Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మంపై టానింగ్ అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య... ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎండలో తిరిగే వారు ఈ సమస్యకు ఎక్కువ గురవుతుంటారు. అందులోనూ సున్నిత చర్మం కలిగిన వారు మరీ ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటుంటారు. సన్‌స్క్రీన్ చర్మాన్ని కొంతవరకు రక్షించిననప్పటికీ ఎక్కువ ప్రభావవంతంగా మాత్రం పని చేయదు. ఫలితంగా చర్మం కాంతి హీనమవుతుంటుంది. అందువల్ల చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వంటింటి చిట్కాలతో చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవడంతో పాటు వేడి నుంచి రక్షణ పొందవచ్చు. అవేంటంటే..
బాదం పిండి : బాదం పిండి బాత్ పౌడర్లలో మొదటిది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ పిండితో కలబంద రసాన్ని కలిపి స్నానం చేయడం చర్మంపై టాన్ పోతుంది. ఎక్కువ కాంతివంతంగా కూడా ఉంటుంది. సన్‌టాన్ నివా రణకే కాదు, సాధారణం గా రోజువారీ ఉపయో గించినా మంచి ఫలి తాలు పొందవచ్చు.
దోసకాయ : ఇంట్లో ఉండే కూరగాయ లలో దోసకాయ ఒకటి. శరీరానికి నీటిని అందించే కూరగాయ కూడానూ. ఇందులో విటమిన్ ఎ, బి1 ఉండటం వల్ల దోస కాయ శరీరం లోపలేకాదు, బయట కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. వారానికి మూడు సార్లు దోసకాయను ముఖం, మెడ భాగాలలోనే కాదు, కాలి భాగాల్లో రుద్దినా ప్రభావం కనిపిస్తుంది.
టమోటా : టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు వేసవిలో బయట తిరిగి వచ్చినప్పుడు, టమోటా గుజ్జులో చక్కెర కలుపుకుని ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు, పొడి చర్మం రెండింటికీ చక్కగా పనిచేస్తుంది. పొడి చర్మం ఉన్న వారు ఇందులో ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెతో కలిపి ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఇందులో గంధపు చెక్కను ఉపయోగించినా చర్మం కాంతివంతమవుతుంది.
పెరుగు : పెరుగు ఎల్లప్పుడూ చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. ఎండ నుంచి వచ్చిన తర్వాత పులియబెట్టిన పెరుగును కొంచెం పసుపుతో కలిపి ముఖం, మెడ, చేతి భాగాలలో మర్దనా చేసి అరగంట తర్వాత కడిగేయవచ్చు. ఇలా చేస్తే ఆయా భాగాల్లో టాన్ తొలగిపోయి, ప్రకాశవంతంగా ఉంటాయి.
బొప్పాయి : బొప్పాయితో తయారు చేసిన మాస్క్ శరీరంలోని అన్ని భాగాలకూ ఉపయుక్తంగా ఉంటుంది. బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్ చేసి గుజ్జుగా చేసి, తేనెతో కలిపి ముఖం, మెడ భాగాలలో ప్యాక్‌లా అప్లై చేసి ఓ 20 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. వేడి వల్ల ఏర్పడే మొటిమలు రాకుండా చేస్తుంది.
నారింజ, నిమ్మ : చర్మానికి అవసరమైన సి విటమిన్‌ను నారింజ, నిమ్మ భర్తీ చేస్తాయి. పెరుగు పులియబెట్టి నారింజ రసం కలిపి చర్మంపై అప్లై చేయాలి ఇది సన్ టాన్ తో పాటు పొడి చర్మాన్ని నివారిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మరసం తరచుగా చాలా మంది ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.