Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ ఛేదనలో పంజాబ్‌పై గెలుపు
- రాణించిన నితీశ్ రానా, రసెల్
నవతెలంగాణ-కోల్‌కత
ప్లే ఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన 180 పరుగుల ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. ఈ విజయంతో నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకింది. కెప్టెన్ నితీశ్ రానా (51, 38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అండ్రీ రసెల్ (42, 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)) సహా ఓపెనర్ జేసన్ రారు (38, 24 బంతుల్లో 8 ఫోర్లు), రింకూ సింగ్ (21 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ (57, 47 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీకి తోడు షారుక్ ఖాన్ (21 నాటౌట్, 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బరార్ (17 నాటౌట్, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ దంచికొట్టడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ధావన్ ఒక్కడే
టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ ఈడెన్‌గార్డెన్స్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో పంజాబ్ కింగ్స్ రన్‌రేట్ నిలుపుకున్నా.. వికెట్లు కాపాడుకోలేదు. హర్షిత్ రానా దెబ్బకు ప్రభుసిమ్రన్ సింగ్ (12), భానుక రాజపక్స (0) డగౌట్‌కు చేరగా.. లియాం లివింగ్‌స్టోన్ (15) కథ వరుణ్ చక్రవర్తి ముగించాడు. ఆరు ఓవర్ల అనంతరం 58/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న పంజాబ్ కింగ్స్‌ను కెప్టెన్ శిఖర్ ధావన్ ఆదుకున్నాడు. జితేశ్ శర్మ (21, 18 బంతుల్లో 2 సిక్స్‌లు)తో కలిసి నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన ధావన్.. తొమ్మిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. చివర్లో రిషి ధావన్ (19, 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (21 నాటౌట్), హర్‌ప్రీత్ బరార్ (17 నాటౌట్) ధనాధన్‌తో పంజాబ్ కింగ్స్ మంచి స్కోరు సాధించింది. చివరి 12 బంతుల్లో షారుక్, హర్‌ప్రీత్ ఏకంగా 36 పరుగులు పిండుకున్నారు. స్పిన్నర్లు 13 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులే ఇవ్వగా..పేసర్లు ఏడు ఓవర్లలోనే 87 పరుగులు సమర్పించుకున్నారు.