గరుంటే మంచి మిత్రుడు వెంట వున్నట్లే' అని గాంధీగారి సూక్తి. ఆ మాటలో ఎంతో నిజముంది. కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తుంది. మనిషికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఒక్క పుస్తకం మాత్రమే ఇవ్వగలదు. కొన్ని సార్లు ఎంత ఆత్మీయుల మాటలైనా పెడచెవిన పెట్టేవారు కూడా పుస్తకాల్లోని మంచి మాటల ద్వారా ప్రభావితమవుతారు. మహనీయులు రాసుకున్న అనుభవాల అడుగుజాడల్ని సమీక్షించుకుని ముందడుగు వేస్తారు. ఎన్నో వందల, వేల ఏండ్ల పూర్వీకుల సంపాదించుకున్న జ్ఞానాన్ని ముందు తరాల వారికి అందిస్తున్నది ఈ పుస్తకాలే.
మన రాజ్యాంగం రాసిన బి.ఆర్.అంబేద్కర్‌కి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టమట. కానీ ఆ సమయంలో తన దగ్గర పుస్తకాలు కొని చదువుకోడానికి సరిపడా డబ్బులు లేక లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలను తెచ్చుకుని చదివి ఇచ్చి, తిరిగి మరొక పుస్తకం తెచ్చుకునేవారట. పుస్తకాలంటే ఆయనకి అంత ప్రీతి. మరి నేటి యువతలో ఎంతమందికి పుస్తక పఠనం అలవాటు వుంది? ఒకవేళ పఠనాసక్తి వున్నా సెల్ఫోన్లో, ట్యాబ్‌లోనో చదువుతున్నారు. దాని వల్ల కళ్లు ఎంత అలసట చెందుతున్నాయో వారికి తెలియడం లేదు. పుస్తకం చదివితే కచ్చితంగా కళ్లు అలసిపోయే సమస్య వుండదు.
ఇప్పుడు ఇంటర్నెట్లు, ఈ - పుస్తకాలు, ఆన్లైన్ పేపర్లు వస్తున్నాయి కానీ, పుస్తకం పట్టుకుని పేజీ పేజీ తిప్పుతూ చదువుతున్నప్పుడున్న అనుభూతి ఆన్లైన్ పుస్తకం చదివినప్పుడు వస్తుందా? రానేరాదు. కొత్త పుస్తకం కొనుక్కుని, ఒక్కో పేజీ తిప్పుతుంటే... ఆ పేజీల నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసన ఎంత హాయిగా, కమ్మగా వుంటుందో కదా! కమ్మగా ఏంటి అనుకుంటున్నారా? ముక్కుపుటాలను తాకుతూ గొంతులోకి వెళ్ళే ఆ కమ్మని పరిమళం మనసునే కాదు, పొట్టనూ నింపేస్తున్నట్టుంటుంది. మీరూ ఈసారి గమనించండి.. పిల్లలకి చిన్నప్పటి నుండే పుస్తక పఠనాన్ని, అందులోని ఆనందాన్ని అలవాటు చేయాలి.