నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం నమోదు చేయగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలడంతో జైరాం రమేశ్ ట్విట్టర్ లో స్పందించారు. కర్ణాటకలో తమ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడితే ప్రధాని మోడీ మాత్రం విభజనవాదాన్ని ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ పోరాడిందని చెప్పారు. ప్రజల కష్టాలపై పోరాడిన కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు. ప్రధాని మోడీ ఈ ఎన్నికలను రిఫరెండంగా చెప్పుకొచ్చారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పనితీరును చూసి ఓటేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారని, ప్రజాతీర్పుతో మోడీ విఫలమయ్యారని తేలిపోయిందని జైరాం రమేశ్ చెప్పారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ గెలవగా ప్రధాని మోడీ ఓటమి పాలయ్యారని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm