Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగాపురం గ్రామంలో సదానందం అనే రైతు ఉండేవాడు. అతడు పేరుకు తగినట్లే ఎల్లప్పుడు ఆనందంగా ఉండేవాడు. పంటలలో నష్టం వచ్చినా అతడు లెక్క చేసేవాడు కాడు. ఒకసారి రెండు సంవత్సరాలు వరుసగా సదానందంకు పంట నష్టం వచ్చింది. చేసిన బాకీ అలాగే ఉండిపోయింది. అయినా సదానందం బెదరలేదు. అప్పుడు అతని కొడుకు గోవిందం ''నాన్నా! మూడోసారి పంట వేస్తే మనం అప్పుల ఊబిలో దిగబడి పోవాల్సిందే. అయినా నీవు ఆనందంగానే ఉన్నావు. నీకు భవిష్యత్తు గురించి ఏమి ఆందోళన లేదా''! అని ప్రశ్నించాడు. అప్పుడు సదానందం ''ఒరేరు! దిగులుపడితే ఏమొస్తుందిరా? పంట నష్టం వస్తే రానీ! మరలా నేను అప్పు చేసి అయినా మూడో సంవత్సరం పంటను వేస్తాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు పంటను ముంచాయి. ఎప్పుడూ ఇలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి?'' అని అన్నాడు.
తండ్రి ఇక మారడని గోవిందం ''సరే! నీ ఇష్టం నాన్నా! ఈ సంవత్సరం పంట నష్టం వస్తే నీకే తెలుస్తుంది. ఇంట్లో అమ్మ ఈ పూటకు గింజలు లేక ఎంత బాధ పడుతుందో నీకు తెలియదు'' అని అన్నాడు.
ఒకరోజు సదానందం పొలం వైపు వెళ్ళాడు. పంట ఏపుగా ఎదిగింది. కానీ తెల్లవారితే పంట చేతికి వస్తుందనగా మళ్లీ రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట మొత్తం నాశనమైంది. అయినా సదానందం నవ్వుతూనే ఉన్నాడు. అతని కొడుకు మాత్రం తల పట్టుకున్నాడు. ''ఎందుకురా తల పట్టుకుంటావు? వ్యాపారంలో, వ్యవసాయంలో లాభనష్టాలు సర్వసాధారణం. రైతు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అది అందరికీ మంచిది. పంట నష్టానికి నీవు ఆందోళన చెందకు. పంటను మనం ఒక్కరమే తినాలా! పశుపక్ష్యాదులు తినకూడదా! ఈ భూమి ఒక్క మనదే కాదు రా! అన్ని ప్రాణులది'' అని అన్నాడు.
కొద్దిరోజుల తర్వాత సదానందం నాలుగోసారి కూడా అప్పులు చేసి పంట వేశాడు. అతడు తన పొలం వైపు నడక సాగిస్తూ ఉండగా అతనికి ఒక బంగారు నగల మూట దారిలో దొరికింది.
మరుసటి రోజు సదానందం ఆ మూటను తీసుకొని రాజాస్థానానికి వెళ్లి రాజుగారికి ఆ నగలమూటను అందజేశాడు. రాజు ఆశ్చర్య పోయి సదానందానికి బహుమతిని ఇవ్వబోయాడు. సదానందం నిరాకరించి ''ప్రభూ! మీరు ఈ నగలను అమ్మగా వచ్చిన డబ్బును పేదవారికి ఖర్చు పెట్టండి చాలు'' అని తిరిగి వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి తన వేగుల ద్వారా సదానందం ఇంటి పరిస్థితులను వాకబు చేశాడు.
అతడు మరుసటిరోజు సదానందాన్ని పిలిపించి ''నీ నిజాయితీకి సంతోషించాను. నీవు చాలా పేద వాడివని, అప్పుల్లో కూరుకుపోయినవని నాకు తెలిసింది. నీకు నెల నెలా మీ ఇంట్లో జరుగుబాటు అయ్యేటట్లు ఆర్థిక సహాయం చేస్తాను. మళ్ళీ నీవు నాకు ఇవ్వనక్కర్లేదులే! నీవు ఈ వయస్సులో విశ్రాంతి తీసుకో'' అని అన్నాడు. అప్పుడు సదానందం ''రాజా! నాకు విశ్రాంతి అవసరం లేదు. నేను కష్టపడితేనే ఆరోగ్యంగా ఉంటాను. నాకేగాదు, ఏ రైతుకైనా పంటలు బాగా పండించి ప్రజల కడుపులు నింపాలని ఉంటుంది. ఇంక నా అప్పు అంటారా! ఎప్పటికీ నష్టం వస్తుందని మనం ఎందుకు అనుకోవాలి? ఈసారి పంట లాభం వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను సోమరిగా మారలేను. నా వ్యవసాయం వదులుకోలేను. మీ సహాయం వద్దన్నందుకు క్షమించండి'' అని అన్నాడు .
ఆ సంవత్సరం సదానందం పంట చాలా లాభాల నిచ్చింది. చేసిన అప్పు మొత్తం తీరిపోయింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం లాభం వచ్చి సదానందం ధనవంతుడు అయ్యాడు. ప్రతి సంవత్సరం తానే పది మందికి కొలువులు ఇవ్వ సాగాడు.
ఒకసారి రాజు గారే స్వయంగా సదానందం పొలానికి వచ్చి చూసి అతడిని, అతని కుమారుని అభినందించి ''సదానందం నీవే మా అందరికీ ఆదర్శం. నీ వద్ద నేను ఉన్నదానితో తప్తిని పొందాలని, ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని, ఇతరుల కొరకై కష్టపడాలని, అదే ఆరోగ్య రహస్యమని తెలుసుకున్నాను. అంతేకాదు. నీకు ఏ సహాయం కావలసి వచ్చినా ఈ రాజు కాదనడు'' అని అభినందించి వెళ్ళిపోయాడు.
-సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535