Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లి ముందే పోవడం ఆ తర్వాత తండ్రి కూడా బంగారం లాంటి ఇనుప బకెట్టు తన్నేసి తల్లి దగ్గరికే వెళ్ళిపోవడంతో ఒక్కడుగా మిగిలాడు పరంధాముడు. ఒక్కడూ ఒంటరిగా ఈ పల్లెటూళ్ళో చేసేందుకే ముందిలే అని బయల్దే రాడు. లోకాన్ని చూసొద్దామా, సన్నాసుల్లో కలిసేద్దామా అన్నది ఖచ్చితంగా తేలకముందే.
అట్లా బయల్దేరి వెళ్ళిన పరంధాముడు అనేక ఊళ్ళూ ఉళ్ళల్లో వాడలూ, పట్నాలూ పట్నాల్లో పేటలూ బస్తీలూ తిరుగుతూ హిమాలయాల దాకా వెళ్ళాడు సన్నాసుల్లో కలవడానికి. క్షవరానికి డబ్బుల్లేక జుట్టూ, గడ్డమూ పెంచాడు. గడ్డమే పెరిగాక మాకేమిటి అడ్డు అని మెలితిరిగి గడ్డంలో ఐక్యం అయ్యాయి మీసాలు. దొరికింది తినీ తాగీ ఊగీ ఏళ్ళకి ఏళ్ళు గడిపాక ఒంటికాలు మీద తపస్సు చెయ్యకుండానే వాడికి జ్ఞానోదయం అయింది. ఆ సాయంత్రమే తను పుట్టిన ఊరికి బయలుదేరాదు. టికెట్టు కొనకుండా రైలెక్కేడు.
తన ఊరిని తనే గుర్తుపట్ట లేకపోయాడు. అంతగా మారి పోయింది. ఒకప్పుడు ఏ మేకప్పు లేకుండా ఉన్న పల్లె పడుచు జిగేల్మనే సినీ తారలా ముస్తాబైనట్టు కనిపించింది. పెద్ద బంగళాలు ఎవర్నీ లెక్క పెట్టని రౌడీల్లా నిలబడ్డవి. డబ్బు మంచినీళ్ళలా ప్రవహించే ఖరీదయిన హోటళ్ళూ బజార్లూ కనిపించాయి. అయితే ఈ ఇళ్లన్నీ ఓ పక్కన ఉంటే మిగిలిన ఊరంతా మట్టిగోడల కొంపలూ, గుడిశెలూ లేకపోలేదు. ఊళ్ళో కొందరు మాత్రం బాగా బాగుపడ్డారన్న మాట అనుకుంటూ తన ఇల్లు ఎంతో శ్రమపడి కనుక్కున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్కల్ని తరిమికొట్టి కూలిన గోడల ఇంట్లో ఓ గది బాగు చేసుకున్నాడు. బూజునీ సాలె గూళ్లనీ వదిలించుకున్నాడు. ఇక తన జీవితం ఇక్కడే ముగించాలని నిర్ణయించుకున్నాడు.
తను ఉండటానికి వీలుగా గదిని సర్దుకుంటుంటే ఓ పాత చెక్క పెట్టె కనిపించింది అటుక మీద. దానికి ఓ తుప్పు పట్టిన తాళం కూడా వుంది. దీంట్లో వజ్రాలూ, వైఢూర్యాలూ, మణులూ మణిమాణిక్యాలూ ఉండి ఉంటయి. తొందరపడి ఇల్లు వొదిలి వెళ్ళి సన్నాసుల్లో కలవడం తప్పయిపోయింది అనుకున్నాడు. బండరాయితో తాళం మెడ విరిచి మూత తెరిచి చూశాడు. పరంధాముడు అనుకున్నవేవీ అందులో లేవు. ఇక మసి పట్టిన కిరసనాయిలు బుడ్డిదీపం ఉన్నది అంతే. ఎందుకూ పనికిరానిదైతే పెట్టెలో పెట్టి తాళం వేస్తారా అని 'డౌటు' పడ్డాడు. ఉన్నట్టుండి వాడి బుర్రలో పాదరసం దిక్కు తోచకుండా పరుగెత్తసాగింది. 'అవును అంతే' అనుకుంటూ దొడ్లోకి వెళ్ళి ఆ దీపాన్ని శుభ్భరంగా కడగడం మొదలుపెట్టాడు. వాడి బుర్ర అబద్ధం చెప్పలేదు. కొండలాంటి ఆకారం ఒకటి ఎదుటికి వచ్చి నిలబడింది. నీలం రంగు వదులు పైజామా మెరుపుల ఎర్రకోటూ, బోడి గుండు మీద జానెడు పిలక ఉన్న ఆకాశం 'బాస్' ఐయాం ఎట్ యువర్ సర్విస్' అన్నది చేతులు కట్టుకు నిలబడి.
బుడ్డి దీపంలోంచి వచ్చిన భూతాన్ని వెంటనే ఏమని అడగాలో అర్థం కాలేదు పరంధాముడికి. 'ఇప్పటికి 'డిజప్పియర్' అయిపో. కాస్త ఆలోచించుకుని తర్వాత మళ్ళీ దీపాన్ని బూడిదేసి తోముతా పో' అన్నాడు. భూతం మాయమవగానే 'థింకింగ్' మొదలుపెట్టాడు. వీడికి అడిగితే ఈ కొంపని ఫలక్నామా ప్యాలెస్ చేయగలడు కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఊరుకోరు. ఇల్లంతా కరెన్సీతో నింపేయమంటే ఇన్కంటాక్స్ వాడు 'టై' ఊపుకుంటూ వస్తాడు. బంగారం కోరుకుంటే 'కస్టమ్స్' వోడితో కష్టం. ఈ కాలంలో అద్భుత దీపం అన్నా భూతం ఏమిచ్చినా గవర్నమెంటోడు చావగొట్టేస్తాడు. దీన్ని వాడికే యిచ్చేసి అంతోఇంతో పుచ్చేసుకుంటే సరి అనుకున్నాడు. తన తాత ముత్తాతలకు 'పరోపకారులు', 'ఊరికి ఉపకారులు' అనే బిరుదులుండేవని తండ్రి చెప్పాడు. తనూ ఊరికి ఉపకారిగా పేరు తెచ్చుకుందామనుకున్నాడు. ఆ దీపం పట్నాన్ని ఏలే ప్రభువుకి యిస్తే పూరి గుడిసెలోళ్ళకి బంగ్లాలు కట్టిస్తాడని అనేక ఉచిత పథకాలు అమలు చేసి పేదోళ్ళనేవాళ్ళు లేకుండా చేస్తాడని ఆ పట్నాన్ని న్యూయార్కో మలేషియానో చేస్తాడనీ అనుకున్నాడు. అద్భుత దీపాన్ని ప్రభువు గారికి అందజేశాడు.
పట్నాన్ని ఏలేవాడు దీపం బుడ్డిని బాగా తోమి భూతాన్ని రప్పించాడు. ఉచిత ఇళ్ళు, ఉచిత బియ్యం, ఉచిత సామాగ్రి, ఉచిత మందు, ఉచిత చీరలూ జీన్పాంట్లూ షర్టులూ, ఉచిత రైళ్ళూ బస్సులూ ఉచిత మందులూ మాకులూ నడివయస్సు ఫించన్లూ విద్యార్థులకు పాకెట్ మనీలు, నిరుద్యోగులకు నెలనెలా జీతాలు వంటి ఓ వందా ఏభై ఉచిత పథకాల జాబితా చదివాడు.
'ఇవన్నీ అమలు చెయ్యాలా ఆకా' అన్నాడు భూతంగాడు గడ్డం పీక్కుంటూ. 'అది నీ వల్ల కాదు నా వల్ల కాదులేవోరు!. ఈ పథకాల అమలుకు కావాల్సిన బంగారు కాసులు డ్రమ్ముల్లో నింపి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళు. వచ్చే ఎలక్షన్ల ఖర్చుకి పనికొస్తయి. ఎన్నికల్లో గెలిస్తే దీపం బుడ్డి తోమి మళ్ళీ నిన్ను పిలిచి మరిన్ని ఉచిత పథకాల లిస్టు చదువుతానన్నాడు పట్నపు ఏలిక.
భూతం అరికాలి మంట బోడి గుండెకెక్కింది. ఏలిక చేతిలోంచి దీపం బుడ్డి లాక్కుని 'ఏదడిగితే అది ఇవ్వడానికి నేను బి.సి. కాలం నాటి భూతాన్ని కాను' అంటూ గాలిలో కనరాని గడుసు దెయ్యంగా మారిపోయింది!!
-చింతపట్ల సుదర్శన్,
9299809212