Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో సెమీఫైనల్ పోరు నేడు
- రాత్రి 12.30 నుంచి ఆరంభం
- ఫిఫా ప్రపంచకప్ 2022
నవతెలంగాణ-దోహా : ఖతార్ ఫిఫా ప్రపంచకప్ ఎవరూ ఊహించన రీతిలో సాగుతోంది. అండర్డాగ్ అద్భుతాలు చేయటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో ప్రస్థానం అటువంటిదే. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఓ జట్టు విజయాన్ని రెండు సమూహాలు సంబురం చేసుకుంటున్నాయి. సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించిన మొరాకో కోసం అటు ఆఫ్రికా అభిమానులు, ఇటు అరబ్ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. టైటిల్ ఫేవరేట్ ఫ్రాన్స్‌తో సెమీఫైనల్లో అల్ బయత్ స్టేడియం 90 శాతం మొరాకో మద్దతుదారులతో నిండనుంది. ఇందులో ఎటవంటి ఆశ్చర్యం లేదు. ప్రపంచకప్‌లో వరుస విజయాలు గాలివాటం కాదు, ఏండ్ల తరబడి కఠోర సాధన ఫలితమని చాటేందుకు మొరాకో మరో అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్లో బెర్త్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో నేడు తలపడనుంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30 గంటలకు సెమీ సమరం షురూ కానుంది. జియో సినిమాలో మ్యాచ్‌ను చూడవచ్చు.
ఫ్రాన్స్‌కు ఎదురుందా?
ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడనుండటం ఫ్రాన్స్‌కు ఇది ఏడోసారి. గత ఆరు సెమీఫైనల్స్‌లో తొలి మూడింట ఓడగా, చివరి మూడింట విజయాలు సాధించింది. 1958, 1982, 1986 సెమీస్‌లలో ఫ్రాన్స్ తడబడింది. 1998, 2006, 2018 సెమీఫైనల్స్‌లో గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రధాన ఆటగాడు కరీం బెంజమా లేకపోయినా ఫ్రాన్స్ దూకుడు తగ్గలేదు. కిలియన్ ఎంబాపె, ఒలీవర్ జిరూడ్, గ్రిజ్మ్యాన్లు గోల్ అవకాశాలు సృష్టించటంలో, గోల్స్ కొట్టడంలో దూసుకెళ్తున్నారు. ఇంగ్లాండ్‌తో క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ అవకాశాలు తక్కువే అయినా, కొట్టిన కిక్‌ను కాస్త బలంగా కొట్టింది. నేడు మొరాకోతోనూ ఫ్రాన్స్ అదే వ్యూహం అమలు చేయనుంది. ఈ ప్రపంచకప్‌లో మొరాకోపై ఏ ప్రత్యర్థి ఆటగాడు గోల్ కొట్టలేదు. కెనడాతో గ్రూప్ దశ మ్యాచ్‌లో మొరాకో సెల్ఫ్‌గోల్ మినహా.. ఆ జట్టుపై ఎవరూ గోల్ చేయలేక పోయారు. మొరాకో గోల్కీపర్ను దాటుకుని వెళ్లటం ఫ్రాన్స్ ఎటాకర్ల ముందున్న కఠిన సవాల్.
మొరాకో మరోసారి!
ఫిఫా ప్రపంచకప్ సెమీస్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా నిలిచిన మొరాకో.. ఫైనల్లో చేరుకున్న ఘనత సైతం సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రపంచకప్‌లో క్రోయేషియా, బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ వంటి బలమైన జట్లు మొరాకోతో తలపడ్డాయి. ఎవరూ మొరాకోపై గోల్ కొట్టలేకపోయారు. అడ్డుగోడ వంటి డిఫెన్స్ లైన్స్‌తో నేడు ఫ్రాన్స్‌పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది మొరాకో. ఫ్రాన్స్‌పై గోల్ కొట్టగలమనే విశ్వాసం మొరాకోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్రికా, అరబ్ అభిమానుల ఆశల జట్టు ప్రస్థానం సెమీస్ దాటుతుందా? మొరాకో మరో సంచలనం చేయగలదా? ఆసక్తికరం.