Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒరేయ్! గోపీ! ఏం చేస్తున్నావ్ రా!''
''అబ్బే ఏం లేదు! '' ''అయినా నీకెందుకక్కా!?..
''మేము ఆడుకోవడానికి తూనీగల్నీ, సీతాకోకచిలుకలను పట్టుకుంటున్నాం'' కోపంగా సమాధానం ఇచ్చాడు.
''అరుణ్ రారా ! మనం పట్టుకుందాం. అదిగో! ఆ పూవు మీద వాలిన సీతాకోకచిలుక చాలా బాగుంది.''
''ఇదిగో! ఈ తూనీగ తోక పట్టుకోరా..'' స్నేహితులతో మాట్లాడుతూ, గోలగోలగా అరుస్తూ, వాటి వెంట పరుగులు తీస్తూ, వాటిని పట్టుకుని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిని వేయసాగాడు. గోపితో పాటు స్నేహితులు కూడా అదే విధంగా చేస్తున్నారు.
అవేమో గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటినలా చూస్తుంటే శాంతికి చాలా బాధ కలిగింది. గబగబా లోపలికి వెళ్ళి తాతయ్యను పిలుచుకుని వచ్చింది.
రామయ్య తాతకు మనుమడు చేస్తున్న పని చూసే సరికి చాలా కోపం బాధ కలిగింది. ఎలాగైనా గోపీని మార్చాలి అనుకున్నాడు. కొద్ది సేపు ఆలోచించాడు.
''బంగారూ! నువ్వు వెంటనే సామాన్ల గదిలోకి వెళ్ళు. అక్కడ పెద్ద, పెద్ద పురికొస తాళ్ళు ఉన్నాయి. వాటిని పట్టుకుని గబగబా వచ్చేసెరు'' అని పంపించాడు.
శాంతి పరుగెత్తుకొని వెళ్ళి పురికొస తాళ్ళు తెచ్చి తాతయ్యకు ఇచ్చింది. వాటిని రెండు మూడు కలిపి, గట్టిగా పేని దగ్గర పెట్టుకున్నాడు.
ఈ లోపే పిల్లలంతా ఒక చేతిలో సీతాకోకచిలుకలను నింపిన డబ్బాను, మరో చేత్తోనేమో తూనీగల తోకలకు దారాలు కట్టి పట్టుకున్నారు. అవి బాధతో తోకలకున్న దారాలను విడిపించుకోవడానికి అటూ ఇటూ ప్రయత్నిస్తూ ఎగురుతుంటే పిల్లలేమో చప్పట్లు, కేరింతలు.
తాతయ్య గట్టిగా కేకేసి అందరినీ పిలిచాడు.
తాత ఎప్పుడూ పిల్లలను ప్రేమగా దగ్గరకు పిలిచి పండ్లో, పల్లీలో, నువ్వుండలో ఇస్తూ కథలూ, సామెతలు, పొడుపు కథలు చెబుతుంటాడు. అందుకే ఎప్పటిలా ఏదో ఒకటి ఇస్తాడు, కథలు ఇంకేమైనా చెబుతాడనే ఆశతో, పిల్లలంతా వచ్చి తాత చుట్టూ చేరారు. తాము తెచ్చుకున్న వాటిని పట్టుకుని కూర్చున్నారు
గోపి కూడా ఓ పక్కకు పెట్టుకుని కూచున్నాడు.
తాత శాంతిని పిలిచి ముందు గోపి చేతులను కట్టేయమని చెప్పాడు.
ఆ తర్వాత అందరి చేతులను ఈ తాళ్ళతో కట్టేయమ్మా అనగానే.. ''ఏంటి తాతా! ఏదో పెడతానని పిలిచి మమ్మల్ని కట్టేస్తావా..?'' కోపంగా అడిగారు.
''కొద్దిసేపేరా పిల్లలూ! ఆ తర్వాత మీకు బోలెడు మిఠాయిలు పెడతానుగా'' అని గోపితో సహా వాళ్ళందరి చేతులు కట్టేయించాడు.
కొద్ది సేపటికే ''మాకు నొప్పిగా ఉంది. మా కట్లు విప్పమంటూ'' గోలగోల చేయసాగారు.
''చూశారా! పిల్లలూ! ఐదు నిమిషాలు కూడా కాలేదు. మీకు ఎంత బాధ కలిగిందో.!. మరి ఆ చిన్ని చిన్ని ప్రాణులు ఎంత బాధ పడుతున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా'' అనగానే... ''అవును తాతా! తప్పైపోయిందని.'' తలలు వంచుకున్నారు .
ఈ లోపు శాంతి తూనీగల దారాలను విప్పింది. అయినా ఒకటి రెండు తూనీగలకు దారాలు బిగుసుకుని తోకలు ఊడిపోయి కొట్టుకోసాగాయి. డబ్బాల మూతలు తీసింది. కొన్నింటికి ఊపిరాడక చచ్చిపోయాయి. మరికొన్ని నీరసంతో ఎగరలేక పోతున్నాయి.
తాత చెప్పిన మాటలూ, అవి పడుతున్న అవస్థలు చూశాక పిల్లలకు కూడా చాలా బాధ కలిగింది.
మరెప్పుడూ అలా చేయమని భూతదయ కలిగి ఉంటామని చెప్పారు.
వారిలో మార్పుకు సంతోషపడుతూ పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్లు పంచిపెట్టాడు.
అందరూ బంగారు తల్లి శాంతిలా ఉండాలి తెలిసిందా. శాంతి చెప్పబట్టి చూశాను. ''జీవహింస చేయరాదు. తెలిసింది కదా'' అనగానే ''ఔను తాతా! ఇంకెప్పుడూ అలా చేయం'' అని వెళ్ళిపోయారు.
తలవంచుకుని నిలబడ్డ గోపిని దగ్గరకు తీసుకొన్నాడు తాత.
- వురిమళ్ల సునంద
9441815722