నవతెలంగాణ - హైదరాబాద్: నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నాట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠా ఫేక్ కరెన్సీ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 50, 100, 200, 500 నోట్లు ప్రింట్ చేసినట్లు పేర్కొన్నారు. రూరల్ ప్రాంతాలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేశారు. రాత్రి వేళల్లో రద్దీగా ఉండే షాపుల్లో కూడా నోట్లను మార్చినట్లు పోలీసులు చెప్పారు. ఇక ప్రింట్ చేసిన దొంగ నోట్లను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ముఠా తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm