నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మురళీమోహన్ ఒకరు. కేవలం నటనా ప్రతిభే పెట్టుబడిగా చిత్రసీమలో ఎదిగిన మహావృక్షం మురళీమోహన్. ఆయన నటుడిగా, నిర్మాతగా ఉన్నతస్థాయిలో రాణించారు. అయితే కొన్నాళ్లుగా మురళీమోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడాయన మనసు మార్చుకున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తానని చెబుతున్నారు.
మురళీమోహన్ తన మనసులో మాటను ఇలా వెల్లడించారు... 'నేను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు నా వయసు 33 ఏళ్లు. ఓ పదిహేనేళ్లు ఇండస్ట్రీలో ఉంటానేమో అనుకున్నాను. ఇప్పుడు నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ల పూర్తయ్యాయంటే ఆశ్చర్యంగా ఉంది. అదృష్టం కలిసిరావడంతో పాటు, అందరి సహకారం నాకు లభించడంతో ఇన్నేళ్ల ప్రస్థానం సాధ్యమైంది. నటుడ్ని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి నా ఆసక్తి అంతా వ్యాపారం మీదనే. ఇక రాజకీయాలు అంటారా.... అది అనుకోకుండా జరిగిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలకు పదేళ్ల విరామం వచ్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను.
వ్యాపారాలు కూడా మా కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఇకపై నేను పూర్తిగా సినిమాలకే అంకితం అవుతా. చనిపోయేంత వరకు నటిస్తూ ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించిన అక్కినేని నాగేశ్వరరావే నాకు స్ఫూర్తి. ఆయన తన మాట నిలుపుకున్నారు. ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆయన చివరి రోజుల్లో మనం సినిమాలో నటించారు. నేను కూడా ఆయన బాటలోనే నటనకు సంపూర్ణంగా అంకితం అవుతా' అని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 May,2023 04:48PM