Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంకటమ్మా ఆగం ఆగం వోతుంది. ఆ కట్టు బొట్టు జూస్తే పాత కాలం మనిషి అని ఇట్టే గుర్తుపట్టొచ్చు. చేతి నిండా గాజులు తలకి రూపాయి బిల్లంత బొట్టు. చెవులు కమ్మల బరువుకి జారిన్నట్టు ఉన్నారు. మొఖం పైన చర్మం ముడతలు గా ఉన్నప్పటికీ ఆ ముఖంలో కళ మాత్రం ఇప్పటికి తగ్గలేదు.
ఆ పక్కనే దారిలో ఉన్న ఇంటి ముంగట కూసుని ఉంది లచ్చవ్వ. ఎంతో చక్కని సంస్కారం కలది అని చూడగానే చెప్పొచ్చు లచ్చవ్వని, అంత అందంగా ఉంటుంది ముఖ ఛందస్సు.
ఆగం ఆగం పోతున్న ఎంకటమ్మని జూసి ''ఏమే ఎంకటా గట్ల ఆగం ఆగం పోతున్నావ్'' అని పిలిచింది.
ఎంకటమ్మా ఆగి లచ్చవ్వ వైపుకు వస్తూ మూతికి చీర కొంగు కట్టుకుంటా ''వొచ్చిందే లచ్చవ్వ మళ్ళొచ్చింది''.
లచ్చవ్వ ''ఏం ఒచ్చిందే'' అని సందేహంగా అడిగింది.
''అదే ఆ మహమ్మారి కరోనా మళ్ళొచ్చింది'' అని ఆయాస పడుతూ చెప్పింది.
వెంటనే లచ్చవ్వ నోటికి చీర కొంగు అడ్డం పెట్టుకొని ఇంట్లకి పోయి తనొక మాస్క్ పెట్టుకుంది ఎంకటమ్మకి ఒక మాస్క్ తెచ్చి ఇచ్చింది. ఎంకటమ్మా కూడా మాస్క్ పెట్టుకుంది. మళ్ళీ అడిగింది లచ్చవ్వ ''ఎవరికి వొచ్చిందే'' అని.
''ఏమో గా టీవీల జెప్తుంరు మళ్ళొచ్చింది'' అని భయంతో ఎంకటమ్మ చెప్పింది.
లచ్చవ్వ ''గప్పట్ల గీ వైరస్ ఒచ్చినప్పుడు మన దాకా రాదు అంటిరి. మన దగ్గరగా వైరస్ బతకదు అంటిరి. మన దాకా వచ్చినక జాగ్రత్తలు చెప్పిన్రు'' అని అంటుంది.
దానికి బదులుగా ఎంకటమ్మ ''అవునే లచ్చవ్వ లాక్డౌన్ అని, కర్ఫ్యూ అని, ఇంట్లకెళ్లి బయటకి రానియ్యలే ఎన్ని రోజులు కష్టబడితిమే గా దిక్కుమాలిన వైరస్ వల్ల'' అంటుంది.
లచ్చవ్వ వెంబడే ''అవునే ఎంకటా తిననీకే తిండి లేకుండే బయటకి పోనికే లేకుండే ఎంత కష్టమాయెనే గప్పుడు''.
ఎంకటమ్మా ఓ సంఘటన గుర్తు జేస్తూ ''మనూర్ల మొదటి సారిగా వైరస్ వొచ్చిన నారాయణ సంగతి తెల్వదా మనకు ఎంత కష్టమాయే గాళ్ళ కుటుంబానికి.. పిల్ల పెళ్లి అని అంత పురమాయించుకున్నాడు. పెళ్లి దగ్గరకి ఒచ్చేయాలకు గా వైరస్ ఒచ్చి ఎంత బాధ పడ్డాడో. వాళ్ళ ఇంటి దిక్కు పోవుడేంది కనీసం మన గల్లి దిక్కు గూడ ఎవరు రాలే'' అని లచ్చవ్వతో చెప్తుంది.
లచ్చవ్వ గూడ ''అవునే వానికి గంత మంది అన్నదమ్ములు ఉండే గదా వాళ్ళకి గంత మంది పిల్లలు ఉండే అయిన ఏ ఒక్కడు సాయం జేయ రాలే కనీసం పలకరియ్యలే ఏం మనుషులే. వాడు మంచిగా ఉన్నపుడు వాని దగ్గర దవాత్ చేసుకొని తిననీకి అయితే ఒచ్చిన్రు. గిట్ల అయ్యేసరికి ఏ ఒక్కడు రాలే సూడు. ఎంత పైసా ఉన్న ఏం లాభం చూడు ఏ ఒక్కడు దగ్గర లేకపాయే. లోకం ఎక్కడ పోతుందో అనుకున్నా. గాలెవ్వలో యూత్ పోరగాలంటా వాళ్ళకి అయినంతల సాయం జేసిన్రు వాళ్లకున్నంత గూడ మానవత్వం లేకపాయే ఎవ్వలకి'' అని అంది కొద్దిగా కోపంగానే.
ఎంకటమ్మా ''గదేమున్నదే రాములోళ్ళ ఇంట్ల వానికి ఒచ్చి ఇంట్ల ఉన్నోలందరికి పాకింది. రోజులల్లనే అందరూ ఆ మహమ్మారి బారిన పడి దవాఖాన సూపించుకొనికే లేక ఎంతగనం కింద మీద వడ్డర్రె ఎంత గింజుకున్న ఎవ్వరూ పట్టించుకోలే ఆఖరికి ఆ ఇంటిల్లిపాదిని మింగే కదనే ఆ కరోనా. దీనికి రోగం ఒచ్చి పోను. ఇంకేత మందిని మింగ సూస్తుందో'' అని బాధ పడుతూ అంటుంది.
లచ్చవ్వ అంటుంది ''అవునే ఎంకటా వాళ్ళకి చావు జేయనికే వాళ్ళ చుట్టాలు గూడ ఎవ్వరూ రాకపోతే గా గ్రామపంచాయితి వాళ్ళు ఒచ్చి శవాలను చెత్త బండిలా యేసుకొని తీస్కపోయిన్రు. గది జూస్తే పానం అంత ఎట్లనో అనిపించిందే. రెండు రోజులు గదే తల్సుకొని మస్తు బాధవడ్డనే గప్పుడు'' అని కన్ల నీళ్ళు తుడుసుకుంటుంది.
ఎంకటమ్మ ఓదారుస్తూ ''ఉకో ఉకో లచ్చవ్వ గా శేఖర్ గాని కూతురుకి గీ మహమ్మారి వచ్చినప్పుడు అయితే ఊరంతా బాధ వడ్డదే పది సంవత్సరాలు గూడ లేకపాయే అదేం జేసిందే దానికి వొచ్చింది అని. ఊర్ల అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. శేఖర్ వాని పెళ్ళాం ఎంత బాధ వడ్డర్రె ఎన్ని పైసలు ఖర్చు జేసిన పాపం ఆ పాప ప్రాణం కాపాడలేకపాయే. ఆ తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళ బిడ్డని కనీసం గుండెలకు హత్తుకొని ఏడవలేకపోయారు. ఎంత దౌర్భాగ్యం ఇది. ఏ జన్మలో ఏం పాపం జేసినమో కానీ మనల్ని ఈ మహమ్మారి గిట్ల నాశనం చేస్తుంది'' అని అంటుంది.
అప్పుడే లచ్చమ్మ ''ఏ జన్మలోనో కాదు ఈ జన్మలోనే భూమిని అందరూ నాశనం చేస్తున్నారు అందుకే గిట్లాంటివి అన్ని అయితున్నాయే ఎంకటా'' అని లచ్చమ్మ చెప్పి అటు వైపుగా మాస్క్ లేకుండా పోతున్న మంగవ్వని చూసింది. మంగవ్వ ఎవరితో అయిన ముఖం మీద మాట్లాడే రకం అవతల ఎవరు అని జూడదు ఎంత అనిపిస్తే అంత అనేస్తది. అట్లాంటి మంగవ్వని అపి ''ఏమే మంగవ్వ ఏంది మాస్క్ లేకుండా గట్ల పోతున్నావ్ బతుకు మీద ఆశ లేదా ఏంది?'' అని అంది.
మంగవ్వ ఆగి ''ఎందే లచ్చవ్వ గంత మాట అన్నావ్'' అని మంగవ్వ కసురుకుంటు అంటుంది.
ఎంకటమ్మ ''మరి గా మహమ్మారి కరోన మళ్ళొచ్చినక గూడ నువ్వు మాస్క్ లేకుంట తిరుగుతున్నావ్ అంటే ఇంకేం అనాలే'' అని ఏటకారంగా అంటుంది.
మంగవ్వ ''అవునా మళ్ళొచ్చిందా గా మహమ్మారి'' అని అనుకుంటూ కొంగు అడ్డం పెట్టుకుంది మూతికి.
''అవునే'' అని అంటుంది లచ్చవ్వ.
మంగవ్వ ''జెర నీ దగ్గర మాస్క్ ఇంకోటి ఉంటే ఇయ్యే లచ్చవ్వ'' అని అడుగుతుంది భయంతో.
లచ్చవ్వ ఇంకో మాస్క్ తెచ్చి ఇచ్చింది మంగవ్వ మాస్క్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుంది ''అవునే గా మధ్యల నర్సవ్వ కి కరోన వస్తే వాళ్ళ కొడుకు కూతురు గూడ దగ్గరకి పోలేరు. పాపం దాన్ని ఆసుపత్రికి తీసుకుపోయే దిక్కు గూడా లేకుండే ఎంత అవస్థ పడ్డదే ఆకరికి దిక్కు లేని చావు వొచ్చింది దానికి దాని కొడుకు అయితే కసాయి కంటే కఠినమైనోడే కనీసం వాని అమ్మ సచ్చింది అని గూడ చివరి చూపు సూడనీకే రాలే దాని శవాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీస్కపోయి బొందల గడ్డల పాతిపెట్టిన్రు'' అని లచ్చవ్వ ఎంకటమ్మతో అంటుంది.
ఎంకటమ్మ ''అవునే కొడుకులను కూతురులను అయితే కంటాం కానీ వాళ్లేవరు జేయరే ఆఖరికి మనకు మన జిందగీ ఏందో మనమే బతకాలే కష్టమో నష్టమో'' అంటుంది తన చెమ్మగిల్లిన కనులతో.
లచ్చవ్వ ''గా మల్లి గాడు అయితే ఎంత జెప్పిన గాని వినలే మాస్క్ పెట్టుకొని పొర మాస్క్ ఉండాలే రా బయట మంచిగా లేదు రా అని. అయిన వాడు నేను పోరాగాన్ని నాకేం అయితది నేను గట్టిగుంటా నాకేం రాదు కరోన గిరొనా అన్నడు'' అని అంటుంది వాన్ని తిట్టుకుంటా.
మంగవ్వ ''అవునే నేను ఒకనాడు వానితో మాస్క్ పెట్టుకోరా లేకపోతే సస్తావ్ అని అంటే నీలాంటి ముసలోళ్ళకు వస్తదే కరోనా నాలాంటోళ్లకు రాదు. వచ్చిన నాకు ఏమి కాదు అన్నాడు ఆఖరికి వాన్ని గూడ మిగింది ఈ మహమ్మారి'' అన్నది పాపం అన్నట్టు ముఖం పెట్టి.
ఎంకటమ్మ వానికి కరోనా వచ్చినక వాని ఘోష ఇంత అంత కాదే ఊపిరి అందక ఆక్సిజన్ పెట్టిన్రు. పెట్టినక గూడ ఊపిరి ఆడక ఎంత తిప్పలు పడ్డాడు పాపం వానికి గూడా చావే దిక్కు అయింది ఆఖరుకు అని వాళ్ళ దిక్కు చూసింది.
లచ్చవ్వ ''గిదంత గా చైనా వొళ్ళు జేసి పంపింరంట గప్పుడు గా వార్తలలో జెప్పిన్రు''.
మంగవ్వ ''వాళ్లకు ఏం రోగం అయ్యానో గిట్ల జేసిన్రు'' అని ముఖం మీదకు కోపం తెచ్చుకుంటుంది.
ఎంకటమ్మ ''గదంతా గాదె మన సర్కారు ఏం జేస్తుంది గింత అయితున్నా అస్సలు పట్టించుకోట్లే. ఏదో లాక్డౌన్ అన్నది మళ్ళా అన్ని తెరిచింది. ఏం జేస్తుందో ఏమో దీన్ని ఆపనీకే'' అని కసిరినట్టు అంటుంది.
మంగవ్వ వెంటనే అందుకొని ''ఇంకా ఏం జెయ్యమంటవే సర్కారు అందరూ మాస్కులు పెట్టుకోవాలి ఇంట్లకెళ్ళి అవసరం అయితేనే రావాలి అని చెప్పినా ఎవడన్న ఇంటున్నడ ఉట్టిగనే రోడ్డుల మీద పడి తిరుగుతున్నారు. దూరం దూరం ఉండుండి రా అంటే ఒకని మీద ఇంకొకడు వడుడు. ఎవనికన్న మాస్క్లు ఉంటున్నయా. అంతెందుకే మనమే ఆ మహమ్మారి మళ్ళీ వొచ్చింది అని తెల్సినకనే పెట్టుకున్నాం మాస్క్లు. గిట్ల ప్రజలు ఉంటే సర్కారు మాత్రం ఏం జేస్తది జెప్పు'' అని గట్టిగానే అంటది.
ఎంకటమ్మ ముక్కుమీద వేలేసుకుంది.
లచ్చవ్వ ''అవునే మనం సక్కగా ఉంటే అది మళ్ళొచ్చేది గాదు. గిప్పటికి అయిన అందరూ మాస్కులు బెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిగా లేకపోతే గీ త్యాప ఎంతమందిని పొట్టన బెట్టుకుంటదో గీ మహమ్మారి'' అని 'ఉంటనే మళ్ళా లచ్చి ఎంకటా మీరు ఇంట్లకెళ్లి బయటకెళ్ళకుండి'' అని మంగవ్వ వెళ్ళిపోతుంది అక్కడి నుండి.
వీళ్ళు గూడ నువ్వు గూడ జెర పైలం మంగవ్వ అని అంటారు.
ఎంకటమ్మ గూడ ''నేను గూడ పోత లచ్చవ్వ ఇంకా నువ్వు గూడ జెర ఇంటిపట్టునే ఉండే బయటకు రాకు అవసరం ఉంటే తప్పా'' జాగ్రత్త మరి పోయి వస్తా లచ్చవ్వ'' అని అలా లేస్తూ అంటుంది.
లేచినక లచ్చవ్వ ''జెర నువ్వు గూడ పైలం గుండు ఎంకటా'' అని అనుకుంటూ ఇంట్లకు పోతుంది.
అంశం : ముచ్చట రూపంలో గత సంవత్సరం కరోన సంఘటనలను గుర్తు చేస్తూ కరోన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం.
- సాయి కిరణ్ నేత (అసుర), 9533146760