నవతెలంగాణ - తమిళనాడు: మెరీనా బీచ్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో ఏర్పాటు చేయనున్న కలం చిహ్నానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి డి.జయకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఆగస్టు 7వ తేది వృద్ధాప్యం కారణంగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని మెరీనా బీచ్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై స్మారక మందిరంలో ప్రాంగణంలోనే ఖననం చేశారు. ఆ ప్రాంగణంలో 2.23 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం స్మారక మందిరం నిర్మిస్తోంది. మరోవైపు సముద్రం మధ్యలో రూ.81కోట్లతో 134అడుగుల ఎత్తున భారీ కలం చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, సముద్రం మధ్యలో స్మారక స్థూపం నిర్మిస్తే సముద్రపు జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుందని జాలర్ల సంఘాలు ఆరోపించాయి. తమిళనాడు జాలర్ల సంఘం తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.