Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృగరాజు సింహం గుహలో దిగాలుగా కూర్చొంది. ఇంతలో మంత్రి ఏనుగు లోనికి ప్రవేశించింది. దాని రాకను సింహం గమనించలేదు. 'మృగరాజా!' అని పిలిచింది. ఆ మాట కూడా సింహానికి వినపడలేదు. ఏనుగు తన స్వరాన్ని పెంచి మళ్లీ పిలిచింది. దాంతో సింహం ఈ లోకంలోకి వచ్చింది. ఏనుగును గమనించి మీరు వచ్చి ఎంత సేపయ్యింది? అని అడిగింది. దానికి ఏనుగు మృగరాజా! నేను ఇప్పుడే వచ్చాను. కానీ మీరు నా రాకను గమనించలేదు. ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది. దానికి సింహం 'రేపు అడవిలో సంచరించే ప్రతి జీవిని సమావేశానికి హాజరుపర్చండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం' అన్నది.
ఏనుగు సింహం ఆదేశాన్ని జంతువులు, పక్షులు ఇతరత్రా జీవులకు చేరవేసింది. సమావేశానికి జంతువులు, పక్షులు హాజర య్యాయి. అడవి జీవులన్నీ సింహం వైపు ఆశ్చర్యంగా చూడసా గాయి. మృగరాజు ఎందుకు పిలిచారు? ఏం మాట్లాడతారు? అని చర్చించుకోసాగాయి. సింహం అడవి జీవులను ఉద్దేశించి 'మీరు మొదట ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. అడవి అంటే పచ్చటి చెట్లతో... జంతు, పక్షుల సంచారంతో కళకళలాడు తుండాలి. దురదృష్టంకొద్దీ కలప దొంగలు చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. అడవి మైదానప్రాంతంగా మారుతుంది. చెట్లు కనుమరుగైతే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఒకప్పుడు వేటకు వచ్చిన వేటగాళ్ల బారి నుంచి చెట్లు మనల్ని కాపాడేవి. బాణం సంధించేలోపు చెట్ల చాటు నుంచి అదృశ్యమై ప్రాణాలు కాపాడుకునే వారం. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రాణాలు కోల్పోతున్నాం' అన్నది. జంతువులు, పక్షులు మృగరాజు చెప్పేది నిజమని గట్టిగా అరిచాయి. సింహం ఇంకా మాట్లాడుతూ అడవి జీవుల సంఖ్య తగ్గటానికి ఒక్క వేటగాళ్లే కారణం కాదు అంటూ ఆపింది. మరెవరు మృగరాజా! అని గట్టిగా ప్రశ్నించాయి జంతువులు, పక్షులు. దానికి సింహం మృగరాజునైన నేనూ ఒక కారణమే అన్నది. జంతువులు, పక్షులు నమ్మలేనట్లు సింహం వైపు ఆశ్చర్యంగా చూశాయి. అవును నేను చెప్పింది .. మీరు విన్నది నిజమే. నాతోపాటు ఇతర క్రూరమృగాలు శాకాహార జంతువులను చంపి తింటున్నాయి. మేము చిన్నచిన్న జీవులను కూడా వదలటం లేదు. సింహం మాటలకు సమావేశానికి హాజరైన జీవులు విస్తుపోయాయి. ఇంతకు ముందు జరిగిన సమావేశాల్లో సింహం ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది. ఆ విషయంలో సింహాన్ని సమర్థించాలో వద్దో ఎవరికీ అర్థం కాలేదు. సింహమే మాట్లాడుతూ మమ్మల్ని వేటగాళ్లు వేటాడితే, మేము అన్నెంపున్నెం ఎరుగని శాకాహార జంతువులను వేటాడుతున్నాం. ఈ విషయంలో వేటగాళ్లకు, క్రూరమృగాలమైన మాకూ తేడా లేదు. మృగరాజుగా రక్షించాల్సిన నేను చిన్న జీవులను చంపి తిన్నాను. వేటగాళ్ల వల్ల మా జాతి అంతరిస్తుంది. మా వల్ల చిన్న జీవుల జాతి అంతరిస్తుంది. భవిష్యత్తులో మన రెండు జాతులతో పాటు పక్షి జాతి కూడా అంతరించే ప్రమాదం ఉంది. అందుకే మీ అందరి సమ్మతితో ఒక నిర్ణయం తీసుకోదలిచాను అన్నది సింహం. జంతువులు, పక్షులు సింహం అలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. సింహం గంభీరంగా లేచి నిలబడి ఈ రోజు నుంచి అడవిలో వేటను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తనతో సహా ఏ పెద్ద జంతువూ చిన్న జంతువులను చంపకూడదని ఆదేశించింది. దానికి శాకాహార జంతువులు, పక్షులు హర్షం వ్యక్తం చేశాయి. మాంసాహార జంతువులు మాత్రం వేటాడకపోతే మా గతేంటని ప్రశ్నించాయి. తాము ఏం తిని బతకాలని సింహాన్ని నిలదీశాయి. పండ్లు, దుంపలు తిని కడుపు నింపుకోవాలని కోరింది. అడవిలో పండ్ల చెట్లను ఎక్కువగా నాటాలని మంత్రి ఏనుగును ఆదేశించింది. మాంసాహార జంతువులు చిన్న జంతువులను చంపటం మానుకుని పండ్లు, దుంపలుతో కడుపు నింపుకోవాలని కోరింది. మొదట్లో కాస్త కష్టమైనా క్రమేపీ అలవాటు అవుతుందని చెప్పింది. పండ్లు, దుంపలు తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని సలహా ఇచ్చింది. సింహం పక్షులతో పండ్లు తెప్పించింది. వాటిని మొదట తనే తిని పండ్ల రుచిని మిగతా జంతువులకు వివరించింది. పులి, ఎలుగుబంటి వంటి మాంసాహార జంతువులు కూడా పండ్ల రుచి చూశాయి. ఇంతలో కుందేలు భూమిలో దొరికే దుంపలను సేకరించి సింహం ముందుంచింది. సింహం, పులి, ఎలుగుబంటి దుంపలు తిని ఆనందం వ్యక్తం చేశాయి. ఇంతలో ఎలుగుబంటి చెట్టు పైకి ఎక్కి తేనెను సేకరించి తెచ్చింది. సింహం, పులి తేనెను జుర్రుకుని తాగాయి. అనంతరం సింహం మాట్లాడుతూ తోటి జంతువును చంపి తినటంకన్నా ప్రకతి ప్రసాదించిన పండ్లు, దుంపలు, తేనె మంచి రుచిని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని స్వానుభవంతో తెలుసుకున్నానంది. పులి కూడా సింహం మాటలను సమర్థిస్తూ తలూపింది. ఇంతకాలం ప్రదృతి అందించిన ఫలాలను వదిలి వేటపై దృష్టి పెట్టినందుకు సిగ్గు పడింది. అడవిలో రక్తం చిందకుండా పండ్లు, దుంపలనే ఆహారంగా తీసుకుంటామని పులి హామీ ఇచ్చింది. పులి మాటలకు సింహం హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి జంతువూ అడవిలో పండ్ల మొక్కలు నాటటంలో భాగస్వాములు కావాలని కోరింది. సింహం, పులి మాటలకు శాకాహార జంతువులు ఆనందంతో గంతులు వేశాయి.
- తమ్మవరపు వెంకటసాయి సుచిత్ర
9492309100