Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెరుపువేగం, ఫార్ములా రేసు కార్లు, రేసింగ్ ట్రాక్.. అంతర్జాతీయ ఫార్ములా రేసు అనుభూతి హైదరాబాద్‌లోనే పొందే అరుదైన అవకాశం దక్కిందని సంబరపడిన రేసింగ్ అభిమానులకు.. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్సర్క్యూట్ పోటీలు అత్యంత నిరాశ మిగిల్చాయి. రెండు అంచెల్లో నాలుగు రోజుల పోటీల్లో ముగింపు మాత్రమే అభిమానులకు ఊరట కలిగించింది. ఐఆర్ఎల్ పోటీల నిర్వహణలో లోపాలను సవరించుకుంటేనే ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యం ఇవ్వగలం!.
- నిరాశే మిగిల్చిన ఐఆర్ఎల్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్
ఫార్ములా రేసు అనగానే తెలంగాణతో పాటు భారతీయ అభిమానులకు టెలివిజన్ మాత్రమే గుర్తుకొస్తది. అటువంటిది, హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో ఫార్ములా రేసుతో రేసింగ్ అభిమానులు కేరింతలు కొట్టారు. కానీ ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నిర్వాహకులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అభిమానుల ఆశలను నీరుగార్చింది. నవంబర్ 19, 20న ఐఆర్ఎల్ స్ట్రీట్సర్క్యూట్ పోటీలు పూర్తిగా విఫలమవగా.. డిసెంబర్ 10, 11న మిశ్రమ స్పందన వచ్చింది. తొలి రోజు పోటీలు జరుగలేదు, కానీ ముగింపు రోజు స్ప్రింట్, ఫీచర్ రేసులతో కార్లు దూసుకెళ్లాయి. ఐఆర్ఎల్ దేశవాళీ రేసింగ్ పోటీలు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరుగనున్న ఫార్ములా-ఈ అంతర్జాతీయ ఈవెంట్. ఎఫ్ఐఏ (అంతర్జాతీయ ఆటోమైబైల్ సమాఖ్య) నేరుగా ఫార్ములా-ఈ పోటీలను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా జరిగే ఫార్ములా-ఈ పోటీల్లో ఎటువంటి నిర్వహణ లోపాలు ఉండకూడదు. ఐఆర్ఎల్ తొలి అంచె పోటీలు రద్దు, రెండో అంచె పోటీల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఫెడరేషన్ ఆఫ్ మోటర్‌స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ) పలు సూచనలు చేసింది. ఫిబ్రవరి 11న ఫార్ములా- ఈ రేసుకు హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్ ట్రాక్‌లో పలు మార్పులు చేస్తేనే ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళ్లగలవు. ఐఆర్ఎల్ పోటీలు వైఫల్యానికి, ఫార్ములా-ఈ రేసు ముంగిట మెరుగుపర్చుకోవాల్సిన నాలుగు అంశాలను ఓ సారి చూద్దాం.
ఉపరితలం
స్ట్రీట్సర్క్యూట్ ట్రాక్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేసింది. ట్రాక్ ఉపరితలం నాణ్యత లోపించింది. ట్రాక్‌పై ఎక్కువగా తేమ ఉండిపోయింది. 2.8 కిలోమీటర్ల రేసు ట్రాక్‌లో పలు చోట్ల నాణ్యత లోపాలు సైతం కనిపించినట్టు తెలుస్తోంది. ట్రాక్ ఉపరితలం మెరుగుపర్చటం అత్యంత ప్రధానం.
గట్టు కోణం
సాధారణ రహదారుల నుంచి రైల్వే ట్రాక్‌ల వరకు సాధారణంగా పాటించే సిద్ధాంతం గట్టు కోణం (యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్). హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ గట్టు కోణం సూత్రం ఏమాత్రం పాటించలేదని తెలుస్తోంది. స్రీట్సర్క్యూట్ ట్రాక్‌లో ఎక్కువగా మలుపులు ఉన్నాయి. మలుపులు ఉన్న చోట కారుకు కుడివైపు రోడ్డు ఉపరితలం కంటే ఎడమ వైపు రోడ్డు ఉపరితలం ఎక్కువగా ఉండాలి. అప్పుడే వేగంగా దూసుకెళ్లే కారు పక్కకు జారిపోకుండా (స్కిడ్) ఉంటుంది. లేదంటే, కారు సమతూకం కోల్పోయి నియంత్రణలో ఉండదు. అందుకే డిసెంబర్ 10, 11 పోటీల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేసు ట్రాక్ మలుపుల వద్ద టైర్లను ఉంచారు. ఫార్ములా-ఈ రేసు ముంగిట ట్రాక్‌లో గట్టు కోణం అనుగుణంగా మార్పులు కచ్చితంగా చేయాలి.
నాణ్యత లేని తారు
రూ.100 కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్‌కు ఉపయోగించిన తారు నాణ్యత ప్రమాణాలను అందుకోలేదు. ఈ మేరకు ఎఫ్ఎంఎస్సీఐ అధికారులు నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నివేదించినట్టు సమాచారం. ఫార్ములా-ఈ రేసు కోసం నాణ్యమైన తారును ఉపయోగించి ట్రాక్‌ను మళ్లీ వేయాల్సి ఉంటుంది.
ప్రేక్షకులకు మెరుగైన ఏర్పాట్లు
ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) పోటీల నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఐమాక్స్‌కు ముందు ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అభిమానులకు పార్కింగ్ సదుపాయం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో ఇచ్చారు. డబుల్ బ్యారీగేడింగ్ లేకుండా ట్రాక్ పక్కనే ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రేసులో దూసుకెళ్లే కార్లను వీక్షించేందుకు గ్యాలరీలు ఏమాత్రం అనుకూలంగా లేవు. అభిమానుల ఆదరణ తోనే ఫార్ములా-ఈ హైదరాబాద్‌లో కొనసాగగలదు. రేసు ప్రత్యక్షంగా వీక్షించే అభిమానులకు మెరుగైన ఏర్పాట్లు, సదుపాయాలకు ఎఫ్ఐఏ పెద్ద పీట వేస్తుంది. ఫార్ములా-ఈ రేసుకు అభిమానుల గ్యాలరీలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.
ఎఫ్ఐఏ ప్రతినిధి పరిశీలన!
2023 ఫిబ్రవరి 11న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ రేసుకు సన్నాహాక ఈవెంట్‌కు ఐఆర్ఎల్ పోటీలను పరిగణించారు. ఈ నేపథ్యంలో ఫార్ములా-ఈ రేసు పోటీలకు తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌ను పరిశీలించేందుకు అంతర్జాతీయ ఆటోమోబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) ప్రతినిధి డిసెంబర్ 10, 11న ఐఆర్ఎల్ పోటీలకు హాజరయ్యారు. ముగింపు రోజు పోటీలను వీక్షించిన ఎఫ్ఐఏ ప్రతినిధి ఇక్కడ పరిశీలించిన అంశాలతో ఎఫ్ఐఏకు నివేదిక అందించనున్నాడు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు హైదరాబాద్ స్ట్రీట్సర్క్యూట్కు ఎఫ్ఐఏ నుంచి గుర్తింపు రావాల్సి ఉంది. ప్రపంచ శ్రేణి ప్రమాణాల ప్రకారం గ్రేడ్-2 ట్రాక్ గుర్తింపు లభిస్తే ఫార్ములా-ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు దూసుకెళ్లగలవు.