Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవిలోని కుందేలుమామ చాలా తెలివైంది. ముఖ్యంగా సింహం లాంటి పెద్ద జంతువుల నుండి తనను తాను బాగా రక్షించుకునేది. ఈ కుందేలు నేర్పరితనం గురించి అన్ని జంతువులతో పాటు కుందేళ్లకు కూడా తెలిసింది. కుందేళ్లన్నీ తమ బుజ్జి కుందేళ్లకు ఆ కుందేలుమామతో శిక్షణ ఇప్పించాలను కున్నాయి.
పెద్ద కుందేళ్లన్నీ, ఆ కుందేలు మామను కలిసి తమ బుజ్జి కుందేళ్లకు పెద్ద జంతువుల నుండి తమను తాము రక్షించుకునే విధానాలను చెప్పమన్నారు. వారి కోరిక ప్రకారం బుజ్జి కుందేళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకుంది. తరువాతి రోజు నుండే కుందేలు మామ, బుజ్జి కుందేళ్లకు స్వీయరక్షణ మెళకువలను నేర్పించటం మొదలు పెట్టింది. ఈ శిక్షణ కార్యక్రమం గురించి ఆ నోట ఈ నోట పాకి మగరాజు చెవిన పడ్డది. అడవిలో ఉన్న చిన్న పెద్ద సింహాలన్నీ మగరాజును కలిసాయి. గట్టిగా గాలి వీస్తేనే పారిపోయే కుందేళ్లు, ఇకపై తమ పంజాలతో సింహాలను కూడా చంపేస్తాయట తెలుసా అన్నాయి. ఆ మాటలలో ఎంత నిజము ఉందో మగరాజు తెలుసుకో వాలనుకుంది. వెంటనే శిక్షణ ఇస్తున్న కుందేలును రమ్మని కబురు చేసింది.
కుందేలు మామ కొంతసేపు ఆలోచించింది. తరువాత మగరాజుతో పాటు నా పంజా దెబ్బను చూడాలనుకునే వారు అడవిలోని మర్రిచెట్టు దగ్గరకు రమ్మని కబురు పంపింది. కుందేలు సమాధానం విని మగరాజు కూడా భయపడ్డది. బయటికి కనిపించకుండా జాగ్రత్త పడింది.
సింహాలన్నీ, మగరాజుతో కలిసి మర్రిచెట్టు దగ్గర చేరి, కుందేలు మామ కోసం ఎదురుచూస్తున్నాయి. అంతలో కుందేలు ఠీవీగా నడుచుకుంటూ వచ్చింది. నేను శాఖాహారిని. కేవలం నా రక్షణ కోసం మాత్రమే జంతువులను చంపుతాను. కావాలంటే 'నా పంజా దెబ్బతిని పడిపోయిన సింహాలను ఈ మూలనున్న బావిలో పడేశాను. కావాలంటే చూసుకోండి' అంది. గబగబా సింహాలన్నీ బావి చుట్టూ చేరాయి. తొంగి చూస్తే వాటి ప్రతిబింబాలు కనిపించాయి. దానికి తోడు ఒకటో రెండో సింహాలు గర్జించాయి. ఆ గర్జన కూడా ప్రతిధ్వనించింది. మిగతా సింహాలు, అది కుందేలు గర్జన అనుకున్నాయి. కుందేలు, మాకన్నా గట్టిగా గర్జించిందంటే, దాని పంజా దెబ్బ కూడా బలంగా ఉంటుంది. దాని జోలికి మనం వెళ్లకూడదనుకుంటూ పరిగెత్తాయి. అప్పటి నుండి కుందేళ్ల జోలికి సింహాలు రావడం మానుకున్నాయి.
- డా.నీరజ అమరవాది, 9849160055