Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందరో త్యాగమూర్తుల కషి ఫలితం మన స్వతంత్ర భారతం. కుల, మత, వర్గ భేదం లేకుండా శాంతి సౌఖ్యాలతో, సమతా సౌభ్రాతత్వాలతో అలరారే దివ్యప్రదేశం మన భారతదేశం. అయితే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా మన దేశంలో ఇంకా అవినీతి పాలకుల చర్యలు, అక్రమ రవణాలు, దోపిడీ విధానాలు తొలగిపోలేదు. ఈ దేశ పౌరులే విదేశాలతో చేతులు కలిపి దేశ సౌభాగ్యాన్ని నాశనం చేయాలని చూసిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి నేపథ్యం కలిగిన సన్నివేశానికి తగ్గ ఈ పాటను రాసిన కవి జాలాది. 1999లో వచ్చిన 'సుల్తాన్' సినిమాలోనిదీ పాట జాలాది అంటే దేశభక్తి గీతాలకు పెట్టింది పేరు. ప్రగతిశీల భావనలతో, మానవతా సందేశంతో అద్భుతమైన పాటల్ని రాసిన గీత రచయిత ఆయన. ఈ పాట కూడా గొప్ప దేశభక్తి ప్రపూర్ణమైన పాటగా అందరి మన్ననలందుకుంది.
పరాయి దేశాలతో చేతులు కలిపి మన దేశ నాశనం కోరుకునే వారి అంతు చూడడానికి, ఆ అవినీతి చర్యలను తుదముట్టించడానికి ఓ దేశ పౌరునికి తన బాధ్యతను గుర్తు చేస్తూ, జరగాల్సిన ఘోరాన్ని ఆపి, దేశ శాంతిని, సౌఖ్యాన్ని సాధించి, భావితరాలకు మన జాతి గొప్పదనాన్ని చాటి చెప్పాలని తెలియజేస్తూ ఈ పాట సాగుతుంది.
స్వార్థాన్ని కోరుకునేది కాదు దేశభక్తి అంటే, త్యాగాన్ని కోరుకునేది. ఆకాశంలోని అగ్నికణం ఒక సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణకాంతి ఒక వీరుడై విప్లవం ఉద్భవించింది. పోరాటం జరిగింది. స్వరాజ్యం ఫలించింది. అలా ఫలించిన ఈ స్వరాజ్యాన్ని నాశనమవ్వకుండా కాపాడుకుందాం.
కుల, మత భేదం లేకుండా అందరికి కన్నతల్లి మన భరతభూమి. ఓంకారమై ధ్వనించే గాయత్రి మన భరతభూమి. మన కీర్తి హిమాలయ శిఖరమంతటిది. ఉషస్సై మరో తరానికి ఆదర్శమైనది. స్వర్ణాక్షరాలతో చరిత్ర లిఖించిన ధన్యచరిత గలది మన భరతభూమి.
ఈ నేలలో ఎందరో త్యాగధనులు పుట్టారు. విజయం సాధించారు. శివమెత్తిన రుద్రులై, గంభీరంగా ప్రజ్వలించిన శక్తులై నిలబడ్డారు. ఉడుకెత్తిన నెత్తురులో ఉప్పెనలు సష్టించి, అవినీతి దొరపాలనా ప్రభుత్వాలు నేలకూలి, ఉరికొయ్యల వేలాడిన అమరవీరుల త్యాగాలకు వేయి జన్మలొచ్చి, అదే నీకు ఉజ్జ్వల భవిష్యత్తులా కొత్త వెలుగును ఇస్తుంది. అది నీవు గుర్తించక పోతే తెచ్చుకున్న ఈ స్వాతంత్య్రం వ్యర్థమైపోతుంది. దేశపౌరునిగా ఇదంతా నువ్వు చూస్తూ ఉండగలవా? అవినీతి జరుగుతుంటే చూసి సహించ గలవా? ఇదేనా భారతీయుడిగా నీ కర్తవ్యం? దేశరక్షణ బాధ్యత నీకు లేదా? అంటూ సందేశమై మ్రోగుతుంది.
స్వర్గమై విలసిల్లిన భూమి ఇది. తన స్వార్థం కోసం మనిషి దోచుకుంటున్నాడు. కడుపుతీపి అంటే కన్నీటి బాధలేనా? తల్లీకొడుకుల బంధం తలకొరివితో తీరిపోయేదేనా? అంతేనా? ఈ జన్మకు అర్థం? అని దేశపౌరునికి బాధ్యతను గుర్తు చేస్తూ ఘోషిస్తుంది ఈ పాట.
దానికి స్పందిస్తూ భారతపౌరుడు.. కాదు ఆ రుణం తీరేది కాదు. ప్రగతి అలా ఆగిపోవడం సరికాదు. ఉగ్గుపాల రుణం బుగ్గిపాలై పోదు. ఇక నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. భరత భూమి సంరక్షణ కోసం నా ప్రాణమైనా అర్పిస్తాను. చేయి కలిపి చైతన్యం కోసం నడుస్తాను. ప్రతిజ్ఞ తెలిసి భవిష్యత్తు కోసం వస్తున్నాను. మన రామరాజ్యభూమిని సంరక్షించుకోవడానికి కదలి వస్తున్నాను అంటూ భారతీయుడి కర్తవ్య దీక్షా కంఠమై సాగుతుందీ పాట.
ప్రతి పౌరుడికి తన దేశాన్ని కాపాడుకొమ్మని, బాధ్యతను గుర్తుచేస్తుందీ పాట. ఎప్పుడు చెడు ఎదురైనా కాలరాసి, దేశ సుభిక్షాన్ని సాధించే దిశగా ముందుకు సాగమని ప్రబోధిస్తుందీపాట.
పాట :-
ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై/ ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై/ భగ్గున ప్రళయించినపుడు వచ్చిందొక విప్లవం/ దిక్కులు జ్వలియించి తెచ్చి ఇచ్చిందీ స్వరాజ్యం/ అందుకే..అందుకే.. జనగణమన జయహే../ జనగణమన జనయిత్రి నా భరతభూమి/ ప్రణవాక్షర గాయత్రి నా పుణ్యభూమి/ యశస్సుకే హిమాలయం/ ఉషస్సులై మరో తరం/ స్వర్ణాక్షర చరిత్రనే సష్టించినదీ భూమి/వందేమాతరం.. వందే.. వందే.. మాతరం..
ఎందరో శివమెత్తిన రుద్రులై/ మరెందరో ప్రళయించిన శక్తులై/ ఉడుకెత్తిన నెత్తురులో ఉప్పెన సష్టిస్తే/ పడగెత్తిన దొరపాలన ప్రభుత్వాలు చస్తే/ ఉరికొయ్యల త్యాగాలకు వేయి జన్మలొస్తే/ ఉజ్జ్వల భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే/ గుర్తించని స్వరాజ్యం గుండెబరువు కాదా?/వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమై పోదా?/ ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్ష నీది కాదా?/ వందేమాతరం.. వందే.. వందే.. మాతరం..
స్వర్గమై వర్ధిల్లిన భూమిని/ తన స్వార్థమై మనిషి దోచుకుంటే/కడుపుతీపికర్థం కన్నీటి శోకమా/ తల్లి కొడుకు బంధం తలకొరివి కోసమా/ కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు/ ఉగ్గుపాల రుణమెప్పుడు/ బుగ్గిపాలు కాదు/ చేయి కలిపి వస్తున్నా చైతన్యం కోసం/బాస తెలిసి వస్తున్నా/ భావితరం కోసం/ ఆ రామరాజ్య భూమికి సంరక్షణవిధి కోసం/ వందేమాతరం.. వందే. వందే. మాతరం..
- తిరునగరి శరత్ చంద్ర