Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మృగరాజుకి బాగా ఆకలి వేస్తుంది. వేటకోసం అడవంతా గాలిస్తుంది. ఎంతసేపు వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అటూ ఇటూ తిరుగుతూ చూసుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది.
బాగా ఆకలి... ఆపైన వలలో చిక్కినందుకు మృగరాజుకి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయాలో దిక్కుతోచలేదు. అటువైపు ఎవరయినా వచ్చి రక్షిస్తారేమోనని చుట్టూ చూస్తుంది.
అప్పుడే అటుగా వస్తున్న ఒక ఎలుక మృగరాజుని చూసి బెదిరిపోయి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది.
''ఎలుకా! వెళ్లకు... నేను బందీగా వలలో చిక్కుకున్నాను, నన్ను రక్షించు! నీకు ఎలాంటి సహాయం అవసరమైనా నేను తప్పకుండా చేస్తాను'' అంది సింహం.
అప్పుడు సింహం చెప్పింది నిజమా, కాదా అని పరిశీలనగా చూసి నిజమని నిర్ధారించుకుంది ఎలుక.
''మీరు ఈ అడవికి రారాజు! మీరింత తేలికగా వలలో చిక్కడమేంటి? ఎలా జరిగింది ఇంత పొరపాటు?'' సింహానికి కాస్త దూరంలో ఉండి అంది ఎలుక.
''ఈ రోజు పొద్దున్నుండి ఆకలితో అలమటిస్తూ ఈ వలను చూసుకోలేదు ఎలుకా! కాస్త నన్ను ఈ వల నుంచి తప్పించి పుణ్యం కట్టుకో'' ప్రాధేయపూర్వకంగా అంది సింహం.
ఆ మాటలు విని ఇంకా కొంచెం దూరం జరిగింది ఎలుక.
''అదేంటి ఎలుకా? ఎందుకలా బెదురుతున్నావు? నేను బందీగా ఉంటే నిన్నేమీ చేయలేను కదా? భయపడకుండా దగ్గరకు వచ్చి నన్ను విడిపించు'' అంది ఎలుకను చూస్తూ సింహం.
''రాజా! నేను మిమ్మల్ని విడిపిస్తాను...అయితే అది ఇప్పుడు కాదు. బోయవాడు రావడం అల్లంత దూరాన చూసి ఇక్కడ నా పని మొదలుపెడతాను. అది నాకు సులువైన పని, కొంచెం సమయం చాలు'' అంది ఎలుక.
''బోయవాడు వచ్చే వరకు ఆగడం ఎందుకు ఎలుకా? నాకు చాలా ఆకలిగా ఉంది, నన్ను విడిపించు. నిన్ను నా ఆప్త మిత్రుడిలా భావిస్తాను'' అంది సింహం.
''రాజా! మా అమ్మ నాకు మహాభారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకి తెలిపిన స్నేహ నీతి చెప్పింది. బలవంతులతో స్నేహం అంత మంచిది కాదు, ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా ముప్పు వచ్చేది బలహీనులకే అని చెప్పింది. మీరు చాలా ఆకలిగా ఉన్నారు, నేను వలను కొరికిన వెంటనే నన్ను తినెయ్యవచ్చు... బోయవాడు వచ్చే సమయానికి ముందే నేను మిమ్మల్ని విడిపిస్తాను'' అంది వినయంగా ఎలుక.
''నన్ను విడిపించినా నిన్ను నేను ఏమీ చేయను ఎలుకా! ఈ రోజు నుంచి మనం స్నేహితులం, నన్ను నమ్ము'' అంది సింహం.
''అవసరం కోసం చేసే స్నేహం ఎప్పుడూ నిలబడదు మృగరాజా! మీరు ఈ అడవికి మహారాజు, నేను అల్పజీవిని. మనం మనలాగే ఉండటం ఇద్దరికీ మంచిది,..నన్ను మన్నించండి'' అంది ఎలుక.
సింహానికి చాలా కోపం వచ్చింది. బయటకు వచ్చినాక ఎలుకను తినెయ్యాలని నిర్ణయించుకుంది.
అంతలో బోయవాడు వస్తున్న అలికిడి వినిపించింది. ఎలుక తన చురుకైన పళ్ళతో చకా చక వలను కొరికేసింది.
వల తెగడంతోనే గర్జిస్తూ సింహం బయట పడింది... ఎలుక వేగంగా కలుగులోకి దూరిపోయింది.
వల వైపు వస్తున్న బోయవాడు సింహాన్ని చూసి చెట్టెక్కేసాడు. ఆకలిమంటతో సింహం మళ్ళీ వేట కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.
కథలోని నీతి : ఎవరినీ అంత తొందరగా నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.
- కె.వి.సుమలత, 9492656255