నవతెలంగాణ: ఒక వ్యక్తి చేసిన నిర్వాకానికి 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. గత నెల నుంచి అధికారులు మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. 2019లో పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో తన అనుచరులతో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని వారికి ఉద్బోధించాడు. అతడి మాటలు నమ్మిన అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాంతంలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెలలో పాస్టర్ మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు.
మరికొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్టు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది ఆచూకీ కోసం కోస్ట్ గాలిస్తున్నట్టు రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. అంతేకాదు.. అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నారు. గతంలో మెకంజీ చర్చిలో చిన్నారులు మృతి చెందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు అడవిలోకి మకాం మార్చాడు. అతడి అనుచరులు కూడా అడవిలోకి వెళుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. కెన్యాలో మతపరమైన ఆచారాలను బలంగా పాటించే అలవాటుంది. దీంతో దేశంలో మరెక్కడైనా ఇటువంటివి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆ దేశాధ్యక్షుడు విలియం రూటో ఆదేశాలు జారీ చేశారు.