Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీ ఇవాళ బడికి పోలేదు. రమకి బళ్ళో ఏమీ తోచట్లేదు. తనకు చెప్పకుండా రాజీ ఎప్పుడూ బడి మానదు. ఇవాళ ఎందుకు చెప్పకుండా మానేసిందా అని ఆలోచిస్తోంది. భోజనాల గంట మోగే వరకు ఓపిక పట్టింది. గంట మోగగానే సంచీ భుజాన వేసుకుని రాజీ ఇంటికి బయల్దేరింది రమ.
ఊళ్ళో అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. బడికి ఎడమ వైపు రెండు వీధులు దాటగానే రామాలయం. అది దాటగానే గాంధీ బొమ్మ. దానికి ఎదురుగానే రాజీ వాళ్ళ ఇల్లు. బడి నుండి ఐదు నిమిషాలే నడక! రమ వాళ్ళింటికైతే మరో రెండు నిమిషాలు ముందుకి నడవాలి. అందుకే రమ పొద్దున్న పూట రాజీ కన్నా ముందే బయల్దేరుతుంది. తనే ముందుగా బడికి చేరుకోవాలని!
సరిగ్గా రామాలయం దగ్గర మలుపు తిరగబోతుంటే రమను ఎవరో పిలిచినట్టు అనిపించింది. అది రాజీ గొంతే! అప్పటికే రమ కోసం ఎదురుచూస్తోంది రాజీ. రమ చేయి పట్టుకుని గుడిలోకి తీసుకువెళ్ళింది. ''బడికి రాకుండా గుళ్ళో ఏం చేస్తున్నావు? అయినా నాకు చెప్పలేదేంటి?'' అనడిగింది రమ. రాజీ మొహంలో బాధ రమ పసిగట్టింది. ''ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నిన్ను ఎవరేమన్నారు? '' అని రమ మళ్ళీ అడిగేసరికి రాజీకి దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపు మొదలుపెట్టింది. ఏమైందా అని రమ కూడా కంగారుపడింది. రాజీ భుజం మీద చేయి వేసి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నించింది రమ.
కాసేపటికి రాజీ ఊరుకుని '' నాకు చాలా భయంగా ఉంది. ఇంకా ఇరవై రోజుల్లోనే పరీక్షలు.రాయడానికి మనకేం రావు. ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ గడిపేశాం. ఈ పరీక్షల్లో పాస్ అవకపోతే తరువాత కాలేజీకి వెళ్ళలేం. ఇంట్లో కూడా ఊరుకోరు'' అంటూ బయటపెట్టింది అసలు సంగతి. రాజీ మాటలు విన్నాక రమకు కూడా భయం మొదలైంది.
రాజీ, రమ మంచి పిల్లలే కానీ చదువు పట్ల శ్రద్ధ తక్కువ! సరదాగా బడికి వెళ్ళి రావడమే గానీ బళ్ళో చెప్పిన పాఠాలు చదవాలంటే మాత్రం చాలా బద్ధకం. ఇప్పుడు పదో తరగతి పరీక్షల్లో ఏం రాయాలో తెలియట్లేదు. '' ఎలా రాయాలో పరీక్షలు?నాకు భయంగానే ఉంది. నువ్వు అందుకేనా బడికి రాలేదు? '' అనడిగింది రమ. రాజీ తలూపింది. ఇప్పుడు రమకు కూడా భయం మొదలైంది. ఏ రోజు పాఠం ఆ రోజు చదివేసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి కష్టం వచ్చేది కాదని ఇద్దరికీ తెలుసు. రాజీ లాగా రమ ఏడవలేదు గానీ బిక్కమొహం వేసింది. రమను చూసి రాజీకి అర్ధమయింది.
గుడి దగ్గర కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అమ్ముకుంటున్న లక్ష్మి వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంది.వాళ్ళని చూసి జాలి వేసింది. వాళ్ళను పిలిచింది. రాజీ, రమ ఇద్దరూ అయోమయంగానే ఆమె వద్దకు వెళ్ళారు. '' పరీక్షల గురించే కదా మీ భయం! ఇంకా సమయం ఉంది. ఇప్పటి నుండి రోజూ చదివినా మీరు సులభంగా పరీక్షలు రాయగలరు.భయపడటం వలన చిన్న సమస్య కూడా పెద్దగా కనపడుతుంది. సమయం కూడా వృథా అయిపోతుంది'' అని చెప్పింది లక్ష్మి.
కొబ్బరికాయలు అమ్ముకునే లక్ష్మి పరీక్షల గురించి అలా మాట్లాడడం వారికి వింతగా అనిపించింది. వాళ్ళ సందేహాన్ని గమనించిన లక్ష్మి '' నాకు గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. వ్యాపారం చేసుకుంటూ సాయంకాలం రోజూ కాసేపు చదివిన నేనే అంత బాగా రాయగలిగాను.రోజంతా బళ్ళో పాఠాలు వినే మీరు కాస్త శ్రద్ధగా చదివితే ఇంకా బాగా రాయగలరు. మీ భయాన్ని పక్కన పెట్టి పుస్తకాలు తీయండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు'' అని వాళ్ళకి చెప్పింది.
లక్ష్మి మాటలతో రమ, రాజీకి వాళ్ళు కూడా పరీక్షలకు సిద్ధం కాగలరనే ధైర్యం వచ్చింది. ఇద్దరూ కలిసి బడికి బయలుదేరారు.ఆ రోజు నుండి రాబోయే పరీక్షలకి చదవటం మొదలుపెట్టారు.
- డా|| హారిక చెరుకుపల్లి, 9000559913