Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు నాలుగు గోడలు దాటి అడుగు బయట పెట్టడమే తప్పుగా భావించే రోజులవి. ఏన్నో కట్టుబాట్లు, ఆంక్షల మధ్య వారి జీవితాలు గడిచిపోతుండేవి. అటువంటి రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. అంతేకాదు ఒక సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆమే చెన్నై, హైద్రాబాద్ నగరాల్లో ఆంధ్ర మహిళా సభలను స్థాపించిన దుర్గాబాయి దేశముఖ్. ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తిదాయక జీవితాన్ని ఒకసారి మననం చేసుకుందాం...
దుర్గా బాయి 15, జులై 1909 రాజమండ్రి లోని రామారావు, కృష్ణవేణి దంపతులకు జన్మించారు. వీరిది మధ్య తరగతి కుటుంబం. 8 ఏండ్ల వయసులో ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహం జరిగింది. అయితే కొంత ఊహ తెలిసాక చదువు పై దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకిచించారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఇష్టానికి మద్దతు పలికారు. ఇక అప్పటి నుండి దుర్గాబారు చదువుపై దృష్టి పెట్టి బెనారస్ విశ్వ విద్యాలయం నుండి మెట్రిక్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మె పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. 1942లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకుని మద్రాసు హై కోర్ట్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
12 ఏండ్ల వయసులోనే...
దుర్గాబాయి చిన్నతనం నుండే స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. తన 12 ఏండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించారు. రాజమండ్రిలో బాలికలకు హిందీ విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. తెలుగు గడ్డపై మహాత్మాగాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏండ్ల వయసులో విరాళాలు సేకరించి ఆయనకు అందచేశారు. అంతేకాదు ఆంధ్ర పర్యటనలలో గాంధీజీ హిందీ ఉపన్యాసాలు తెలుగులోకి అనువదించారు. దుర్గాబారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనప్పుడు మహిళ అని కూడా లేకుండా బ్రిటిష్ ముష్కరులు విచక్షణా రహితంగా లాఠీ చార్జీ చేసారు. ఆ సమయంలో రెండు చేతులకు గాయాలై రక్తం కారుతున్నా తన పిడికిలిలో చిక్కుకున్న గుప్పెడు ఉప్పును మాత్రం నేల జారనియ్యని చైతన్యవంతురాలు.
దేశముఖ్‌తో పరిచయం...
1937లో చెన్నైలో ఆమె ఆంధ్ర మహిళా సభను ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలు తానే స్వయంగా చూశారు. అంతేనా దుర్గాబారు భారత దేశ రాజ్యాంగ సభ, ప్రణాళిక సంఘం సభ్యురాలు. భారత రాజ్యాంగ నిర్మాణసభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేశారు. తర్వాత 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేశారు. ఆ సమయంలో దేశముఖ్‌తో ఏర్పడిన పరిచయం వారి వివాహానికి దారి తీసింది. అప్పటి నుండి దుర్గాబారు దేశముఖ్‌గా ఆవిడ ప్రాచుర్యం పొందారు.
స్టోన్ దట్ స్పీక్
దుర్గాబాయి తన అనుభవాలతో 'స్టోన్ దట్ స్పీక్' పేరిట ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆమె కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో రాస్తూ ''ఒక సంకల్ప శక్తి కలిగిన వ్యక్తి, కాలం విలువను అర్థం చేసుకో గలిగిన వ్యక్తి, ప్రణాళిక బద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తి, ఏ కార్యాన్ని సాధించాలనుకున్నాడో, దానికి అనుస రించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని లోభ కారకాలనూ, మోహ కారకా లనూ జయించి నిలబడగలిగిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు సంపా దించి తీసుకురాగలడేమో కానీ కోట్లాది రూపాయలు మాత్రం అటువంటి వ్యక్తిని తయారు చేసి తీసుకురాలేవు. అటువంటి వ్యక్తులు దేశ చరిత్రను తిరగ రాస్తారు' అని అన్నారు. ఎంతో అద్భుతమైన వాక్యాలు ఇవి. ఈ ప్రతి పదంలోను, వాక్యంలోను ఎంతో అర్ధం ఉంది.
స్ఫూర్తిదాయక జీవితం
మహిళా సంక్షేమం, సాధికారత కోసం విశిష్ట సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలను గుర్తించేందుకు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆమె పేరు మీద వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. అక్షరాస్యత రంగంలో విశేష కృషి చేసినందుకు యునెస్కో అవార్డు కూడా ఆమెకు లభించింది. దుర్గాబాయి అందరికీ స్ఫూర్తి. ఒక రచయిత్రిగా, స్వతంత్ర సమర యోధురాలిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు, వివక్షలు ఆమెను భారత ఉక్కుమనిషిగా నిలబెట్టాయి. బ్రిటిషు వారికి ఆడ సింహంగా, ధీరవనితగా పేరు గడించారు. అందరినోటా కీర్తించ బడ్డ దుర్గాబారు 1981 మే 9న తుది శ్వాస విడిచారు. ఓ తెలుగింటి ఆడబడుచు తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ రోజున ఆమెను స్మరించుకుంటూ, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ
మహిళా విద్య కోసం...
1953 ఆగస్టులో భారత ప్రభుత్వం నెలకొల్పిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీజ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలుగా పనిచేశారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతి గృహ ఏర్పాటుకై పాటుపడ్డారు. రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలు, నర్సింగ్ హోములు, వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పారు. 1971లో నెహ్రూ లిటరసీ అవార్డు వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 1975లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ అవార్డును ఇచ్చి సత్కరించింది.
- పాలపర్తి సంధ్యారాణి