Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పక్క జైలు మరో పక్క స్కూలు. చుట్టూ చిన్న చిన్న రేకుల ఇండ్లు. చుక్కల మధ్య చంద్రుడిలా ఓ బిల్డింగ్. దాని మీద హాస్టల్‌ను తలపించే ఓ బ్యాచిలర్స్ రూం. ఎండాకాలం కావడంతో అందరూ డాబా మీద పడుకున్నారు. ఒక్కడు మాత్రం పడుకోలేదు. చుట్టూ పడుకుని ఉన్నవారి పేగుల చప్పుడు వింటూ ఆలోచిస్తున్నాడు. ఆకలికి నిద్ర సరిగా పట్టకపోవడంతో ఇంకొందరు అటూ ఇటూ నుసులుతున్నారు. బహుషా వారు ఆ రాత్రి బొంగులు కారం కలుపుకుని తిని, నీళ్ళు తాగి పడుకున్నరేమో! పక్కనే ఉన్న చింత చెట్టు ఊగడం ప్రారంభమై గాలి రాసాగింది. రాత్రి పదిన్నర పదకొండు గంటల మధ్యలో ఫోన్ మోగింది. నోకియా 1200 బేసిక్ ఫోన్ అది. ఫోన్ రింగ్ అవుతుండగా 'నవ' పేరు డిస్ప్లే అయితుంది. లిఫ్ట్ చేసాడు.
'హలో నవ'
'హలో యువన్.. నువేం చేస్తావో నాకు తెలీదు తెల్లారే పాటికి మా ఇంటి దగ్గరుండాలి.'
'ఎందుకు నవ? ఇప్పుడు టైం ఎంతో తెలుసా! అయినా అంతదూరం తెల్లారేసరికి ఎలా రాగలను? ఎంత పొద్దున బయల్దేరినా కనీసం పది అవుద్ది. అయినా అంత అర్జెంట్ ఏంటీ?'
'నువ్వు రేపు మార్నింగ్ ఏడు గంటల వరకు మా ఇంటికొస్తేనే మనం కలవగలం. లేదంటే మనం ఎప్పటికీ కలుసుకోలేము. మిగతా అన్ని విషయాలు రేప్పొద్దున చెప్తా బారు.. (గుసగుసగా)
************
ఎన్.హెచ్ నైన్ సింగిల్ రోడ్. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే నెలల తరబడి విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్మెంట్ వందలకోట్ల రూపాయలు విడుదల చేయలేదు. వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారు. చాలా మంది విద్యార్థులు స్లోగన్స్ ఇస్తున్నారు. ఎర్రని చుక్కా, ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం అని రాసున్న తెల్లని జెండా వారి చేతుల్లో రెపరెపలాడుతుంది.
'వీరి పిచ్చి కానీ స్కాలర్ షిప్స్రాకపోతే రోడ్డు మీదికొచ్చి సామాన్యుల్ని ఆపితే ఏమొస్తది? ఏందిరా అంటే సదువుకున్నోళ్ళమంటరు.'
బస్సులో కూర్చున్న ప్రయాణికుడు గొణుగు తున్నాడు. ఇంతలో రస్తారోకో లోని విద్యార్థుల మధ్యలో పిల్లల కోడిలా ఉన్న యువన్ లేచి మాట్లాడుతున్నాడు.
'ప్రజలారా మీకు అసౌకర్యం కలిగిస్తున్నందుకు క్షమించండి. మీకు సమస్య ఉంటే రాస్తారోకో చేసి మమ్మల్ని ఎందుకు ఆపారు? అని మీలో చాలా మంది అనుకుం టుంటారు. ప్రభుత్వాధికార్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలుమార్లు విన్నవించి మేము అలసిపోయాము. కాబట్టే మా సమస్యను ప్రజాదర్భారుకు తీసుకరాక తప్పలేదు. సామరస్యంగా పరిష్కారం కాని పంచాయితీని మాత్రమే నాలుగుబాటలు కలిసే దగ్గర కూర్చుని పరిష్కరించుకుంటాము కదా! ఇది కూడా అలాంటిదే. ప్రభుత్వం మాకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టిస్తుంది. ప్రభుత్వానికి కమర్షియల్ ఖర్చుల మీదున్న శ్రద్ధ పేద విద్యార్థుల చదువుల మీద లేదు. పాలకులు మాకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే మా తల్లిదండ్రులుగా మీ మీదే అదనపు భారం పడుతుంది. కాబట్టి మీరు ఆ భారాల్ని భరించగలరా ఆలోచించండి. ఓట్లేసి వాళ్ళను గద్దె మీద కూర్చొబెట్టిన మీరే ఈ ప్రభుత్వానికి అధిపతులు, ఓనర్లు. అందుకే మీ దష్టికి తీసుకరావడానికి, విన్నవించడానికే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రస్తారోకో చేపట్టాల్సి వచ్చింది.'
ఈ లోపే సైరన్ వేసుకుని అంబులెన్స్ వచ్చింది. వెంటనే ఓ పది మంది విద్యార్థులు దానికి దారిచ్చి రూట్ క్లియర్ చేసి పంపిచ్చారు. మళ్ళీ ఇంకో సైరన్ వచ్చింది. ఏంటా అని చూస్తే హైకోర్ట్ జడ్జీగారు అర్జెంట్ ఫంక్షన్ వెళ్ళాలి దారి వదలమంటూ గన్‌మెన్స్ వచ్చారు.
'అయ్యో జడ్జీ గారా! అయితే ఏం పరవాలేదు కాస్తా ఆగమనండి. మా సమస్య హైకోర్ట్‌కు కూడా తెలియాల్సిందే. సార్‌కు వినతిపత్రం రాసిస్తాం. క్షమించండి ఇప్పుడే దారి వదలబోము' అని గన్మెన్స్ను తిప్పి పంపారు. ఇంకేముంది కొద్దిసేపట్లోనే సి.ఐ తుపాకులేసుకుని ఉన్న తన పోలీస్ పటాలంతో రానే వచ్చాడు. మరి హైకోర్ట్ జడ్జీని ఆపితే ఊరుకుంటామా అన్నట్టు వస్తూనే లాఠీచార్జి స్టార్ట్ చేసాడు. కొట్టుకుంటూ విద్యార్థి సంఘ లీడర్ల దగ్గరికి చేరుకున్నాడు. పారిజాత నాయకత్వంలో చైన్‌లాగా ఉండి ఉన్నయ్య, మల్లికార్జున్ దగ్గరికి పోలీసులు చేరకుండా చుట్టూ విద్యార్థినీలు ఏరు.. అంటూ అరుస్తూ రక్షణగా ఉన్నారు. వెంటనే పక్కనున్న యువన్‌ను పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో దాడికి దిగారు. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఎలా చూసిందో కానీ తల మీద దెబ్బ పడుతుండగానే ఎగిరి అడ్డుకున్నది నవ. అనడం కంటే యువన్‌కు బదులు తను లాఠీ దెబ్బ తిన్నదనాలి. స్వర్ణ, గిరి, గురూ, శివ, రవి వచ్చి కర్రలు లాక్కుని పోలీసులతో తోపులాటాకు దిగారు. కొంతమంది విద్యార్థులు పోలీసులతో బాహాబాహీ తలపడ్డారు. నాయకత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళకుండా విద్యార్థినీ, విద్యార్థులు జీపుల టైర్ల ముందు పడుకున్నారు. దాదాపు గంటసేపటి తర్వాతే అరెస్ట్ చేయగలిగారు.
'మీరు నాయకులు కాబట్టి మా పోలీసులతో తోపులాటలు, ఇవ్వన్నీ అనుభవం ఉంది. ఆ మామూలు స్టూడెంట్స్‌కు ఏమి చెప్పి అంత మిలిటెన్సీగా మార్చారయా? మాకు చుక్కలు చూపించారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళను దాటుకుని రావడం మరో ఎత్తయింది?'
'స్టూడెంట్స్‌కు పెద్దగా నేర్పాల్సిన పనిలేదు సి.ఐ గారూ. వాళ్ళకి సహజంగానే నాయకత్వ లక్షణాలుంటాయి. అవి సందర్భాన్ని బట్టి ఇలా బయటకొస్తాయి. ఇలాంటప్పుడు గుర్తించి వాళ్ళను నాయకులుగా డెవలప్ చేసుకుంటాం.'
'సరే ఉన్నయ్య స్టేషన్ ఫార్మాల్టీస్ అన్నీ అయిపోయాయి. ఇక కోర్టుకు బయలుదేరండి'
కోర్ట్‌లో హాజరుపరిచి జైలుకి పంపారు. టీంగా వెళ్ళిన ఉద్యమకారులకు జైలుకు బయటకు పెద్ద తేడా ఏముంటుంది? మూడు రోజులున్న జైల్లో అదే జరిగింది.
'ఉన్నన్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అరిబండి లక్ష్మినారాయణ వర్ధంతి. కాబట్టి జైల్లోనే సభను నిర్వహిద్దాం'
'గుడ్ ఐడియా యువన్ నీవు పాటల బాధ్యత తీసుకో.'
'అయితే జైల్లోనే ఒక ర్యాలీ కూడా చేద్దాం' అన్నాడు మల్లికార్జున్.
'మల్లికార్జున్ మీరు ఏమనుకుంటున్నారసలు? యువన్ సభ అంటడు. నువేమో ర్యాలీ అంటున్నవు. మనం జైల్లో ఉన్నామనేది మర్చిపోయారా?'
'ఉన్నన్నా మనం బయట ఉంటే చేసే వాళ్ళం కాదా! ఇప్పుడలానే చేద్దాం.'
'ఒరేరు శివ నువ్వుండురా నువ్వుండు. ర్యాలీ చేసీ స్లోగన్స్ ఇచ్చి ఇందులోనే ఉండురా మొత్తం. బయటకు పోవద్దా మనం. ర్యాలీ చేస్తే తప్పేం లేదు కానీ, బయట చేయాల్సినవి చాలా ఉన్నరు కదా! ఇక్కడ ర్యాలీ చేస్తే బయటకెళ్ళలేము.' అని సభ మాత్రమే చేద్దామని అందరిని ఒప్పించాడు ఉన్నయ్య. అంతే జైల్లో ఉన్నోళ్ళందరిని ఒక్కదగ్గర కూడేసినారు. జైలరు, సూపరింటెండెంట్ రాకముందే సభ పూర్తి చేయాలన్నారు వార్డర్లు.
'మా అరిబండి అంటె దోపిడోల్ల గుండేలదిరె జెండా తల్లి
సల్లని కుండ నీళ్ళకన్న చల్లనోడే కన్నాతల్లి
ఎర్రని జెండమ్మా నిను గుండెలకద్ది ముద్దాడిండమ్మా'
పాటను అందరూ చప్పట్లు కొడుతూ పాడారు. అలా చాలా పాటలు పాడారు. జైల్లో పండుగ వాతావరణం ఏర్పడింది.
'అమరులను తల్సుకోవడం, వారి త్యాగాలను కొల్సుకోవడమే నిజమైన పండుగ' మల్లికార్జున్, ఉన్నయ్య మాట్లాడారు. తెల్లారి సాయంత్రానికి అడ్వకేట్ స్వామి బెయిల్ పేపర్స్ తీసుకుని వచ్చాడు.
'జైల్లో ఆటలు, పాటలు, పరివర్తన వ్యక్తిత్వ వికాస పాఠాలు అని సభలు నడిపి మీరు ఖైదీలను చెడగొడుతున్నరట. ఇలా ఐతే ఖైదీలు మా మాట వినరు. వాళ్ళకి త్వరగా బెయిల్ ఇచ్చి పంపిస్తే బాగుంటదని జడ్జీ గారికి సూపరింటెండెంట్ పర్సనల్ రిక్వెస్ట్ చేయడం వలన మీకు త్వరగా బెయిల్ వచ్చింది' అని లాయర్ స్వామీ చెప్పడంతో స్టూడెంట్ లీడర్స్ అంతా నవ్వుతూ బయటకొచ్చారు.
************
హీరో హోండా సిడి హండ్రెడ్ బైక్ స్టార్ట్ చేసి గిరి గేరు వేశాడు. యువన్, గురూ ఒకరి వెనుక ఒకరు కూర్చున్నారు. కాలేజీలు, హాస్టల్స్, కాంక్రీట్ కట్టడాల మధ్య ఎడారిలో ఒంటెలా సాగిపోతుంది బైక్. అంతలోనే ఒయాసిస్సులా ఓ చెర్వు అలుగుపోస్తుంది. దాన్ని దాటుకుని పచ్చని పొలాల్లో, ఆకాశంలో జెట్ విమానంలా పొగలు వదులుతూ దూసుకుపోతుంది బైక్. చుట్టూ చిక్కగా పట్టిన మబ్బు యవ్వనంతో తొణికిస లాడుతుంది. కాసేపట్లోనే ఎంతో మురిపెంగా నేలను ముద్దాడుతున్న ఆకాశం. చల్లని గాలి ప్రేమగా మేఘాలను పెనవేసుకోవడంతో నింగి నేల ఒక్కటయ్యాయి. ఆ చినుకుల తాకిడికి సంగన్న గుడిలో తెల్లని పువ్వులు ఒళ్ళు విరుస్తూ సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇదిగో మా సయ్యాటలు చూసారా అన్నట్లు అప్పుడప్పుడు వానజల్లు గుడిలోపలికి కూడా దూసుకొస్తుంది. అక్కడ టక్ చేసుకుని నిలబడ్డ యువన్ ఆ చిరుజల్లుల తాకిడికి మురిసిపోతున్నాడు.
'ఒక అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడాలంటే ఇంత వెయిట్ చేయాలా గిరి'
'ఈ యువన్ కోసం మనకు తప్పదుగా గురూ'
'అది సరే కానీ ఆ అమ్మాయి ఎవరు గిరి?'
'నీ పక్కనే ఉన్న యువన్‌ను అడగకుండా నన్నడగడం ఎందుకు గురూ? ఎప్పుడు నన్నిరికించాలనే చూస్తవ్ గురూ నువ్వు.'
'ఇంతకి చెప్తావా చెప్పవా?'
'తమరు అడిగాక చెప్పక తప్పుతుందా గురు గారూ! పదేళ్ళ క్రితం ఒక పోరాటంలో యువన్ తల పగలకుండా పోలీసులను అడ్డుకుని పోరాడిన అమ్మాయే ఈ నవ. నేను గమనించినంత వరకైతే అంతకు ముందు నుంచే ఈయన అంటే ఆవిడ గారికి వీరాభిమానం.ఆ రకంగా వారికి ఓ మానసిక ఐక్యత ఉన్నట్టు అప్పటి వాతావరణ కేంద్రం వార్తలను వెలువరిచిందని వినియుంటిమి. ఆమెను అడగనూ లేము, ఈయన విప్పియూ చెప్పడూ. మనము కేవలము సామాన్య ప్రేక్షకులమే గురువర్యా!' అంటూ వాళ్ళు పాస్ట్ రన్నింగ్ కామెంట్రీలో మునిగిపోయారు.
పదేళ్ళ తర్వాత కలవాలనుకున్న ఓ అమ్మాయి కోసం ఎదురు చూడడంలో ఎంతటి ఉత్సుకత, ఉద్విగత ఉంటుందో ఒక్క యువన్‌కు మాత్రమే తెలుసేమో. పొద్దుగూకుతుంది కానీ వస్తుదనుకున్న నవ రాలేదు. పొద్దుటి నుంచి తన కోసం ఎదురుచూస్తూ అలసిన మనసుకు ఆ వర్షంతో రేగిన మట్టి పూల పరిమళమే ఆలంబనయింది. చీకటి పడుతుండడంతో సూర్యుడితో పాటే యువన్, గిరి, గురూ తిరుగుబాటపట్టారు. నిజానికి నవ, యువన్ మధ్య ఇలా ప్రత్యేకంగా కలవాలనుకునే సందర్భం తొట్టతొలిసారి. అందుకే నవ ప్రతిపాదించిన ప్రదేశంలో కలవడానికి వచ్చారు. వారి మధ్య విస్తత అభిమానం, పరస్పర అవగాహన వలన ఒక బలమైన అప్రకటిత, అవ్యక్త ఐక్యతా భావన ఏదో ఒకరంటే ఒకరికి నిండి ఉన్నది. కనుకనే ఇంతకాలం టచ్‌లో లేకపోయినా కలవాలనుకుంటున్నారు.
'హలో గిరి నవ వస్తా అన్నదని చెప్పావ్!'
'అవును. యువన్ నిన్ను కలవాలన్నాడని చెప్పగానే వస్తా అన్నది. నా సెల్ నంబర్ కూడా తీసుకుంది. తనే కాల్ చేస్తానంది. నన్ను చేయొద్దని చెప్పింది. తను స్పందించిన తీరు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ను చూస్తే గ్యారెంటీగా వస్తుందనే అనిపించింది. కానీ ఏమి జరిగిందో తెలియదు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నవ నాకు ఎస్సెమ్మెస్ చేస్తుంది. నీ నంబర్ అడుగుతుంది ఇస్తున్నా, ఇచ్చేశా కూడ.' అంతలోనే యువన్ కు ఎస్సెమ్మెస్ వచ్చింది
'సారీ యువ. థిస్ ఈజ్ నవ. ఐ కెనాట్ టాక్ టూ యు రైట్ నవ్'
'ఓ..హారు నవ? వై యూ ఆర్ నాట్ కేమ్'
'ఎస్. యామ్ అనేబుల్ టూ కమ్. బట్ ఎప్రిల్ 28 న మన రవి స్టేజ్ మ్యారేజ్‌కు నువ్వు ఎలాగూ వస్తావు కదా! అక్కడ తప్పకుండా కలుద్దాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వన్స్ ఎగైన్ సారీ యువ.'
'ఇట్స్ ఓకే.'
************
రవి, అరుంధతి లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఉద్యమంలో పని చేస్తున్నది. పెద్దలను ఒప్పించుకున్నారు. మొత్తానికి ఈ రోజు పెళ్ళి జరుగుతుంది. డప్పు-కొమ్ములు, బ్రాహ్మణుడు-మంత్రాలు, తాళీ-పోలు, మేళాలు-తాళాలు, తలంబ్రాలు-తోరణపాకులు ఇవేవి లేవు. నలుగు పెట్టేది లేదు, వీరునికెళ్ళేది లేదు. ఇదేం పెళ్ళి! ఊరంత ఒకటే చర్చ.
'పూజారి లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది చిత్రం కాకపోతే!'
'పెళ్ళికి పూజారి ఎందుకు? పిల్లా పిలగాడు ఉంటే చాలు కదా!' గ్రామస్తులు, బంధువులతో రవి సహచరులంతా చర్చిస్తున్నారు.
'అయినా రవిగాడు ఇలా చేయొచ్చా! మన పార్టీ అనీ సంఘంలోకి అమ్మాయిలను పంపిస్తే లవ్ లోకి దింపి పెళ్ళి పేరంటం అనడం పద్ధతా? సంఘం అంటే ఎంత పద్ధతిగా ఉండాలి? ఇక ఎవరైనా అమ్మాయిలను పంపిస్తారా ఇలా అయితే?'
'సంగారెడ్డి అన్న రవిగాడు చాలా మంచి పని చేశాడు. మీరిలా అంటే ఎలా చెప్పండి. పిల్లలు లవ్ చేసుకుంటారేమో అని కాలేజీకి, గుడికి, సినిమాకు, ఉద్యోగాలకు పంపించకుండా ఉంటారా చెప్పు? పైగా ఈ దేశానికి ప్రేమ వివాహాలు చాలా అవసరం. హెరిడిటీ వలన ఆరోగ్య సమస్యలొస్తున్నాయని సైన్స్ కూడా చెప్తుంది. ప్రదేశమేదైనా, పనేమైనా ప్రేమ సహజాతి సహజం, ప్రకతి సిద్దం. అయినా సంఘంలో ఇలా చేయొద్దని ఎలా చెప్పగలం? సుందరయ్య లీలా, ప్రకాష్ కరత్ బందా సంఘంలోనే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ప్రపంచం ఆరాధించే మార్క్స్, చేగువేరది కూడా ప్రేమ పెళ్ళినే. మన దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజివ్ గాంధీలది కూడా ప్రేమ వివాహమే.' అని యువన్ సంగారెడ్డికి హితబోధ చేస్తున్నాడు.
అంతలోనే రాణీ కలర్ డ్రెస్ వేసుకుని నవ రానే వచ్చింది యువరాణీలా. పదేళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఎదురుపడ్డారు. ఒకరినొకరు చూసుకుని ఎక్కడో అజ్ఞాతంలో ఉండి తొలకరి రాగానే కనిపించే ఆరుద్ర పురుగులంత అందంగా, అప్పుడే చిగురించిన తంగేడు పూవుల్లా మెరుస్తూ మురిసిపోతున్నారు. స్టేజి మీద పెళ్ళి జంట ప్రమాణ పత్రాలు చదివి, దండలు మార్చుకుంటున్నారు. జనాలు చప్పట్లు కొడుతూ అభినందనలు ప్రకటిస్తున్నారు. యువన్ పెళ్ళి పనుల్లో మునిగి ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నవ వచ్చినప్పటి నుంచి వారిద్దరి ఐ కాంటాక్ట్ మాత్రం కట్ అవలేదు.
'యువన్.. ఈ పని మేం చూసుకుంటాం కానీ నవ పిలుస్తుంది వెళ్ళు.'
'తెలుసు గిరీ. వెళ్తున్నా కంగారెందుకు?'
'అవునా ఎలా తెలుసు గురూ! యువన్‌కి నేనిప్పుడే చెప్పాకదా!'
'అంత ఆశ్చర్యం ఎందుకు గిరి? ఆమె వచ్చిందే యువన్ కోసం రవిగాడి పెళ్ళికి కాదుగా!'
''నవా నువ్వు అలా కళ్ళతో గాయాలు చేసి, చూపులతో ఔషధం పూస్తుంటే తట్టుకోగలనా చెప్పు'
'ఓరు ఆపుతావా నీ పోయెట్రీ. మరి తమరు చేసేది ఏంటో!'
'నవ నీ పెళ్ళి అయిందా?'
'యువన్ నీ పెళ్ళి అయిందా?'
'హేరు నీ కోతి ప్రశ్నలాపుతావా కాసేపు. నేను సీరియస్ గా అడుగుతున్నా చెప్పు.'
'ఆ..ఆ సీరియస్‌నెసే కొంపలు ముంచి పదేళ్ళు చేసింది. ఇంకా సీరియస్ అట సీరీయస్'
'ఏమైంది'
'ఏమైంది అంటావేంటి యువన్! మీ నాయకులు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారేమో కానీ మమ్మల్ని అర్థం చేసుకోరు. ఏమైనా మాట్లాడాలని ట్రై చేద్దామంటే లీడర్ ఫోజు ఒకటి. అసలేలా మాట్లాడాల్రా మీతో. ఎందుకర్ధం చేసుకోరు.'
'హ హ హ అది సరే. ఇంతా ఓపెన్‌గా, ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు నవా!'
'ఎందుకు మాట్లాడను? నేనేమైనా అప్పటిలా చిన్నపిల్లనా? పైగా మా గిరి అన్నయ్య లీకులిచ్చాడు లే నీ గురించి.'
'అది సరే లే కానీ నువ్వు ఇన్నేళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు నవ?'
'నువ్వు ఇన్నేళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు యువ?'
'హేరు నీలో ఇంకా ఆ చిన్నపిల్లతనం పోలేదు నవ. అయినా ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏంటసలూ..లేత చింతకాయ కొరికినప్పుడు కలిగే పుల్లదనపు పులకరింతాలా ఉంది నాకైతే'
'అబ్బ మస్తు చెప్పినవ్ కానీ ఆ రవిగాడిని చూశావా! వాడు మనవైపే చూస్తున్నాడు. మనం ఇద్దరం ఏ మీటింగ్ లో కలిసినా వాడి కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. మన మీద వాడికున్న అనుమానంలో ఏ మాత్రం మనకున్నా మన పెళ్ళి వాడికంటే ముందయ్యేది కదా యువన్' మాటల్లో మునిగిపోయారు.
************
'హలో యువ లేచావా? ఇప్పుడు టైం నాల్గవుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయితేనే త్వరగా రీచ్ అవగలవు.'
'నిద్రపోతే కదా నవ! స్టార్ట్ అవుతున్న.' బస్ ఎక్కాడు. గిరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బహుషా తను ఇంత ఎర్లీగా నిద్ర లేవడు.
'హలో గురూ.. గిరి ఫోన్ ఎత్తడంలేదు. నేను అక్కడికి వస్తున్నా. ఆల్రెడీ బస్‌లో ఉన్నాను. నవ రాత్రి ఫోన్ చేసింది. పొద్దున్నే మా ఇంట్లో నువ్వుండకపోతే మనం మళ్ళీ కలవలేమని చెప్పింది. మార్నింగ్ కూడా మాట్లాడింది. సడెన్ గా ఈ రోజు వాళ్ళింట్లో పెళ్ళి ఫిక్స్ చేయబోతున్నారట. నేను ఒకతన్ని ప్రేమించాను వేరెవరిని చేసుకోనని చెప్పిందట. ఇక ఆపడం నావల్ల కాదు నువ్వే వచ్చేరు. తెల్లారేలోపు మా ఇంట్లో ఉండాలని చెప్పింది.'
'డొంట్ వర్రీ యువన్. నీవొచ్చేలోపు నేను వాసన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాను. ఆయనది వారి క్యాస్టే. కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళడం బెటర్. పైగా వాళ్ళ లీడర్ కూడా మనం మాట్లాడడంతో పాటు ఆయన చెప్తే ఒప్పుకుంటారు అనిపిస్తుంది.'
ఎస్సేమ్మెస్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడి వరకొచ్చావు? ఎవరెవరొస్తున్నారు? ఇంటి దగ్గర మా వాళ్ళేమన్నా తిట్టినా కూడా సీరీయస్ అవద్దు ప్లీజ్. త్వరగా రా. అని వాటి సారాంశం. ఆ మెసేజ్ ల వర్షంలోనే యువన్, గురూ, వాసన్న నవ వాళ్ళింటికి చేరుకున్నారు. వాసన్నను గుర్తుపట్టి వాళ్ళు కూర్చోమ్మని చైర్లు వేశారు. వాటర్ ఇచ్చి మర్యాద చేశారు.
'ఇతను యువన్ పి.జి చదువుకున్నాడు. ఇతడి గురించే మాట్లాడడానికి వచ్చాం. మీ నవ ఇతను ప్రేమించుకున్నారు. పెళ్ళి చేస్తే వాళ్ళు మంచిగ బతుకుతారు.'
'అదేంటండి.. మా అమ్మాయి ఇప్పటిదాక అలాంటిదేమీ చెప్పలేదు. ఇవాళ పెళ్ళి చూపులకు వేరేవాళ్ళు వస్తున్నారు. ఆ సంబంధం మా కుటుంబానికంతా ఇష్టమే. ఆ అబ్బాయికి మా అమ్మాయి కూడా ఇష్టమే. మిగతా ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుని ఈరోజు అంతా ఫైనల్ అవుతుంది. ఇంతలో మీరొచ్చారు. మాకేం అర్థం కావడంలేదు.'
'నవ మీ నాన్న చెప్పింది నిజమా! నిజమే వాసన్నా కానీ నాకు ఆ సంబంధం ఇష్టం లేదు. నేను వద్దనే చెప్తున్నాను.'
నవ వాళ్ళమ్మ గయ్యిమని లేచింది తన మీదకు. వాళ్ళ అక్క వచ్చి ఆపింది.
'మరి యువన్ ఇష్టమేనా?'
'యువ అంటే ఇష్టమే వాసన్నా. కానీ మావాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటాను.'
'చేసుకుంటదట! ఎవడని చేసుకుంటవే? వాని కులమేందో? మతమేందో? చేసుకుంటదట. మా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. వాసన్నా మీరు కూడా మన కులం కానివాన్ని తీసుకుని పెళ్ళి చేయమని ఎలా వస్తారు?'
'అమ్మా మన చెల్లి రమ్మనకుండా వాళ్ళు మాత్రం మనింటికి ఎలా వస్తారు? నువ్వు వాసన్నను అడిగితే ఆయనేం చెప్తాడు? వాసన్నా సారీ మీరేమనుకోవద్దు. మీరూ కరెక్టే. ఎందుకంటే మీరేమో సితాకోకచిలుక దశలో ఉన్నారు. మేమేమో ఇంకా గొంగళిపురుగు దశలోనే ఉన్నాము. కాబట్టి మేము ఆలోచించుకుని చెప్తాము టైం పడుతుంది. మేము వాసన్నకి కాల్ చేసి చెప్తాము. ఇక మీరు వెళ్ళొచ్చు'
************
నవ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి నెల దాటింది. ఆ రోజు నుంచే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. యువన్ తన రోజువారి పనిలో ఉన్నా కూడా తన ద్యాసంతా నవ మీదనే ఉన్నది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టే ఉంది తన స్థితి. కాకపోతే అక్కడ స్టూడెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ నవ యువ లైఫ్. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకెప్పుడూ వారు కలిసే అవకాశమే ఉండదు. నవ కుటుంబాన్ని కాదనుకుని రావడానికి సిద్ధంగా లేదు. యువన్ కూడా ఫ్యామిలి సంగతి పక్కకు పెట్టి నువ్వు వచ్చేరు అని అడగలేదు. బహుషా కన్ను, వేలు రెండు నావే అనే ధర్మ సందేహంతో ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఫోన్ రింగ్ అవుతుంది.
'హలో ఎవరూ'
'యువా నేను నవ'
'అసలేమైపోయావు? నీ ఫోన్‌కు ఒక వెయ్యి సార్లు ఫోన్ చేసుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది.'
'ప్లీజ్ నేను చెప్పేది విను యువా ఫస్ట్. మీరొచ్చి వెళ్ళగానే నా ఫోన్ లాగేసుకున్నారు. నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. అసలు నేను మీతోనే వచ్చేయకుండా తప్పు చేశాను. వాళ్ళిచ్చిన స్వేచ్చను, ఫ్యామిలీని గౌరవించాలని నేను వాళ్ళ గురించి ఆలోచించాను. కానీ వాళ్ళు నా గురించి ఆలోచించలేదు. నేను వాళ్ళను కన్విన్స్ చేయడానికే అలా చెప్పి ఉంటానని నువ్వు అర్ధం చేసుకోగలవనే ఆ రోజు అలా చెప్పాను. కానీ వాళ్ళు కన్విన్స్ అవలేదు. మన కులం కానివాడిని ఎలా చేసుకుంటావే? వాళ్ళను మన ఇంటికి పిలిపించి మన పరువు బజారులో వేద్దామనుకున్నావా? ఎవరికైనా తెలిస్తే మేము మొఖం ఎలా ఎత్తుకొని తిరగగలం? అని ఎన్ని మాటలన్నారో!
మీరిచ్చిన జీవితం, చదువును గౌరవించి మీరొప్పుకుంటేనే యువన్ ను చేసుకుంటా అని అప్పుడు అన్నాను. కానీ ఇప్పుడు వెళ్ళిపోతానని తెగేసి చెప్పాను. కానీ అప్పుడే మా అమ్మ ఉరేసుకున్నది. ఆ టైంకు మా అన్నయ్య చూసి వెంటనే దించాడు. లేకపోతే తను చనిపొయేదే. అప్పటిదాక నాకు సపోర్ట్ చేసిన అక్క, వదిన కూడా వెళ్ళొద్దన్నారు. మమ్మల్ని కాదని వెళితే నీ వలన ఇంటి నిండా శవాలే ఉంటాయి. చూసావు కదా అని ఇంట్లో అందరూ తిట్టారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. నన్ను నేనే ఊబిలో తోసేసుకున్నట్టు అయింది. యమలోకం అంటే ఇట్లనే ఉంటది అనిపించింది. నన్ను బెదిరించి పెళ్ళి చేశారు వారం అయింది. నా వాళ్ళే నా గొంతు కోశారు. నా జీవితాన్ని నాశనం చేశారు యువ. నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఎవ్వరేమైనా పరవాలేదని నిర్ణయించుకుని మా ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాను నేను యువన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాని. వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపు త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో యువ. మై బ్రీతింగ్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ యూ యువ లవ్ యూ. ఒక వేళ నువ్వు రాకపోతే మాత్రం నిన్ను మోసం చేసిన గిల్ట్తో నేను ప్రతిరోజూ చస్తూ బతకాల్సి వస్తది. ప్లీజ్ యువ కమ్ ఫాస్ట్.
- ఎం. విప్లవ కుమార్
9515225658