Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమారు ఐదు మాసాల విరామం అనంతరం భారత్ ఐదు రోజుల ఆటకు సిద్ధమవుతోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధం చేసుకుంది. డబ్ల్యూటీసీ2 ఫైనల్ రేసులో నిలిచేందుకు భారత్ రెండు టెస్టుల్లో గెలిచి తీరాలి. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు నేటి నుంచి.
- భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు
- ఉదయం 9 నుంచి సోనీలో..
నవతెలంగాణ-చిట్టగాంగ్
గెలుపే లక్ష్యంగా..!
డబ్ల్యూటీసీ2 ఫైనల్ రేసులో నిలిచేందుకు భారత్ రెండు టెస్టుల్లోనూ నెగ్గాల్సిందే. ప్రస్తుతం 12 టెస్టుల్లో 75 పాయింట్లు, 52.08 గెలుపు శాతంతో భారత్ నాల్గో స్థానంలో ఉంది. బంగ్లాతో రెండు, ఆసీస్‌పై నాలుగు టెస్టులు నెగ్గితే గెలుపు శాతం 68.06 శాతం, ఐదు టెస్టుల్లో నెగ్గితే 62.5 శాతం, నాలుగు టెస్టుల్లో నెగ్గితే 56.94 శాతం కానుంది. లేదంటే భారత్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. రెండు టెస్టుల్లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో బంగ్లాపై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్ ఫామ్‌లో ఉంది. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. అశ్విన్, అక్షర్ స్పిన్ కోటాలో తుది జట్టులో నిలువనుండగా.. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ నిలిచే అవకాశం ఉంది. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ పోటీపడుతున్నారు. సిరాజ్ ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శార్దుల్, ఉమేశ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
షకిబ్ అనుమానమే?
కెప్టెన్ షకిబ్ ఫిట్‌నెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. చివరి వన్డేలో ఉమ్రాన్ బంతికి విల విల్లాడిన షకిబ్ ప్రాక్టీస్‌లో సౌకర్యంగా కనిపించ లేదు. పేసర్ టస్కిన్ అహ్మద్ సైతం ఫిట్నెస్ సాధించలేదు. షకిబ్‌పై నేడు ఉదయం తుది నిర్ణయం తీసుకోనున్నారు. లిటన్ దాస్, అనా ముల్ హాక్, ముష్ఫీకర్ రహీం, నురుల్ హసన్, మోమినుల్ హాక్, మెహిది హసన్ మిరాజ్‌లు కీలకం కానున్నారు. తైజుల్ ఇస్లాం, ఎబాడాట్ హోస్సేన్ బంతితో కీలకం కానున్నారు. భారత్‌పై గత ఐదు టెస్టుల్లో పేలవ ప్రదర్శనలు చేసిన బంగ్లాదేశ్.. వైట్‌బాల్ విజయోత్సాహంతో టెస్టుల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది.