Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆపద సంభవించినపుడు సూక్ష్మబుద్ధితో ఉపాయాన్ని ఆలోచించి, సమస్యను పరిష్కరించుకోవాలి. చీకటి ఆవరించినప్పుడు భయంతో కాకుండా ధైర్యంతో వెలుగు వైపు అడుగులు వేయాలి. ముందు చూపుతో జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. లేకుంటే మన జీవితం నాశనమైపోతుంది. సోమరితనం నిన్ను ఆవరిస్తే ఎలాంటి పనులను నువు చేయలేవు. ఏ విజయాన్నీ సాధించలేవు.
మనిషి జీవితం చైతన్యవంతమై సాగాలి. సమస్త జగతికి ప్రగతిని అందించే మనిషి జీవనం ఆదర్శప్రాయమై కదలాలి. స్తబ్దతకు లోనై అచేతనత్వంతో చతికిలబడిపోతే అది జీవితమనిపించుకోదు. అలాంటి తిరోగమన జీవనం మనిషి జన్మకు సార్థకతను కలిగించదు. మనిషి మనిషిని తట్టిలేపే మహౌజ్జ్వల సందేశాత్మక గీతాన్ని 'శ్రీకష్ణ పాండవీయం'(1966) సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి రాశాడు. సినీ జానపద కవిసార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన కొసరాజు ప్రబోధగీతాల రచనలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడనడానికి ఈ పాటే ఒక నిదర్శనం.
నిదుర మత్తులో మునిగిన మనిషిని ఈ పాటతో మేల్కొల్పుతున్నాడు కవి. మత్తులో పడితే బతుకు చిత్తయిపోతుందని ప్రబోధిస్తున్నాడు. ఇక్కడ నిదురమత్తులో ఉన్నవారికే ఈ సందేశమనుకుంటే పొరపాటు. ఏ పనీ లేక మొద్దులా తిరిగే మనిషికి కూడా ఈ సందేశం వర్తిస్తుందని మనం గ్రహించాలి. సినిమాపరంగా గమనించిన ట్లయితే - కౌరవసేనను అంతమొందిస్తానని వీరావేశంతో ప్రతిజ్ఞ పూనిన భీముడు పుష్టిగా తిని, హాయిగా నిదురలోకి జారుకుంటాడు. అలా నిదురమత్తులో మునిగిన భీముడికి శ్రీకష్ణుడందించే మేలుకొలుపే ఈ పాట.
ఆపద సంభవించినపుడు సూక్ష్మబుద్ధితో ఉపాయాన్ని ఆలోచించి, సమస్యను పరిష్కరించుకోవాలి. చీకటి ఆవరించినప్పుడు భయంతో కాకుండా ధైర్యంతో వెలుగు వైపు అడుగులు వేయాలి. ముందు చూపుతో జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. లేకుంటే మన జీవితం నాశనమైపోతుంది. సోమరితనం నిన్ను ఆవరిస్తే ఎలాంటి పనులను నువు చేయలేవు. ఏ విజయాన్నీ సాధించలేవు. సమాజంలో చులకనగా చూడబడతావు. కాబట్టి ఆశయసాధనకై నిరంతరశ్రమతో సాగాలి.
జీవితంలో సగభాగం నిద్రకే సరిపోతుంది. మిగితా సగభాగం ఏ కషి లేకుండా కాలక్షేపం చేస్తూ వధా చేస్తారు. చివరిదశలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎంత విలువైన సమయాన్ని పోగొట్టుకున్నామో తెలుస్తుంది. కాని ఆ వేళ గడిచిన కాలం తిరిగిరాదు. కాబట్టి సమయం మన చేతిలో ఉన్నప్పుడే గొప్ప పనులకు శ్రీకారం చుట్టాలి. వాటిని నెరవేర్చి తీరాలి. అతి నిద్రకు అలవాటుపడడం మూర? త్వమనిపించుకుంటుంది. అది తెలివి లేని వారు చేసే పని. నిన్ను నీవు తరచి చూసుకుని ప్రయాణం సాగించాలన్నదే కవి ఉపదేశం.
అధికారం మన చేతిలో ఉన్నప్పుడు, మన మాటే నెగ్గుతుందన్నప్పుడు మనంతటి ధీరులు లేరనుకుంటే పొరపాటు. ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని గ్రహించాలి. ఒకవేళ మన మాటకు విలువ లేని వేళ చతికిలబడిపోవడం, నీరసించిపోవడం కూడా సరికాదు. మనకంటూ ఓ రోజొస్తుందన్న నమ్మకాన్నీ కలిగి ఉండాలి. ఏదైనా సరే బుద్ధిబలంతో సాధించుకుని మన పేరు నిలబెట్టుకోవాలి కానీ కండబలంతో ఏమీ సాధించలేం.
మనకు ఎవరో వచ్చి సహాయం చేయరు. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ధైర్యం ఒక్కటి మన వెంట ఉంటే మన కష్టాలు తీరిపోతాయి. సంతోషాలు మన సొంతమవుతాయి. అందుకే పిరికితనాన్ని వదిలిపెట్టి, ధైర్యాన్ని తోడుగా చేసుకుని నడవాలి. చెప్పడమే నా ధర్మం. విని ఆచరించడం మనిషిగా నీ ధర్మం,వినకపొతే అది మీ ఖర్మం అని కథపరంగా చూసినట్లయితే భీమునికి శ్రీకష్ణుడి సందేశం. సందేశాత్మక దష్టితో పరిశీలించినట్లయితే కొసరాజు మనకందరికీ అందించిన సందేశమిది. మానవకోటికి దివ్యోపదేశమిది.
పాట :-
అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి / అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి / ముందుచూపు లేనివాడు యెందునకు కొరగాడు / సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు / మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా / ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా..
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు / మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు / అతినిద్రాలోలుడు తెలివిలేని మూరు?డు / పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు..
సాగినంత కాలం నా అంతవాడు లేడందురు / సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు / కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు / బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు.. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా /పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా / కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు / చెప్పడమే నా ధర్మం వినకపోతె నీ ఖర్మం.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682