నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన లతా మల్లికార్జున కాంగ్రెస్‌కు జై కొట్టారు. హరపనహళ్లిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్‌రెడ్డిని ఓడించిన లత నిన్న బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనకు టికెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయనాయకుడిగా మంచి పేరుంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం 137కు పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm