Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడి కూత మొదలయింది. నిండా కప్పుకున్న దుప్పటి పైనుంచి తీసి చన్నీళ్ళతో మొకం కడుకొని రాత్రి కలలోకి వచ్చిన తనని వెతుక్కుంటూ పొలం వైపు చేల్లల్లో నడుస్తున్నాను. ఎదురుగా ఓ రూపం. అచ్చం కుందనపు బొమ్మే. ఇలాంటి రూపాన్ని రాత్రి కలలో తప్ప ఎప్పుడూ చూసింది లేదు. ఇది మళ్ళీ కలే అయుంటుందని గిల్లుకొని మరీ చూశాను. కల కాదు. నిజం తనే. చేనులో నాకు దారి చూపిస్తూ నడుము వయ్యారంగా చూపిస్తూ వెనకనే రమ్మన్నట్టు ఉంది. నేను సాగుతూ ఉన్నాను. నేనేమో మాసిపోయినటువంటి బట్టలతో ఉన్నాను. తనేమో మంచి పట్టు లంగావోని వేసుకొని ఉంది. నేను నడిచేకొద్ది తను ముందుకు నడుస్తూనే ఉంది. ఆగమని చెప్పాలని ఉంది కానీ చెప్పలేను. ఎందుకంటే తనని కలలో చూశానే తప్ప ఎదురుగా చూడడం మొదటిసారి.
నేను అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది చాలా తక్కువే. కానీ ఈమెను కలలో చూసినప్పటి నుండి ఊపిరిలా అనిపిస్తుంది. ఇంకా ఇంకా ముందు నడుస్తూనే నన్ను రమ్మని పిలిచినట్టే ఉంది. భావాలను మల్లె తీగలా అల్లుకోవాలని ఉంది. లోలో ఏవేవో ఆలోచనలు. తనని చూస్తేనే కవిత్వం ఎప్పుడూ రాయకపోయినా ఇప్పుడే రాయాలనిపిస్తుంది. ముద్దుగా బంతి పువ్వులా తన మొకాన్ని రెండు చేతుల్తో పట్టుకొని చూసుకోవాలని ఉంది. కాని తనకు నాకు మధ్యనున్న ఏడు మీటర్ల దూరాన్ని తరగనివ్వడం లేదు. నేను ఒక్క అడుగు ఎక్కువ ముందుకేస్తే తను కూడా అంతే వేస్తోంది. అంత చిత్రంగా ఉంది. వరి చేను దాటి ముందరే ఉన్న జొన్న చేనులోకి అడుగు వేసింది తను. నేను శబ్దం చేయకుండానే వరిచేను చివరి ఒడ్డుపైన నిలిచున్న. తనూ అంతే. ఏడు మీటర్ల దూరంలో. నేను పాదం లేపాను. తను కూడ. ప్రపంచం అంటే ఇదేనా అన్నట్టు ఉంది నాకు. జొన్న చేనులో నేను కాలు పెట్టగానే నువ్వే ప్రపంచం అన్నట్టు తిరిగి చూసింది తను. ఇంకొంచం లోపలికి మా అడుగులు పడ్డాయి. తను నా వైపు చూస్తూ, నేను తననే చూస్తూ. తన కళ్ళలో సముద్రమంత ప్రేమ ఉంది. తన పెదవుల్లో తడి ఉంది. తనని చూస్తుంటే ప్రేమను దాటిన మొహం ఆవహించింది. తనేమో ఆగడం లేదు. అలాగే నడుస్తూ, నన్ను కవ్విస్తూ వెనక్కి వెనక్కి వెళుతోంది. బహుశ అది జొన్న చేను మధ్య భాగం అనుకుంట. చుట్టూ చూశాను. జొన్నచేను తప్ప ఇంకేది లేదక్కడ.
పైకి చూస్తే ఆకాశం మెల్లగా మబ్బులకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంది. నల్లని మేఘాలు వలస పక్షుల్లా వస్తున్నాయి. మళ్ళీ తన వైపు చూశాను. తను తన నుంచి నా వైపు ఓ అడుగు వేసి ఉన్నది. మనసులో ఏదో సంతోషం. తెలియకుండానే నేనో అడుగు వేశాను. మళ్ళీ తనో అడుగు. నేనో అడుగు. ఇంకో అడుగు. ఇద్దరి దేహాల మధ్య ఒక్కడుగు మిగిలింది. అదీ పడితే రెండు శరీరాలు ఏకం అవుతాయి. ఇంతలో మా పైనుంచి ఓ కాకి కావ్ కావ్ మంటూ వెళ్ళింది. నాలో తెలియని భయం మొదలయింది. తనేమో నిర్భయంగా ఉంది. నేను కాకి వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాను. తనేమో నన్నే చూస్తుంది. ఎంతలా అంటే మేము ఇదివరకే కలిసి దూరమైనంతగా. ఇద్దరి మధ్య దూరం తరిగింది. గుండె వేగం పెరిగింది. నాలో ఏవో తెలియని భయాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. తనని పరిశీలించి చూశాను. తనని ఎక్కడో కలలో కాకుండా మా ఊరిలోనే చూసినట్టు ఉంది. కానీ అదెక్కడో ఊహకు అందడం లేదు. తనేమో ప్రేమని, మరోదాన్ని కలగలిపి చూసినట్టు చూస్తుంది. దానికి కారణం ఉంది. ఇద్దరం వయసులో ఉన్నాం. అందులోను ఏకాంతంగా ఉన్నాం. దేహాలకు దాహం వేసినట్టుంది. తనని ఇంతకుముందు మా ఊరి జమిందారి మేడలో నేను దూరంగా ఉన్న రోడ్డుపై నడుస్తూ చూసింది గుర్తుకు వచ్చింది. నా గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా నాకు తెలియకుండానే నా అడుగు వెనక్కి పడింది. భయపడకు భద్ర అని తను నా కాలర్ పట్టుకొని లాగి ఇద్దరి పెదాలను మల్లె తీగలా అల్లేసింది. కాసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
నా పేరు తనకెలా తెలుసో ఇంకా అర్ధం కాలేదు. కానీ వలలో చిక్కిన చేప పిల్లలా ఉంది నా పరిస్థితి. మా వయసులు వాటి పని అవి కానిస్తున్నాయి. జొన్న చేను మా బరువులకు నలిగిపోతోంది. మా దేహాలపైనుంచి ఒక్కో బట్ట కింద పడుతోంది. చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు, అవసరాన్ని బట్టి దేనికది పెనవేసుకున్నాయి. కొంత సమయం వయస్సులు స్వర్గం అంటే ఏంటో మనసారా అనుభవించాయి. ఇక కింద పది ఉన్న బట్టలు మాపై వేసుకొని పక్కపక్కనే పడుకున్నాము. ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. తన పేరేంటో తెలుసుకోవాలని నా మనసు ఆరాట పడుతోంది. మెల్లగా నా పెదాలు 'నీ పేరేంది' అని అడిగాయి. తను తెలియదా? అన్నట్టు నవ్వింది. నేను చెప్పు అన్నట్టు చూశాను.
తను చెప్పకుండా పక్కనే ఉన్న ఆకును పిండి పసరుతో నా గుండెపై వెన్నెల అని రాసింది. ఇంతలో 'చేను మొత్తం వెతకండిరా' అన్న మాట మా ఇద్దరికి గట్టిగా వినబడింది. ఒక్కసారిగా మా ఇద్దరి గుండెల్లో సునామీ వచ్చినంతగా భయం మొదలైంది. ఇద్దరి దేహాలు నగంగా ఉన్నాయి. ఆ ఒక్క మాటతో ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటున్నాం. వారి అడుగులు మా వైపు వేగంగా వస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. నేను ముందు వేసుకున్నాను. తనవి ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు నా మరణం అని నాకు స్పష్టంగా అర్ధం అయ్యింది. కారణం నేనున్నది మా ఊరి జమిందార్ రఘుపతి రెడ్డి బిడ్డతో. లోలో మరణ భయం ఇంకా రెట్టింపు అయ్యింది. తను బట్టలు వేసుకొని తన చెయ్యి నాకు ఇచ్చింది.
ఇద్దరం జొన్న చేనులో పరుగెడుతున్నాం. అలసట వస్తోంది. చెమటలు ధారలై జారుతున్నాయి. ఎటు పరిగెత్తినా చుట్టూ మనుషులే ఉన్నారు. చేతుల్లో కట్టెలు, కత్తులు ఉన్నాయి. చివరికి అలసిపోయి కూర్చున్నాం. ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం. గంట తర్వాత వెన్నెల ఒక్కతే జొన్నచేనులోంచి బయటకు వచ్చింది. మళ్ళీ కాకులు జొన్నచేనుపైన కావ్ కావ్ మంటూ అరుస్తూ తిరిగాయి.
- కెపి లక్ష్మీనరసింహ, 9010645470