Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన సంతోషంలో అమ్మ, భయంలో అమ్మ, దుఃఖంలో అమ్మ. ఇలా ప్రతి నిమిషం, ప్రతి తలంపులో అమ్మే. అమ్మ ప్రేమని కొలవటానికి కొలమానం ఉండదు. అది నిరంతర అద్భుతం. అమ్మ లేక సృష్టి లేదు. అందుకే అమ్మ స్థానం అంత గొప్పది. బిడ్డ అన్నం తినడానికి మారం చేస్తే లాలించి తినిపించేది అమ్మ. ఎంత కష్టాన్నైనా తనలో దాచి చిరునవ్వుతో పలకరిస్తుంది. బిడ్డలు తనని కాదన్న తను మాత్రం పిల్లల కోసమే తపిస్తుంది. అటువంటి అమ్మను గౌరవించుకోవడానికి ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొందరు బిడ్డలు అమ్మతో ఉన్న తమ అనుబంధాన్ని మానవితో ఇలా పంచుకున్నారు.
అమ్మ కవితకు అందని పదం.. అమ్మ వర్ణించుటకు సరిపోని సోయగం..
అమ్మ మరిచిపోలేని బంధం.. అమ్మ అనే పిలుపు నిరంతర ప్రతిధ్వని..
అమ్మ - నిజం, అమ్మ - నిజం..
- పాలపర్తి సంధ్యారాణి
అమ్మలా ఉండాలని...
మా అమ్మ డా.బి.విజయ లక్ష్మి, నాన్న డి. సురేష్. మా సొంతూరు వరంగల్. అమ్మ ఆయుష్ విభాగంలో ముప్పై అయిదేండ్లు ఉద్యోగం చేస్తూ అడిషనల్ డెరైక్టర్ హోదాలా గత నాలుగేండ్ల కిందట పదవీ విరమణ పొందారు. అమ్మతో నా అనుబంధం గురించి చెప్పాలంటే నా జీవితం మొత్తం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నా జీవితంలోని ప్రతి అంశం అమ్మ సహకారంతోనే గడుస్తుంది. నా చదువు, వృత్తి, వ్యాపకం, వివాహం, పిల్లలు ప్రతి దాంట్లో నాకు పూర్తిగా తోడు ఉంది. అమ్మని చూసి తనలా ఒక వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకోవాలి తపన పడ్డాను. అందుకే వైద్య విద్యని అభ్యసించాను. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అవసరమైన వారికి ఉపయోగ పడుతున్నాను. వైద్య విద్యా బోధకురాలిగా స్థిర పడ్డాను.
అమ్మకు సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. చిన్న తనం నుండి నేను ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ అమ్మ నుండి నేర్చుకున్న బాషా పరిజ్ఞానంతో తెలుగు భాషను నా బలంగా చేసుకొని ఎన్నో హెల్త్ ఆర్టికల్స్ కథలు, కవితలు రాయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఓ మహిళగా తోటి మనుషులకు ప్రేరణాత్మకంగా ఉన్నానంటే అది అమ్మ పెంపకం వల్లనే. నా పక్కనుండి నన్ను నడిపించిన శక్తి మా అమ్మ అని గర్వంగా చెప్పగలను.
- డా.ప్రతిభా లక్ష్మి
బాధలన్నీ తనే దిగమింగింది
అమ్మ..! మా అమ్మ త్యాగానికి మారు పేరు. నిరుపేద కుటుంబంలో పుట్టి సంపన్నుల కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది. అప్పుడు అమ్మ ఎంతో పొంగిపోయిందట. తన ఓర్పుతో ఎంతటి కష్టాన్నైనా దిగమింగేది. మెట్టినింట ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కష్ట సమయంలో కూడా మాకు తన ప్రేమలో లోటు లేకుండా చూసుకునేది. మేము చిన్న తరగతులు చదువుకునేటప్పుడు సంసారం భారంగా అనిపించి తను కూడా నర్స్ ట్రైనింగ్ చేసింది. చిన్న ఉద్యోగం సంపాదించి మాకు ఏ కష్టం తెలియకుండా చూసుకుంది.
అన్నం కూర మాకు పెట్టి తను మజ్జిగ లేదా పచ్చడి తినేది. సన్నబియ్యం మాకు వంటి పెట్టి తను దొడ్డు బియ్యం తినేది. ఎన్ని కష్టాలు అనుభవించినా బాధంతా తన కడుపులోనే పెట్టుకునేది. మమ్మల్ని పల్లెత్తు మాట కూడా అనదు. మమ్మల్ని మంచి లక్షణాలతో పెంచింది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి మహిళా పడే బాధలు అమ్మ అనుభవించింది. ఆ కష్టంలో ఆనందాన్ని వెదికి దాన్ని మాత్రమే మాకు పంచేది.
- ప్రతిభ, బిజినెస్ ఉమెన్
అమ్మే నా ధైర్యం
అమ్మ లలిత, నాన్న నాగేశ్వర్ రావు. వాళ్ళకు నేను ఒక్క దాన్నే. మా స్వగ్రామం విజయవాడ అయినప్పటికీ పెరిగింది, చదివింది హైదరాబాద్‌లోనే. బి.ఏ. సోషయాలజీ చదివాను. 10వ తరగతిలో ఉండగా అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ పాత్రకి నేను చాలా చిన్న దానిగా ఉన్నానని అన్నారు. అప్పుడే ఉషా కిరణ్ బ్యానర్లో ఈటీవీ వారి షార్ట్ ఫిల్మ్ 'రంగుల కల'లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుండి 11 ఏండ్ల పాటు ఈటీవీలో చేసాను.
నేను నటిగా ఎదగడానికి అమ్మ ప్రోత్సహమే ఎక్కువ. ఎందుకంటే అమ్మకు నటన అంటే ఇష్టం. మా తాత (అమ్మ నాన్నగారు) సత్యనారాయణ డ్రామా ఆర్టిస్ట్. నేను నటించటం ప్రారంభినప్పటి నుంచి అమ్మే అన్ని దగ్గరుండి చూసుకునే వారు. ఉదయాన్నే లేచి వంట చేసి బాక్స్ పెట్టి నాతో పాటు షూటింగ్ స్పాట్‌కి వచ్చేవారు. రాత్రి ఎంత సేపు అయిన నాతోనే ఉండేవారు. నా కాస్ట్యూమ్స్ కూడా అమ్మే డిజైన్ చేసేవారు. నేను స్క్రీన్‌పై కనిపించేటప్పుడు సాంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యం ఇస్తాను. అలా అని మోడరన్ దుస్తులు వేయను అని కాదు. నా వృత్తి రీత్యా ఉన్న ఒత్తిళ్ల కారణంగా బాగా కోపం వస్తూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఈ విషయంలో మాత్రం నన్ను హెచ్చరిస్తూ ఉంటారు. 'కోపం మంచిది కాదు. ఒక మాట అని బాధ పడటం కన్నా, నీ కోపాన్ని నియత్రించుకోవడం మంచిది. ఎంత మంచి పేరు సంపాదించుకున్నా, నువ్వు కోపంతో అనే ఆ ఒక్క మాటతో మనుషులు దూరం అవుతారు' అని చెప్తూ ఉంటారు.
అమ్మ మంచి విమర్శకురాలు కూడా. నా నటన ఎలా ఉంది, మేకప్ ఎలా ఉంది, కొన్ని సన్నివేశాల్లో ఇలా కాకుండా అలా నటిస్తే బాగుండేది... ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు. రోజులు బాగా లేవని అమ్మ నన్ను ఫ్రెండ్స్‌తో సినిమాలకు, షాపింగ్‌లకు కూడా పంపేవారు కాదు. ఎక్కడికి వెళ్లాలన్న తానే వచ్చేవారు. అంత కేర్ తీసుకునే వారు. అమ్మ చేతి వంట ఏదైనా సరే అమృతం. నాకు అమ్మ చేసే ఆవకాయ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు నేను అమ్మను అయ్యాక అమ్మకు ఇంకా దగ్గర అయ్యాను. అమ్మ మీద ఇంకా గౌరవం, ప్రేమ పెరిగింది. అమ్మ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. 'ఖాళీగా ఉండొద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎవ్వరి మీద ఆధారపడి ఉండొద్దు' అంటూ ఉంటారు. అమ్మ ఒక ధైర్యం. అమ్మ చేసే ప్రతి పనీ నా ఆనందం కోసమే. నా ఆనందంలో తన ఆనందం చూసుకుంటుంది. నా రేపటి భవిష్యత్యుకై నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ. అమ్మ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. నీ పాదాలను తాకి నమస్కరించడం తప్ప..
- పల్లవి, టీవీ నటి