Sat 08 Apr 22:45:00.127136 2023
Authorization
'పోరాటం ప్రతిసారి విజయం సాధించకపోవచ్చు.కానీ భవిష్యత్తు తరానికి మంచి నాయకులను తయారు చేస్తుంది' అన్నాడు లెనిన్. వాకపల్లి ఆదివాసీ మహిళల పోరాటం సరిగ్గా అలాంటిదే. తమకు జరిగిన అన్యాయంపై చేసిన పోరాటం, చూపిన తెగువ కొండతెగలకే కాదు దేశానికే ఆదర్శం.లైంగికదాడికి గురైన పదకొండు మందిలో కోర్టు విచారణ సాగుతున్న కాలంలోనే ఇద్దరు చనిపోయారు. ఈ కేసును ఇంతటితో వదిలేయాలని కొంతమంది బెదిరింపులు, అయినప్పటికీ వారిలో ఆత్మస్థైర్యం కోల్పోలేదు.ఒకటికంటే ఎక్కువ విధాలుగా నిరక్షరాస్యులైనప్పటికీ వారు తమ పోరాటాన్ని విరమించుకోలేదు.
దాదాపు పదేండ్ల క్రితం విశాఖ ఏజెన్సీలో ఉన్న వాకపల్లి అనే నాన్డిస్క్రిప్టు గ్రామం గూగుల్ మ్యాప్‌లో కూడా ఉండేది కాదు. ఇది సామాన్యుడికి లేదా రెవెన్యూ శాఖలోని అధికారికే తప్ప మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది నేడు అమరావతిలోని డీజీపీ కార్యాలయం వరకు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు గదుల వరకు, సుప్రీంకోర్టు కారిడార్ వరకు ఈ గ్రామం పేరు ప్రతిధ్వనిస్తోందంటే దానికి కారణం వాకపల్లి ఆదివాసీ మహిళల ఉద్యమం. భాష రాకపోయినా, అక్షరం నేర్వకపోయినా తమకు జరిగిన అన్యాయంపై పదహారేండ్లుగా చేస్తున్న న్యాయ పోరాటం నైతిక విజయం సాధించింది. ఎందుకా పోరాటం, ఏమిటా విజయం? అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసుల సామూహిక లైంగికదాడి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇదొక సంచలనమైంది. అప్పటిదాకా మైదాన ప్రాంతం ముఖం చూడని ఆదివాసి బిడ్డలు బయటికి జరిగిన అన్యాయంతో ప్రపంచంలో అడుగుపెట్టారు. ఉక్కుసంకల్పంతో ఉద్యమించారు. ఇప్పుడా కేసును కొట్టివేస్తూ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ అదనపు కోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది. దీంతో పదహారేండ్లుగా శోకిస్తున్న ఆదివాసీల కన్నీరు తుడిచినట్టయింది.
ఆరోజు 2007 ఆగష్టు 20. భారతదేశ 60వ స్వాతంత్య్రదినోత్సవం వేడుకలు జరిగి కొద్దిరోజులే. అంతలోనే మళ్లీ బ్రిటీష్‌ను తలపించిన చీకటిరోజుకు తెరదీసింది. విశాఖ పట్టణానికి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జి మాడుగుల మండలం నర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి దట్టమైన అటవీ ప్రాంతం.ఆ రోజు తెల్లవారు జామునే నక్సల్స్ ఏరివేత కోసం గ్రేహౌండ్స్్ దళాల కూంబింగ్‌తో గూడెం దద్దరిల్లింది. బూట్ల చప్పుళ్లు, తుపాకుల మోత భయానకమైన బీభత్సాన్ని సృష్టించింది. అప్పటికే మగవారు అడవిబాట పట్టారు. మహిళలు కొంతమంది ఇంటిపనుల్లో నిమగమయ్యారు. ఇంకొంతమంది సమీపంలోని వాగు నుండి నీరు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు తమ పసుపు పొలాల్లో పని ప్రారంభిస్తున్నారు. ఇండ్లలోకి చొరబడిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా చిత్రహింసలు పెట్టారు.ఒక్కొక్క మహిళలపై ముగ్గురు లేదా నలుగురు లైంగికడాడికి పాల్పడ్డారు. ఇందులో చాలామంది మహిళలు పద్దెనిమిదేండ్ల నుంచి నలభై ఏండ్ల మధ్య ఉన్నవారు. అందులో ఒక మహిళ అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన బాలింత. ఎంతటి ఘోరం. ఈ క్రూరమైన ఆపరేషన్ మూడు, నాలుగు గంటల పాటు సాగింది. ప్రభుత్వమే సమాజంలో ముద్దాయిగా నిలిచింది.
దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన వాకపల్లి గ్యాంగ్‌రేప్ ఘటనను వామపక్ష, ప్రజాతంత్రవాదులు, హక్కుల నాయకులు తీవ్రంగా నిరసించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరవై ఒక్కమంది పోలీసులపై ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల(నిరోదక) చట్టంకింద కేసు నమోదు చేశారు. కానీ విచారణ సరిగా సాగలేదు. అన్యాయమే రాజ్యమేలుతుంటే అమాయకపు ఆదివాసీలకు న్యాయం దొరుకుతుందా? వారు ఎక్కని పోలీస్ స్టేషన్ లేదు. తిరగని కోర్టులేదు. హక్కులు హననమై పోతున్నప్పుడు చూస్తుఊరుకుంటారా? ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇక్కడే అదే జరిగింది. కానీ రాజ్యం ఎలాగైనా ఈ కేసునుంచి దోషిగా బయట పడాలని చూసింది. ఆదివాసీ మహిళలు, మావోయిస్టులు కలిసే ఈ కుట్ర చేశారని ఆరోపించింది. కానీ నిజం నిప్పు లాంటిది కదా! బయటపడకుండా ఉండదు! సుదీర్ఘ కాలంగా విచారించిన కోర్టు అధికార యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో మందలించింది. వాస్తవమే కదా! సరిగ్గా విచారణ చేసి ఉంటే నిందితులు తప్పించుకునేవారే కాదు. దీనంతటికీ ఫ్రభుత్వ అలసత్వమే కారణం.
'పోరాటం ప్రతిసారి విజయం సాధించకపోవచ్చు.కానీ భవిష్యత్తు తరానికి మంచి నాయకులను తయారు చేస్తుంది' అన్నాడు లెనిన్. వాకపల్లి ఆదివాసీ మహిళల పోరాటం సరిగ్గా అలాంటిదే. తమకు జరిగిన అన్యాయంపై చేసిన పోరాటం, చూపిన తెగువ కొండతెగలకే కాదు దేశానికే ఆదర్శం. లైంగికదాడికి గురైన పదకొండు మందిలో కోర్టు విచారణ సాగుతున్న కాలంలోనే ఇద్దరు చనిపోయారు. ఈ కేసును ఇంతటితో వదిలేయాలని కొంతమంది బెదిరింపులు, అయినప్పటికీ వారిలో ఆత్మస్థైర్యం కోల్పోలేదు.ఒకటికంటే ఎక్కువ విధాలుగా నిరక్షరాస్యులైనప్పటికీ వారు తమ పోరాటాన్ని విరమించుకోలేదు. అవమానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. తమకు తెలియని భాషలో తమను తాము కఠినమైన పరిస్థితిని అనుభవించారు. న్యాయం కోసం ఇన్నేండ్లుగా ఓపికగా ఎదురు చూశారు. అయితే పరిహారం తీసుకోవడానికి మాత్రం నిరాకరించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు.