Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడి రేయి రాత్రిలో, నాలుగు దారుల కూడలిలో ఆమె నిర్వర్ణంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళలోంచి వర్ణించడానికి ఆకాశం సిద్ధంగా ఉంది. చలి, విచిత్రంగా చూస్తున్న మగాళ్ల చూపులు చిరుగులుపడిన రవికలోంచి తనువుకు ఒకేసారి తగులుతున్నాయి. ఎవరికోసమో ఎదురుచూస్తుంది కానీ ఆ ఎవరు ఎవరో ఆమెకి ఎప్పటికీ తెలియదు. ఎన్ని ఆకలి రాత్రులు ఈ నల్లటి చీకట్లో తెల్లటి చందమామలాగా అందంగా నిలబడి రాకాసులు తిరిగే ఈ రహదారికి అందాన్ని తెచ్చిందో. ఎన్ని సార్లు అమాయకంగా తనువుని సుఖపెట్టి మనసుని గాయపెట్టుకుందో. ఏ తల్లి మురిపెంగా పెంచుకున్న ఆఖరి ఆడబిడ్డో ఈ క్షుధానల దగ్ధమూర్తి. నాన్న గుండెలపై ఇంకా మిగిలున్న ఆమె పాదాల గుర్తులు ఎవ్వరి దేహదహనంతో అనంతంలో కలిసిపోతాయో. లోకమంతా ఆమెను వేశ్య అంటుంది, అంతకంటే ముందు ఆమె మనిషి అని మర్చిపోయి.
ఓ పున్నమి రోజు రాత్రి ఎప్పటిలాగానే అదే దారిలో ఆమెకు తోడొచ్చే మనిషి కోసం ఎదురుచూస్తుంటే ఓ బక్కపలచని దేహం ధరించి నీరసంగా, నిస్తేజంగా, నిర్లిప్తంగా నడుచుకుంటూ ఓ అందరిలాంటి మగాడు ఆమె వైపే వస్తున్నాడు, అతని కళ్ళలో అందరిలాగా ఆశలేదు, మనిషిని తినేసేంత పిచ్చి కోరిక లేదు కానీ ఏదో ఉంది. అదేంటో అర్థం అవ్వట్లేదు. ఆకలేమో? ఆమెకు అలవాటై సరిగా తెలియట్లేదు. కాళ్ళీడ్చుకుంటూ అటే వస్తున్నాడు, ప్రేమగా పలకరించాలనుకుంది. ఈ ప్రేమకు పేరేమిటో, ఇది ఎలాంటి ప్రేమో ఆమెకి ఆ క్షణంలో తెలియదు. కళ్ళముందుకొచ్చి దేహానికి ఓపికలేక కుప్పకూలాడు. ఆమె కన్నుల్లో నిండిన మనిషి. ఏం చేయాలో తెలియనితనంతో ఒళ్ళోకి ఆ మనిషి తలని తీసుకొని, ఆకలికి పడిపోయాడని గుర్తించి, చేతనైన సపర్యలు చేసి తనతో ఇంటికి తీసుకెళ్లింది రోజూలాగే, రోజూలా కాకుండా. కలిసి నడిసేప్పుడు ఈసారి భుజం మీద చేయి ఈమే వేసింది. కొత్తగా అనిపించిందేమో.
ఈ రాత్రి కొంచం కొత్తగా గడిసిందామెకు, మగాడితోనే అయినా మరోరకంగా, ఒంటిపై ఏ గాయం లేకుండా. రాత్రి ముందుకు నడిచింది. ఉషోదయపు వెలుగులతో లోకానికి మెలకువొచ్చినట్టు, ఆమె ప్రేమగా చేసిన సపర్యలతో, ఇష్టంగా తినిపించిన అన్నం ముద్దలతో అతనికి మెలుకువొచ్చింది. ఆమె మానవత్వానికి ఆశ్చర్యపోయాడు. చచ్చి పడున్నా ఆగిచూసే ఓపికలేని ఈ కాలంలో ఇంటికి తీసుకొచ్చి మనిషిని చేసిన మనిషి మనసుని చూడగలిగాడతడు. మానవత్వం మాధుర్యాన్ని అనుభవించాడతను.
నిజమైన ఇష్టంతో ఒక్కటై పెళ్లి చేసుకుందామనుకొని ఆమెనడిగాడు. ఒక్కనిముషం అర్థంగాని మానసికస్థితితో ఆమె.
ఆమె: లోకానికి తనువమ్ముకున్న మనిషిని నేను.. నేనసలు మనిషినో కాదో కూడా నాకే తెలియదు
అతను: తనువని అమ్ముకున్నా హదయం నీలోనే దాచుకున్నావు జాగర్తగా.. అది నాకిస్తావా? నువ్వమ్ముకున్న తనువును నా ప్రేమతో కడిగి ముత్యంలా మార్చి నీ మనసుకి అతికిస్తా.
ఆమె: రూపాయికి శీలాన్నమ్ముకున్న బతుకు నాది.. నాదసలు బతుకో కాదో కూడా నాకు అర్ధం కాదు
అతను: మనసు నీడనున్న శీలాన్ని కొనే రూపాయిలింకా తయారవ్వలేదు. మనిషినే కానీ మనసును కొనగలిగే శ్రీమంతులింకా పుట్టలేదు. అదే మనసును నేను ప్రేమతో కొంటా నువ్వు ఇష్టంగా అమ్ముతావా?
ఆమె: నా దేహం నాది కాదు. రెక్కలొచ్చిన పక్షులు గూడునొదలి పోయినట్టు ఎప్పుడో నానుంచి వెళ్ళిపోయింది. నా ఆలోచనలు నావి కావు. బలంగా, రాక్షసంగా నా మనసును శాసించే మరో మనిషి చెంతచేరి నావి కాకుండా పోయాయి.
అతను: ఏవి ఎటు వెళ్లినా దరిచేర్చుకునే ధైర్యం, దగ్గరకు తీసుకునే ధైర్యం నీకున్నాయి. మానవత్వం ధవళవర్ణపు చీరకట్టుకుని నా కళ్ళముందు నిలబడితే నీ దేహం నాకొద్దు. నీ అలోచనలు నాకొద్దు, నీ ప్రేమ చాలు.
ఆమె: నా తనువంతా ఆగకుండా కారిన కన్నీటి ధారల చారలే. నాకడుపు కర్ణాల నిండా ఆగని ఆకలి కేకలే. నా లేత హదయపు చెక్కిళ్ళపై పాషాణపు పంటి గుర్తులే. చీరంచున దాయాల్సిన దేహంతో ఆకలిమంటలనార్పుకుంటున్న ఆడదాన్ని నేను. రాక్షసత్వానికి బలై తనువుని తగలపెట్టుకున్న అమానవత్వానికి వారసత్వాన్ని నేను. దగ్ధమవుతున్న బతుకు నాది. శిధిలమవుతున్న దేహం నాది. రంగులలోకంలో చీకటి రంగుకి ప్రతినిధిని నేను.
అతను: బ్రతుకుకు కొత్త రంగులేసుకుందాం. శిధిలమైన దేహాలలోంచి కొత్త జీవితాలు పుట్టిద్దాం. పాత జ్ఞాపకాల్ని కాలిపోనిచ్చి ఆ భస్మగర్భాల్లోంచి మనుషులుగా మళ్ళీ పుడదాం. మనస్సులో కొలువైన దైవం సాక్షిగా మనం మళ్ళీ కొత్త బతుకుల్లోకి జన్మిద్దాం. ఈ సారి ఆకలిమంటలని మన అనురాగవర్షంతో ఆర్పేద్దాం. మన బ్రతుకులకి అంటిన గుర్తులన్నీ కడిగేసుకొని కొత్త బ్రతుకులు మొదలెడదాం.
ఈ మాటలు ఇలాగే నిరాటంఖంగా సాగుతుండగా ఓ మంచి క్షణాన వాళ్లిద్దరూ ఒక్కటిగా ప్రయాణం సాగించారు. పెళ్లి వాళ్ళకి చిన్నదిగా అనిపించిందేమో మనసుల సాక్షిగా జీవితాల్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఒకళ్ళ పేర్లు ఒకళ్ళకి చెప్పుకున్నారు.
ఆమెకి, అతనికి ఏదో పేర్లు ఉండే ఉంటాయి.
సిరికి చెప్పకుండా, శంఖ చక్రాలు ధరించకుండా, తనని తానైనా పట్టించుకోకుండా లోకాలు దాటి నేలకొచ్చిన నారాయణ నామాల్లో ఒక్కటో! స్మశానాల్లో, శవాల పక్కన తిరుగుతూ భువనాలనేలే రాజులనైనా తనదరికి రప్పించుకొనే రుద్రుని వేల పేర్లలో ఒక్కటో!!
(వంగూరి ఫౌండేషన్ 25 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో బహుమతి పొందిన కథ)
- గౌతమ్ లింగా