Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47 బంతుల్లో 98 నాటౌట్
- కోల్‌కతపై రాజస్థాన్ గెలుపు
నవతెలంగాణ-కోల్‌కత
యశస్వి జైస్వాల్ (98 నాటౌట్, 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ కొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదిన జైస్వాల్.. అదే జోరులో 13 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఓవరాల్‌గా యువరాజ్ సింగ్ (12) తర్వాత వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 150 పరుగుల ఛేదనలో జోశ్ బట్లర్ (0) రనౌట్‌గా నిష్క్రమించినా.. కెప్టెన్ సంజు శాంసన్ (48 నాటౌట్, 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో కలిసి రాజస్థాన్ రాయల్స్‌కు 13.1 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు జైస్వాల్. కోల్‌కతపై గెలుపుతో సీజన్లో ఆరో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఏడో ఓటమితో కోల్‌కత నైట్‌రైడర్స్ ఏడో స్థానానికి పడిపోయింది. యశస్వి జైస్వాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలుత యుజ్వెంద్ర చాహల్ (4/25) మాయతో కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులే చేసింది. వెంకటేశ్ అయ్యర్ (57, 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు.
కోల్‌కత ఓపెనర్లు జేసన్ రారు (10), రెహ్మనుల్లా గుర్బాజ్ (18)లను పేసర్ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లను డగౌట్‌కు చేర్చిన బౌల్ట్ రాయల్స్‌కు బ్రేక్ సాధించాడు. కెప్టెన్ నితీశ్ రానా, వెంకటేశ్ అయ్యర్లు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా 10 ఓవర్లలో కోల్‌కత నైట్‌రైడర్స్ 76/2తో మెరుగ్గానే కనిపించింది. కానీ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు నితీశ్ రానా (22), వెంకటేశ్ అయ్యర్ (57), రింకూ సింగ్ (16), శార్దుల్ ఠాకూర్ (1)లను అవుట్ చేశాడు.దీంతో కోల్‌కత 149 పరుగులకే పరిమితమైంది.
చాహల్ రికార్డు : ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా యుజ్వెంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. కోల్కతతో మ్యాచ్‌లో నితీశ్ రానా వికెట్‌తో డ్వేన్ బ్రావో (183) రికార్డును చాహల్ అధిగమించాడు. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కూల్చిన చాహల్ ఓవరాల్‌గా 187 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.