Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట యుగంధర్, 9492571731
ఆకాశంతో పాటూ నా మనసునూ మబ్బులు కమ్మేసాయి. సాయంత్రమైనా మబ్బులు చెదరలేదు, వర్షమూ కురవలేదు. బాగా ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. గింజుకుంటూనో, బాధ పడుతూనో, నొప్పిని భరిస్తూనో చనిపోవడం ఇష్టం లేదు. ఏ నొప్పి లేకుండా చనిపోవాలి. ఆలోచిస్తూ ఉండగా పక్క ఫ్లాట్‌లోని పీటర్ గారు గుర్తుకొచ్చారు. ఆర్మీలో పనిచేసి రిటైరై, ఒంటరిగా ఉంటున్నారు. వారి దగ్గర నిద్రమాత్రలు ఉంటాయి. వారి ఇంటికి వెళ్ళి, కాసేపు వారితో కాలక్షేపం చేసి, వారికి తెలియకుండా నిద్రమాత్రలు కాజేస్తే, ఏ నొప్పి లేకుండా సులభంగా ఆత్మహత్య చేసుకోవచ్చనిపించింది. పీటర్ గారి ఇంటికి వెళ్లడానికి తలుపు తెరిచాను.
గాలి బలంగా వీస్తోంది. వర్షం సన్నగా మొదలైంది. పరుగులాంటి నడకతో వారి ఇంటికి వెళ్ళాను. వారు ఏదో పుస్తకం చదువుతున్నారు. అలికిడి విని నా వైపు చూశారు.
''హరితా! ఏంటమ్మా! ఇంత రాత్రి పూట ఇలా వచ్చావ్?'' ఆప్యాయంగా అడిగారు.
''ఏం లేదు తాతయ్యా! నిద్ర పట్టడంలేదు. మీతో కాసేపు కాలక్షేపం చేద్దామని వచ్చాను''
''చాలా మంచిది. ఇలా కూర్చో!'' పుస్తకం పక్కన పెడుతూ చెప్పారు.
''భోంచేశారా తాతయ్యా?'' అడిగాను.
''చేశాను'' బదులిచ్చారు.
''పాలు కలుపుకొని తీసుకురానా?''
''నీకెందుకమ్మా శ్రమ?''
''ఇందులో శ్రమేముంది తాతయ్యా!'' అంటూ వారి వంట గదికి వెళ్ళి పాలు కలుపుకొచ్చి పీటర్ గారికి ఇచ్చాను.
అప్పటివరకూ తను చదివిన పుస్తకం గురించి చెప్పడం మొదలుపెట్టారు పీటర్ గారు. వారు మాట్లాడడం మొదలు పెడితే తుఫాను తీరం దాటినట్టే. ఆరంభమే తప్ప అంతమెక్కడో తెలీదు. ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వరు. తను మాట్లాడుతున్నది ఎదుటివారు వింటున్నారా లేదా అని కూడా ఆలోచించరు, మాట్లాడుతూనే ఉంటారు. వారు తన మాటల్ని కొనసాగిస్తున్నారు కానీ, నా మనసు ఎప్పటిలాగే కిషోర్ ఆలోచనల్లో మునిగిపోయింది.
నా పేరు హరిత. మొదటి చూపులోనే తొలకరి చినుకులా కిషోర్ నన్ను ఆకర్షించాడు. క్రమంగా ఇద్దరం దగ్గరయ్యాం. స్నేహం చేశాం. ఆ స్నేహం ప్రేమగా రూపాంతరం చెందడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జీవితంలో మరికొంత స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని చెప్పేవాడు. అతని ఆలోచనలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకేవి. ఆన్సైట్ వెళ్ళాలని, డబ్బులు సంపాయించాలని, స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలని, కోట్లు కూడబెట్టాలని, సమాజంలో ధనవంతుడిగా గుర్తింపు పొందాలని, లగ్జరీగా బతకాలనీ కలలు కనేవాడు. అతని ఆత్మ విశ్వాసం చూస్తే సాధించగలడనే అనిపించేది.
నాలుగేళ్ల క్రితం మొదలైన మా ప్రేమ చాలాకాలం సాఫీగానే సాగింది. ఏడాది క్రితం కిషోర్ కోరుకున్నట్టే అమెరికాలోని పెద్ద కంపెనీలో అతనికి కొలువు దొరికింది. చాలా సంబరపడ్డాను. అతను అక్కడ స్థిరపడ్డాక, నన్ను పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకుని వెళ్తాడని ఆశపడ్డాను. అమెరికాకు వెళ్ళాక కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆ తర్వాత క్రమంగా నన్ను దూరం పెట్టడం మెదలుపెట్టాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు. బిజీ అని రిప్లై పెడతాడు. నేను నిజమే అనుకున్నాను. మా మధ్య మాటలు తగ్గి, దూరం పెరిగింది.
నిన్ననే తెలిసింది, అతడు అక్కడే ఒక డబ్బున్న గ్రీన్ కార్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. వెంటనే అతనికి ఫోన్ చేసి నిలదీశాను. అమెరికాలో స్థిరపడ్డ ఒక కేరళ అమ్మాయితో మూడు నెలల క్రితమే తన పెళ్లి జరిగిందని, ఆ అమ్మాయి తండ్రి ధనవంతుడని, ఆమె ఒక్కతే కూతురని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన కెరీర్‌కు లిఫ్ట్ దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడతను. తనని మరచిపోయి మరో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని నాకు సలహా కూడా ఇచ్చాడు. అతని మాటల్లో నాపట్ల ఆందోళన గానీ, బాధగానీ లేదు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు మా నాలుగేళ్ల ప్రేమను పరిగణనలోకి తీసుకున్నట్టు కూడా లేదు. నా పట్ల, నా ప్రేమ పట్ల ఇంత నిర్లక్ష్యమా? నా ఆలోచనలు నన్ను డిప్రెషన్లోకి నెట్టేసాయి. ప్రేమపై నమ్మకాన్ని, జీవితంపై ఆసక్తిని పోగొట్టుకున్నాను. ఫలితంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాలని నిర్ణయించుకున్నాను.
''హరితా! నేను చెప్పేది వింటున్నావా?'' పీటర్ గారి మాటలు నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చాయి.
''అదీ... అదీ.......'' నీళ్ళు నమిలాను.
''నీకు నిద్రవస్తున్నట్టు ఉంది. వెళ్ళి పడుకో! రేపు మాట్లాడుకుందాం!'' చెప్పారు పీటర్ గారు.
''మీరు పడుకోరా?''
''నిద్రమాత్ర వేసుకుంటే గానీ నాకు నిద్రపట్టదు!'' చెప్పారు పీటర్ గారు.
''తీసుకుని వస్తాను ఉండండి'' అంటూ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాను.
పీటర్ గారి చేతికి ఒక మాత్ర, గ్లాసుడు మంచినీరు అందించాను. వారికి తెలియకుండా పది మాత్రలను టీపారు పైనున్న కరపత్రంలో మడిచి, పీటర్ గారికి ''గుడ్ నైట్'' చెప్పి బయటపడ్డాను.
వర్షం జోరుగా కురుస్తోంది. వర్షంతో పోటీపడుతున్నట్టు పెద్దగా శబ్దం చేస్తూ గాలి వీస్తోంది. మరోవైపు ఉరుములు, మెరుపులు. నా మనసులోని సంఘర్షణల లాగే ప్రకతి కూడా వర్షంతో, హౌరుగాలితో, ఉరుములమెరుపులతో సంఘర్షణను అనుభవిస్తున్నట్టు ఉంది. వర్షం ఈ రాత్రికి ఇలాగే కురిస్తే మరికొందరి ప్రాణాలు తీసి, నాకు తోడు పంపుతుందేమో. ఇంట్లోకి వచ్చి గడియపెట్టి, నిద్రమాత్రలు చుట్టిన పోట్లాన్ని నెమ్మదిగా విప్పదీశాను. అప్రయత్నంగా పొట్లం కట్టిన కరపత్రం వైపు చూసాను.
కరపత్రంలో ఒక అమ్మాయి ఫోటో, అందులో పొందుపర్చిన అక్షరాలు నన్ను చూపు తిప్పుకోనివ్వలేదు. నా కండ్లు ఆ అక్షరాల వెంట పరుగులు తీసాయి. ''సివిల్స్ మొదటి ర్యాంక్ సాధించిన కుమారి మధుమతికి ఘనసన్మానం'' అని రాసుంది. ఆ అమ్మాయి ఫోటోను నా కళ్ళు తీక్షణంగా గమనించాయి. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మధుమతి అని, ఆ అమ్మాయి సివిల్స్ లో మొదటి ర్యాంక్ సాధించినందుకు సన్మానం చేస్తున్నారని అర్థమైంది. కానీ నేను ఆలోచిస్తున్నది ఆ అమ్మాయికి జరుగుతున్న సన్మానం గురించి కాదు, ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది. గతాన్ని తవ్వి ఆ అమ్మాయిని గుర్తించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే అలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినవారు జీవితంలో మనకు అరుదుగా తారస పడుతూ ఉంటారు. నా ఆలోచనలు నాలుగేళ్ల వెనక్కు వెళ్ళాయి.
లిలిలిలిలి
సరిగ్గా నాలుగేళ్ల క్రితం లోకల్ ట్రైన్లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నా. కూర్చోవడానికి చోటులేక నిల్చోనే ప్రయాణం చేస్తున్నా. నా ఎదురు సీట్లో ఒక నలభై యేళ్ల ఆవిడ మౌనంగా కూర్చుని ఉంది. ఆమె కళ్ల నుండి కన్నీరు ధారగా కారుతోంది. ముఖం తోటకూర కాడలా వాడిపోయింది. ఆమెకు ఎడమ వైపున ఆమె భర్త కాస్తంత హుందాగా, మరికాస్త కోపంగా కూర్చుని ఉన్నాడు. పల్లెటూరి రైతులా ఉంది అతని వాలకం. కుడి పక్కన కూర్చుని ఉన్న ఇరవైయేళ్ల అమ్మాయి వైపు నా చూపు మరల్చాను. బహుశా ఆ అమ్మాయి వారి కూతురు అయ్యుండవచ్చు. ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాను. కళ్ళు, ముక్కు పొందికగా ఉన్నాయి. ఒత్తైన జుట్టు, చామన ఛాయ. ఆ అమ్మాయి కళ్ళలో పట్టుదల, చూపులో స్పష్టత, ముఖంలో ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనబడుతున్నాయి. ఏడుస్తున్న తన తల్లిని ఓదారుస్తోంది ఆ అమ్మాయి. కానీ ఆవిడ ఎందుకు ఏడుస్తోందో, ఆవిడను ఆ అమ్మాయి ఎందుకు ఓదారుస్తోందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది.
నేను సీటుకోసం తనవైపు చూస్తున్నానని అనుకుంది ఆ అమ్మాయి. తను కూర్చున్న సీటులో కాస్త పక్కకు సర్దుకొని, నేను కూర్చోవడానికి కాస్తంత చోటు ఏర్పాటు చేసింది. వారేదో బాధలో ఉండి కూడా, నేను నిల్చుని ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ అమ్మాయి గమనించి, నాకు సహాయం చేయడానికి ప్రయత్నించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
''మీ అమ్మగారికి ఏమయ్యింది?'' అంటూ ఆ అమ్మాయితో మాట కలిపాను.
ఆ అమ్మాయి కాస్త నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టింది. ''నా పేరు మధుమతి. తను మా అమ్మ భారతి. వీరు మా నాన్నగారు వీరయ్య. ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. చాలా యేళ్ళ క్రితమే మా మేనత్త, మామయ్య చనిపోతే, వారి కొడుకైన కుమార్ బావను మా ఇంటికి తీసుకుని వచ్చారు నాన్న. మగబిడ్డలు లేకపోవడంతో బావను సొంత కొడుకులా పెంచారు. అతను నాకన్నా ఆరేళ్లు పెద్ద. మా ఇద్దరికీ మంచి చదువులు చెప్పించే స్తోమత లేకపోవడంతో బావను ప్రయివేటు స్కూల్లోనూ, నన్ను సర్కారు బడిలోనూ చదివించారు. ఆపై అతన్ని పట్నంలో హాస్టల్లో పెట్టి ఇంటరు, డిగ్రీ కూడా చదివించారు. పదో తరగతిలో నేను మా ఊరి హైస్కూల్లో ఫస్టు వచ్చాను. కానీ బావను ఏం.సి.ఏ చదివించడం కోసం నా చదువు నిలిపేశారు. ఇద్దరినీ చదివించే స్థోమత లేదని, నన్ను చదివిస్తే బావ వ్యవసాయం చేయాల్సి వస్తుందని, అదే బావను చదివించి, ప్రయోజకుడ్ని చేసి, నన్ను తనకు ఇచ్చి పెళ్లి చేస్తే, ఇద్దరం సుఖంగా బతుకుతామన్నది వారి ఉద్దేశ్యం. బావ కూడా నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని తరచూ చెప్పేవాడు. అందరం కోరుకున్నట్టే బావ సిటీలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాయించాడు. నేను దూరవిద్య ద్వారా ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. పల్లెకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందిగా బావకు ఉత్తరం రాశాడు నాన్న. కానీ అటువైపు నుండి జవాబు రాలేదు. దాంతో బావను వెతుక్కుంటూ సిటీకు వచ్చాము. అడ్రస్ పట్టుకుని అతన్ని కలిశాము. బావకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. తన కొలీగ్‌ను ప్రేమించానని, ఆమెనే పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. తన చదువుకు పెట్టిన ఖర్చు లెక్కగడితే తిరిగి ఇచ్చేస్తానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. నాన్నకు కోపం వచ్చి అతని చెంప చెళ్లుమనిపించాడు. అతడు ఆవేశంతో నాన్నగారి చొక్కా పట్టుకున్నాడు. అమ్మ ఇద్దరినీ చెదరగొట్టి బావను తిట్టి నన్ను, నాన్నను తీసుకుని వచ్చేసింది. బావ చేసిన మోసాన్ని తలుచుకుని అమ్మ ఏడుస్తోంది'' అంటూ తన కథను వివరంగా చెప్పింది మధుమతి. అంతా విన్న నాకు మధుమతిపై జాలి కలిగింది.
''మీ బావ కాదన్నందుకు నీకు బాధగా లేదా?'' అడిగాను.
''అతను కాదన్నందుకు కాదు! అలాంటి స్వార్థపరుడి కోసం నా తల్లిదండ్రులు ఇన్నేళ్ళ పాటు కష్టపడినందుకు, నేను నా చదువును, భవిష్యత్తును త్యాగం చేయాల్సి వచ్చినందుకు బాధగా ఉంది'' చెప్పింది మధుమతి.
నేను తనవైపు లాలనగా చూశాను. నా చూపును అర్థం చేసుకున్న దానిలా తనే తిరిగి మాట్లాడింది. ''భయపడాల్సిందేమీ లేదు! నేను కష్టపడి చదువుతాను. మంచిగా స్థిరపడుతాను. అమ్మానాన్నను చక్కగా చూసుకుంటాను'' ధీమాగా చెప్పింది మధుమతి.
చిన్నదైనా భవిష్యత్తుపై ఆ అమ్మాయికి ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయాను. తనకు సహాయం చేయాలని అనిపించింది. అంతకుముందే డ్రా చేసిన నా మొదటి నెల జీతం నుండి పదివేలు తీసి ఆ అమ్మాయికి ఇవ్వబోయాను.
''వద్దమ్మా! నా ఒంట్లో ఇంకా కష్టపడే శక్తి ఉంది. నేను నా కూతుర్ని చదివించుకోగలను!'' అప్పటిదాకా మౌనంగా ఉన్న వీరయ్య నా వైపు చూస్తూ చెప్పాడు. అంతలోనే నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. ట్రైన్ దిగేశాను. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి గురించి మరచిపోయాను.
ఎక్కడో పిడుగుపడిన చప్పుడు వినబడడంతో ఈ లోకంలోకి వచ్చాను. నాకు నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. ఇప్పుడు మధుమతి సివిల్స్‌లో టాపర్ అయ్యుండవచ్చు. కానీ నాలుగేళ్ల క్రితం తను ఒక పల్లెటూరి అమ్మాయి. పెళ్ళాడతాడని ఆశపడి, బావ చేత భంగపడ్డ అమాయకురాలు. కేవళం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న విద్యార్థిని. తన బావ తనను కాదన్నందుకు ఆమె కంగిపోలేదు. తనలాగా ఆత్మహత్యకూ ప్రయత్నించలేదు. అతడు చేసిన మోసాన్ని సవాలుగా తీసుకుంది. ఇవ్వాళ తనను చూసి తన బావ సైతం ముక్కున వేలేసుకునేలా చేయగలిగింది. చుట్టూ ఉన్న సమాజం చేత జేజేలు పలికించుకోగలిగింది. తను చిన్నదే అయినా తనను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఏదో ఒకరోజు కిషోర్ నా కంటబడక పోడు. ఆ రోజున నేను కిషోర్ కన్నా గొప్ప స్థాయిలో ఉండాలి. అతడు నన్ను చూసి తలదించుకోవాలి. పీటర్ గారి ఇంటి నుండి తీసుకొచ్చిన నిద్ర మాత్రలను చెత్త బుట్టలో పడేశాను. నా మనసు నుండి కిషోర్‌ను, ఆత్మహత్య చేసుకోవాలన్న పిరికి ఆలోచనను పూర్తిగా చెరిపేశాను.
కిటికీ తలుపులు తెరిచాను. మబ్బులు మాయమయ్యాయి. వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సూర్యుడు ఉదయించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చంద్రుడు మరికాసేపు ఉండి వెళ్ళాలని చూస్తున్నాడు. దూరంగా ఇంద్రధనస్సు కాంతులతో ఆకాశం మెరిసిపోతోంది. భవిష్యత్తుపై ఆశతో, మధుమతి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో హరివిల్లు లాంటి జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను. సన్మాన కార్యక్రమంలో మధుమతిని కలిసి, ఆమెను అభినందించి తన నుండి మరింత స్ఫూర్తిని పొందడానికి ముందడుగు వేసాను.