Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థ్రిల్లర్‌లో లక్నో సూపర్ విక్టరీ
- కిషన్, డెవిడ్ పోరాటం వృథా
నవతెలంగాణ-లక్నో : ముంబయి ఇండియన్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ మెరుపు విజయం సాధించింది. 178 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ను 172 పరుగులకే పరిమితం చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్ పాయింట్ల పట్టికలో టాప్-3లోకి చేరుకుంది. ఛేదనలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (59, 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37, 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ (7), నేహల్ వధేరా (16), విష్ణు వినోద్ (2) వైఫల్యంతో ముంబయిపై ఒత్తిడి పడింది. టిమ్ డెవిడ్ (32 నాటౌట్, 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిసినా.. ప్రయోజనం దక్కలేదు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరమైన దశలో 19వ ఓవర్లో 19 పరుగులు పిండుకున్న ముంబయి.. చివరి ఆరు బంతులకు 11 పరుగులు చేయటంలో విఫలమైంది. లక్నో పేసర్ మోషిన్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ మార్కస్ స్టోయినిస్ (89 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్ కృనాల్ పాండ్య (49 రిటైర్డ్ హర్ట్, 42 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించటంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది.
కృనాల్, స్టోయినిస్ అదుర్స్ : లక్నో ఓపెనర్లు దీపక్ హుడా (5), డికాక్ (16) శుభారంభం ఇవ్వటంలో విఫలమయ్యారు. ప్రేరక్ మన్కడ్ (0) సున్నా పరుగులకే నిష్క్రమించాడు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నోకష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో కెప్టెన్ కృనాల్ పాండ్య (49), మార్కస్ స్టోయినిస్ (89 నాటౌట్) ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. కృనాల్ పాండ్య పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా ఆడాడు. ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 42 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో మార్కస్ స్టోయినిస్ ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కృనాల్ పాండ్య రిటైర్డ్ హార్ట్‌గా నిష్క్రమించినా.. మార్కస్ స్టోయినిస్ ధనాధన్‌కు బ్రేక్ పడలేదు. చివరి మూడు ఓవర్లలో శివమెత్తిన స్టోయినిస్ ఏకంగా 54 పరుగులు పిండుకున్నాడు. 18వ ఓవర్లో జోర్డాన్‌పై రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదిన స్టోయినిస్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో వరుసగా 15 పరుగుల చొప్పున కొట్టాడు.