Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట జేసి బయట తిరగవోయిన కొడుకు ఆనంద్ కోసం ఎదురు జూస్తుంది తల్లి. ''పొద్దు పది దాటింది. ఈ పహిల్వాన్ యాడ గప్పాలు గొడుతుండో'' అనుకుంట సెంద్రమ్మ బజారుకు జూస్తే ఆనంద్ దోస్తు జగన్ కనిపించిండు. ''అరె ఓరి జగన్ జర యాడన్నా మా ఆనంద్ గాడు కనిపిస్తే రమ్మను'' అని జెప్తే జగన్ సరే అన్నట్టు తల ఊపుకుంటూ పోయిండు.
బట్టలు పిండి ఆరేసుకుంట ''ఒక్కపూట తినకుంటే ఏం గాదులే అంతగనం ఎందుకు ఎదురు జూస్తుండవ్ వొదినే. వస్తడులే యాడికి పోడు నీ కొడుకు'' అని పక్కింటి పద్మ అనేసరికి సెంద్రమ్మకు ఇగలేని కోపం వచ్చింది
''ఏరు యా ఊరు దానివే నా కొడుకు కోసం నేను ఎదురు జూస్త. నా పిలగాడు ఇంతవరకు తినలేదు. నా పిలగాని బాధ నాకే ఉంటది. నీకెమన్నా నొప్పైతే జెప్పు'' అని కంపలెక్క ఎగవడ్డది.
''పొద్దు పొద్దుగాల నీ జోలికొచ్చి తిట్లు తినవడ్తి గదనే ఉండలేక'' అని నెత్తి కొట్టుకొని ఇంట్లకు పోయింది పద్మ.
ఆనంద్ సందులవడి ఇంటికొస్తుంటే తల్లి గొంతు ఇనవడింది. 'ఇయ్యాల ఎవరికో మూడింది. ఆ లొల్లి పక్క నా గురించే అయ్యుంటది' మనసులో అనుకుంటూ వచ్చిండు. రాంగనే తల్లి కోపంతో సిగం ఊగినట్లు కనిపించింది. ఏమీ మాట్లాడకుండా నీళ్ళ కాడికి పోయి కాళ్ళు సేతులు కడుక్కున్నడు. తల్లి కూడా ఏమనకుండా ఇంట్లకు పోయి అన్నం వెట్టింది. ఆనంద్ ఏమన్న అంటే నన్ను కూడా తిడుతదేమోనని సప్పుడు జెయ్యకుండా కూసున్నడు. గిన్నెల సూస్తే పాల కూర ఉంది.
''అమ్మ నీకు ఎన్నిసార్లు జెప్పాల్నే ఈ పాలకూర వొండకని. నాకు ఈ బువ్వొద్దు ఏమొద్దు పో. అయినా ఈ పాలకూర ఎవరిచ్చిండ్రే నీకు'' అంటే
''గా ఏశమోని కష్ణమ్మ తెస్తే నేనే బాగుందని తీస్కుంటి. నీవు గిట్ల జేస్తవని తెలిసుంటే అసలు ముట్టుకోకపోదును. గి ఒక్కపూట తిను మాయాబ్బగాని'' అని సర్ది జెప్పబోతుంటే గిన్నెను పక్కకు జరిపి లేసిండు.
తినేటోడు లేసిండని తల్లికి మళ్ళా కోపం వచ్చింది. ''కొడకా ఇప్పుడు కాదురా రేపు పొద్దున పెండ్లం వచ్చినంక అది ఏం వొండితే అదే తినాలె. ఇప్పుడంటే అమ్మ మీద గారం వడుతున్నవ్. రేపట్నాడు నేను లేనప్పుడు వచ్చింది ఏది వొండితే అదే తింటవ్. నా మాట రాసివెట్టుకో'' అని తల్లి అనేసరికి
''నువ్వు ఎన్నన్నా జెప్పు నేను మాత్రం ఆ పాలకూర తినను. దాన్ని జూస్తేనే నాకు వోకరొస్తది'' అని బయటున్న చిన్న గోడ మీద కూసున్నడు ఆనంద్.
ఇగ ఈడు ఇనడు తినడు అనుకొని కొంగుల కట్టుకున్న పైసలు తీస్కపోయి రెండు కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ ఏసిస్తే అప్పుడు నవ్వుకుంట తింటుంటే ''ఇప్పుడు కమ్మగుంది గదా నాయిన'' అంటే అవును అన్నట్టు తలూపిండు.
''అమ్మ అక్షిత ఇయ్యాల ఆ వంకాయ తోట కలువాలె జర కాలేజికేం వోకు'' అని పోయికాడ కూసున్న బిడ్డకు జెప్పి పొద్దున్నే పొలం కాడికి వోయిండు తండ్రి ఆంజనేయులు.
''సరే నాయిన'' అని పొయ్యిల ఊదురు గొట్టంతోన మంట ఊదింది అక్షిత.
బయట కూలోళ్ళను పిల్వవోయిన తల్లి కష్ణమ్మ కూడా వచ్చింది.
''మీ నాయిన ఏమన్నా జెప్పెనమ్మా'' అని అడిగితే
''నన్ను కూడా తోట కల్వ రమ్మన్నడమ్మ'' అని జెప్తే
''అట్లనా'' అని ఇంట్లకు వోయి గోళెంల ఉన్న కల్వారలు బయటకు తీసింది.
సద్ది వెట్టుకొని అక్షిత ముందు వోతె తల్లి ఎనకాల కూలి మందిని తోల్కొని పోయింది. తోటను జూడంగనే అక్షితకు గుండె దడా అన్నది కల్వను జూసి. అయినా కూలోళ్లు ఉన్నరు గదా నేనొక్కదాన్నే కల్వ తీయను గదాని మనసులో అనుకోని దూరంగా ఉన్న తండ్రిని జూసి ''నాయినో'' అని కూతేసింది తిన్నింకే రమ్మని.
తండ్రి రాంగనే అన్నం వెట్టింది. ఆయన తింటుంటే కష్ణమ్మ కూలోళ్ళను తోల్కొని వచ్చింది. కూలోళ్లు జల్ది కల్వడం అయిపోవాలని సుట్టూ ఉన్న మైసమ్మలకు, పోశమ్మలకు ముక్కోటి దేవతలకు సుట్టూత తిరిగి మొక్కి కల్వడం మొదలు వెట్టిండ్రు. తండ్రి తిన్నంక అక్షిత కూడా చిన్న కల్వార తీస్కోని కల్వడం షురు జేసింది.
ఆనంద్ ఎప్పుడూ కూసునే అడ్డ మీద కూసున్నడు. అట్లకెళ్ళి జగన్ పట్టించుకోకుండా పోతుంటే ''అరె జగన్ నీయసటోన్ని జూసే గా సామెత వెట్టింటరురా'' అని ఆనంద్ అనేసరికి
'దగ్గరకు పోకుంటే ఈడేదో నెత్తినొప్పి జేస్తడు' మనసులో అనుకోని దగ్గరకుపోయి ''ఏ సామెతరా'' అన్నడు.
''అదేరా పాలొన్ని నమ్మే బదులు పది రాళ్ళు వొద్ద వెట్టుకోవాలి అంటరు జూడు అది'' అంటే
జగన్‌కు ఏమీ అర్థం కాక నెత్తి గోక్కొని ''సక్కగా జెప్పురా'' అన్నడు మళ్ళా.
''అరె... నేను ఈడ కూసున్న. ఇట్ల రాకుండా అట్ల పోతున్నవేంద్రా. ఆ గేరిల ఎవరన్న పిల్ల గిట్ల నచ్చిందా?''
''అరె నా మొకానికి పిల్లలు గూడా జూస్తరారా. ఎందుకురా నన్ను బద్నాం జేస్తవ్. ఏదో పని ఉన్నట్టుంది జెప్పు జేస్త''
''మొన్న సిన్న గుట్టకు పోయి సింతవల కాయలు తెచ్చినవంట కదరా. మరి నాకు జెప్పలేవ్ ఎందుకురా?''
''మర్సిపోయినరా. ఇప్పుడు పోదాంపా'' అని జగన్ సంచి కోసమని ఇంటికి పోతుంటే
''ఏంద్రో మళ్ళా ఇడ్సి పోతున్నవ్?'' అని ఆనంద్ అనేసరికి
''అయ్యా సారూ సంచి తేనికె పోతున్న. తమరు ఎట్లా తేరు కదా'' అని చెప్పి పోతుంటే
''ఈని మాటలల్ల ఈ మధ్య వెటకారంతో పాటూ ఉప్పు కారం కూడా కలిసింది'' అని అనుకునేలోపే జగన్ సంచి తీస్కోని వచ్చిండు. ఇద్దరూ మెల్లగా సిన్నగుట్ట దిక్కు నడిసిండ్రు. గుట్టకు పోంగనే ఒక సెట్టుకు సింతవల కాయలు బాగ కనిపించినరు. మాట్లాడుకుంట తెంపి సంచిలేసిండ్రు. జగన్ మాట్లాడుకుంట ముందుకు ముందుకు పోయిండు. ఆనంద్ మెల్లగా గుట్ట పక్కనే ఉన్న వాగులోకి దిగిండు.
ఆనంద్‌ను ఊరు బయట రాంగ జూసిన అక్షిత ''బయటకు పోయోస్తమ్మ'' అని జెప్పి డబ్బల నీళ్ళు తీస్కోని వాగులకు పోయింది. ఆనంద్ సల్లగ గుడిసెలెక్కున్న కానుగ సెట్టు కింద కూసున్నడు. అక్షిత దగ్గరకు పోంగనే నీళ్ళ డబ్బ పక్కన పెట్టి ఆనంద్ మీద కూసున్నది. ఆనంద్ బిగ్గర పట్టుకొని ముద్దు పెట్టిండు.
''నీయవ్వ ఆగవా. ఎవరన్న జూస్తే?'' అని నెత్తి మీద ఏళ్ళు మడిపి కొట్టింది.
''జూస్తే చేసేదేముందే?''
''నీకేం అట్లే అంటవ్. మావోళ్లు నన్ను సంపుతరు'' భయపడినట్లు అన్నది అక్షిత.
''మరి ఇంకెన్ని దినాలే ఇట్ల సాటునంగా తిరుగుడు. ఇడ్సి ఉండాలంటే పానం పోతుంది'' అని ఆనంద్ అనేసరికి
''ఈడ నాకు పోతలేదా. నీకొక్కనికే పానం ఉన్నట్లు మాట్లాడుతవ్'' అని కారుతున్న సెమటను చున్నితోన తూడ్సింది.
''ఈ దొంగ పనులు మనకొద్దు గాని మీవోళ్ళతో జెప్పు పెండ్లి జేసుకుందాం'' ఆనంద్ అనేసరికి అక్షిత ఆలోచనలో పడింది. మొఖం సప్పగా వెట్టింది.
ఆమె బాధ అతనికర్థం అయ్యింది. వాళ్ళ కులాలు వేర్వేరు. ఒప్పుకుంటరో లేదోనని అనుమానం.
''ఏదైతే అదే అయితది గాని నువ్వు బాధ వడకు. నాకు సూడబుద్ది గాదు'' అని ఆనంద్ చెప్పేసరికి తను నిలవడి అతన్ని నిలవడమని జెప్పింది. తను లేసిండు.
బిగ్గర పట్టుకొని ముద్దు పెట్టి ''రేపు మాయమ్మకు జెప్త. మాయమ్మ మా నాయినకు జెప్తది. దూరం ఉండాలంటే నాకు గూడా అయితలేదు'' అని తెచ్చిన నీళ్ళు సల్లి అక్కడ్నుంచి పోయింది.
ఆనంద్ సెట్టు కిందికెళ్ళి బయటకు వచ్చి చూస్తే జగన్ సంచితోన అక్కడే ఉన్నడు. అక్షిత పోయేది చూసి ''అరె ఇది కాని పనిరా. మనకు అవసరమా జెప్పు'' అంటే సింతవల కాయలున్న సంచి ఆనంద్ భుజం మీద పెట్టుకొని ఇంటికి మాట్లాడకుండా నడిసిండు.
పొద్దు మూకింది. తోట కలుసుడు అయిపోయింది. పక్క మడిల పోసిన పాలకూర మళ్ళా పెరిగింది. ఆంజనేయులు దాన్ని పీకమని జెప్తే అందరూ కల్సి ఒక గంపకు పీకిండ్రు. నసుకు మబ్బైంది. అందరూ ఇంటి మొఖం పట్టిండ్రు. వంట జేసుకొని తిని అక్షిత సద్వుతుంటే వాళ్ళ అమ్మానాయిన పండిండ్రు.
అక్షిత లేవకముందే తల్లి తండ్రి యాడికో పోనింకె తయారైండ్రు. రాత్రి బాగా పొద్దుపోయేవరకు సద్వుకొని పుస్తకాలు పక్కల్నే వెట్టుకొని పండుకున్నది. ఆ పుస్తకాలు తీసి అక్షితను లేపింది తల్లి. వాళ్ళను జూస్తే ఏదో ఆపతి పని మీదనే పోతుండ్రు అనిపించింది అక్షితకు. పోతపోత ''గా పాలకూర గట్లట్ల తిరిగి అమ్ముకరమ్మా. లేకపోతే పాడైతది'' అని తండ్రి జెప్పెటాలకు, సరే అన్నట్లు పరుపుల కూసోనే నిద్ర మబ్బుల తలూపింది.
లేసి మొఖం కడుక్కొని ఇంత డికాషన్ తాగి గంప నెత్తిన వెట్టుకొని ఊర్లోకి నడిసింది. నడువనైతే నడుస్తుంది గాని ఏవరికి కూతేస్తలేదు. ఒక ముసలామే జూసి ''ఏంది బిడ్డ అది'' అంటే అప్పుడు గాని పాలకూర అని జెప్పలేదు. ''గిట్లైతే ఎట్ల బిడ్యా అందరికి కూతేయ్యాలే'' అని జెప్తే సరే అన్నట్లు తలూపి గంప నెత్తిన వెట్టుకొని ముందు ఇండ్లల్లకు పోయింది. సెంద్రమ్మ జూసి ''ఏంటివే ఓ పిల్ల గంపల'' అంటే ఏమని పిలువాలో అర్థం కాక ''పాలకూర'' అని జెప్పేసరికి ''మా పిలగాడు తినడమ్మా ఏమొద్దు'' అని జెప్తే... ఇంట్లోనే ఉన్న ఆనంద్ రయ్యిన వచ్చి ''నేనెందుకు తినను ఈ మధ్యనే అలవాటు జేసుకున్న తింట. నువ్వు ఇంట్లకువోయి గిన్నె తేపో'' అని అక్షిత నెత్తిమీదున్న గంప దింపి ఆమెను చూస్కుంట నిలవడిండు. మెల్లగా ఆమె ''అమ్మ నాయిన ఊరికి పోయిండ్రు అందుకే నేనొచ్చిన'' అని చెప్పింది. తల్లి గిన్నె తీస్కోని వచ్చి పాలకూర కట్టలు ఇంట్లోకి తీస్కపోతే మళ్ళా గంపను ఎత్తి ఆమె పోతుంటే ఆమెనే జూసిండు.
జగన్ బ్యాగులో బట్టలు వెట్టుకొని ఆనంద్ దగ్గరకు వచ్చిండు. బ్యాగ్ చూసేసరికి 'ఈడు మళ్ళా ఊరికి రాడేమో' అనిపించింది ఆనంద్ కు. ''అరె ఆనంద్ ఊర్లో ఉంటె బతుకు మారేటట్లు లేదురా. అందుకే హైదరాబాదు పోతున్న. ఓ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకొస్త. నీకు నాయిన లేకపోయినా అమ్మైనా ఉంది. నాకు ఆ ఇద్దరూ లేరు. అందుకే ఊర్లో ఉండాలంటే కష్టంగా ఉందిరా. అమ్మను ఇబ్బంది పెట్టకుండా మంచిగా జూస్కోరా'' అని జెప్పి జగన్ పోతుంటే ఆనంద్ కు తెల్వకుండానే కంట్లో నీళ్ళు తిరిగినరు. జగన్ ఎనకకు మల్లి ''అరె ఆనంద్ పేరులో ఉన్న ఆనందాన్ని జీవితాంతం ఉండేటట్లు జూస్కోరా'' అని బయలుదేరిండు.
జగన్ అన్నట్లుగానే సంవత్సరంనరకు ఊరికొచ్చిండు. సక్కగా ఆనంద్ వాళ్ళ ఇంటికే వచ్చిండు. బయట నిలవడి ''అరె ఆనంద్'' అని గట్టిగా పిలిసిండు. అక్షిత పాపను ఎత్తుకొని బయటకొచ్చింది. ఆమెను ఇక్కడ జూసి బాగ ఖుషీ అయ్యిండు జగన్.
రాత్రికి జగన్ మందు తీస్కోని ఆనంద్ దగ్గరకు పోతే ఇద్దరూ కలిసి ఊరు బయట కూసున్నరు.
''అరె ఆనంద్ అక్షిత వాళ్ళ అమ్మ నాయిన మీ పెండ్లికి ఒప్పుకుంటరనుకోలేదురా'' అని గ్లాసులో మందు పోస్తుంటే
''నువ్వు హైదరాబాదు పోయిన రోజే వాళ్ళ అమ్మ నాయిన వేరే ఊరు పోయోస్తూ ఆక్సిడెంట్లో సచ్చిపోయిండ్రురా'' అని జెప్పేసరికి జగన్‌కు షాక్ కొట్టినట్టు అయ్యింది. జగన్ ఏమీ మాట్లాడలేకపోయిండు.
''ఆ తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేరు. మా విషయం తెలిసి కనీసం పాలోల్లు కూడా పలకరియ్యలేదు. అప్పుడే అనుకున్న ఈ ఆనంద్ ఉన్నన్ని రోజులు అక్షితలో బాధ సూడొద్దని. కానీ అవతల సచ్చిపోయింది వాళ్ళ అమ్మ నాయిన. ఆ బాధ జీవితాంతం ఉంటది. ఇప్పుడున్న సంతోషం ఏందంటే అక్షిత మా అమ్మ అత్త కోడండ్ల లెక్క కాకుండా తల్లి బిడ్డల లెక్క ఉంటరు. నాకు అది సాలు. ఇప్పుడు అ ఆ కాదు. ఆ అ. ఆనంద్ అక్షిత'' అని జెప్తే జగన్‌కు మందు కూడా తాగాలనిపించలేదు. పక్కకు సల్లిండు. ఇద్దరు ఇంటికిపోయి అక్షిత అన్నం పెడితే తిన్నరు. సెంద్రమ్మ పాపను ఎత్తుకొని ఆకాశం వైపు సూపిచ్చి ఆడిపిస్తుంటే నవ్వుతుంది.
- కెపి లక్ష్మీనరసింహ, 9010645470