Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం కోరుకున్నదేదయినా మనకు దొరికితే మన ఆనందానికి అంతు ఉండదు. అదే మనం ఊహించని స్వర్గం మన కళ్ళముందు వాలితే దాన్ని మించిన అదష్టం ఇంకొకటి ఉండదు. అలాంటి ఊహించలేని శాశ్వతమైన సంతోషాన్ని తన స్నేహితుని ద్వారా పొందిన ఓ అమ్మాయి అంతరంగ భావనలకు ప్రతీకయే ఈ పాట.
'మిస్ ఇండియా' (2020) సినిమాలో 'కల్యాణ చక్రవర్తి' రాసిన ఈ మదులమైన పాట ఎంతో గొప్ప భావగాఢతను తెలియపరుస్తుంది.
నిన్నటి దాకా తీరలేని బాధల్లో కూరుకుపోయిన అమ్మాయికి ఓ వరంలాగా దొరికాడు ఓ స్నేహితుడు. ఆమె సంతోషానికి కారణమయ్యాడు. అతని రాకతో ఆమె జీవితమనే నింగిలో కొత్త కొత్త చిత్ర వర్ణాలు వెల్లివిరిశాయి. నశించిపోనటువంటి కాలాలు నా సొంతమై నేడు నిలిచాయి. నిన్నటి కంట తడి నేడిక ఉండదనీ, అందుకోలేని ఆనందాలన్ని నీ రూపంలో నేను అందుకుంటున్నానని ఆమె అతనిపై గల అవ్యక్తమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తుంది.
తాను వెళ్ళవలసిన దారి మారిపోయిందని వసంతం ఉన్నచోటే ఉండిపోదు కదా! అలా వసంతమై తనను చేరి చేయి చాచిన స్నేహాన్ని ఆమె అపురూపంగా గుండెకు హత్తుకోవడం ఇక్కడ విశేషం. మనల్ని ప్రేమగా దరిచేరిన బంధాన్ని ఆత్మీయంగా చేరదీసు కోవడం, చివరిదాకా కాపాడు కోవడం మన బాధ్యత. ఇక్కడ ఆ అమ్మాయి మనసులోని భావన కూడా అదే. తన దగ్గరకు చేరిన తీయని చెలిమిని తను చివరి ఊపిరి దాకా వదులుకోలేనన్న విశ్వాసాన్ని తన మాటలలో తెలియజేస్తుంది.
ఆ ప్రియమైన స్నేహితుడు కూడా తన జీవన ప్రయాణానికి తోడుగా దొరికిన చెలిని, ఆమె వ్యక్తిత్వాన్ని గూర్చి చెబుతున్న తీరు అద్భుతమే. కోరుకున్న కోరికలన్నీ నేడు ఫలిస్తున్నాయనీ, చేదు గుర్తులుగా మిగిలిపోవల్సిన జ్ఞాపకాలన్నీ కూడా క్షణాల్లో ఆమె వల్ల మరిచిపోతున్నాననీ తన అభిప్రాయాన్ని చెబుతాడు.
వెదురులోని మధుర గానాన్ని.. అంటే వేణుగీతాన్ని అతని మనసు హాయిగా వింటూ ఉంది. అది ఆమె వల్లే. బంగారంలాంటి మనసుని తను ఈ వేళ కళ్ళారా చూస్తున్నానని, వెలకట్టలేని ఆమె నవ్వులలో నుంచి చందనాలు తీస్తున్నానని పరవశిస్తూ అంటాడు. అది తనలో తాను లేని వేళగా భావిస్తున్నాడు. అంటే ఆమెగా తాను మారానని చెబుతున్నాడు. తను తనలా కాకుండా ఆమెలా కనబడడమే ఇక్కడ ఆమెపై ఉన్న ప్రేమను సూచిస్తుంది.
తూర్పు దిక్కున కమ్ముకున్న చీకట్లని వేకువలా వచ్చి వేరు చేస్తుందని, దగ్గరవుతున్న దూరాలలో చీకటిని తొలిచేసిన వేడివెలుగును మనసారా చూడాలని ఆ వయసులు కోరుకుంటున్నాయి.
నిస్వార్థమైన స్నేహాన్ని, ఆ స్నేహంతో పరిమళించిన ప్రేమభావనలను ఎంతో స్పష్టంగా వివరించిన పాట ఇది. కల్యాణ చక్రవర్తి కలంలోని భావవ్యక్తీకరణ అద్భుతం. అత్యద్భుతం.
పాట :-
కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే
నింగిలో పొంగే సారంగమై
లిప్తలో క్షిప్తమే కానని కాలమే
మొలకలే వేసే నా సొంతమై
నిన్నలో ఉన్న నీటి చారని
కన్నులే తొంగి చూసుకోవనీ..
అందుకోలేని అంతులేదని
అంతటా సంతసం ఉందనీ
దారినే మారిపోయిందనీ
దాగిపోలేదుగా ఆమనీ
చేయి చాస్తున్న ఈ చెలిమిని
చూడనీ కొత్తగా కొత్తనీ
కోరబోయినవేవైనా
తెరుపై పోయేనా
గురుతైనది చేదైనా
మరుపై నీలోనా
నే వెదురులోన మధురగానమే వింటూ ఉన్నా
పరుసవేది మనసు కోణమే చూస్తూ ఉన్నా
కరసులేని నగవు సందనాలు తీస్తూ ఉన్నా
నాలోన నే లేని ఈ వేళ నా
తూరుపై ఉన్న చీకట్లనీ
వేకువే వేరు చేస్తుందనీ
చేరువౌతున్న దూరాలలో
చూడనా వెలుగులో వేడినీ.
- తిరునగరి శరత్ చంద్ర
సెల్: 6309873682