Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొరాకో అద్భుత జైత్రయాత్రకు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిర్దాక్షిణ్య ఎదురుదాడితో మెరిసిన ఫ్రాన్స్ 2-0తో మొరాకతో గెలుపొందింది. ఆదివారం టైటిల్ పోరులో లియోనల్ మెస్సీ సేన అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది.
- సెమీస్‌లో మొరాకో పరాజయం
- 2-0తో ఫ్రెంచ్ జట్టు విజయం
- ఫిఫా ప్రపంచకప్ 2022
నవతెలంగాణ-దోహా
మొరాకో డిఫెన్స్ ఛేదించే ఫార్ములా ఫ్రాన్స్ కనుగొంది. ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు ఒక్క గోల్ ఇవ్వని మొరాకోపై ఫ్రాన్స్ ఏకంగా రెండు గోల్స్ కొట్టింది. సెమీఫైనల్లో 2-0తో గెలుపొంది ప్రపంచ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. బ్రెజిల్ (2002), జర్మనీ (1990) తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్రవేశించిన జట్టుగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. థియో హెర్నాండేజ్ (5వ నిమిషం), రాండల్ కోలో మువాని (79వ నిమిషం) ఫ్రాన్స్‌కు గెలుపు గోల్స్ కొట్టారు. మొరాకో సైతం గోల్స్ వేటలో గట్టి ప్రయత్నమే చేసినా.. ఫ్రాన్స్ డిఫెన్స్‌ను బద్దలు కొట్టేందుకు అవి సరిపోలేదు. మూడో స్థానం కోసం జరిగే పోరులో క్రోయేషియాతో మొరాకో ఢకొీట్ట నుండగా.. టైటిల్ కోసం అర్జెంటీనాతో తలపడనుంది ఫ్రాన్స్.
ఫ్రెంచ్ దూకుడు
డిఫెండింగ్ చాంపియన్, ఉత్తమ ఆటగాళ్లలతో కూడిన జట్టు. సహజంగానే మ్యాచ్‌ను ఎక్కువగా నియంత్రణలో ఉంచుకోగలదని అనుకుంటాం. కానీ మొరాకో మాయ చేసింది. ఏకంగా 62 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకుంది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ 38 శాతమే బంతిని నియంత్రించగలిగింది. పాస్‌లు, పాసుల కచ్చితత్వంలోనూ మొరాకో స్పష్టమైన పైచేయి సాధించింది. గోల్ కొట్టే అవకాశాలు సైతం మొరాకోకు గట్టిగానే లభించాయి. అయితే, దూకుడుగా కొట్టడంలో ఫ్రాన్స్ ముందంజ వేసింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే ఫ్రాన్స్ గోల్ ఖాతా తెరిచింది. మొరాకో బాక్స్‌లోపల బంతితో మాయ చేసిన ఫ్రాన్స్.. ఐదో నిమిషంలోనే గోల్ చేసింది. ఎంబాపె, గ్రిజ్మ్యాన్లు మొరాకో డిఫెన్స్‌ను తప్పిస్తూ మారిన పాస్‌లను థియో హెర్నాండేజ్ గోల్‌గా మలిచాడు. 16వ నిమిషంలో మొరాకో సైతం గోల్‌కు దగ్గరగా వెళ్లింది. కానీ సఫలం కాలేదు. ప్రథమార్థం ముగియడానికి క్షణాల ముందు మొరాకో మరోసారి ఫ్రాన్స్‌పై గోల్ ఎక్కుపెట్టినా.. ఫలితం దక్కలేదు. 1-0తో ప్రథమార్థాన్ని ఆధిక్యంతో ముగించిన ఫ్రాన్స్.. రెండో అర్థ భాగంలో మరో గోల్‌తో చెలరేగింది. 79వ నిమిషంలో ఎంబాపె నుంచి అందుకున్న పాస్‌ను రాండల్ కోలో మువాని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో ఫ్రాన్స్ 2-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. మరోసారి మిడిల్లో బంతిని నియంత్రించిన ఆంటోని గ్రిజ్మ్యాన్ సహచర ఫ్రెంచ్ స్ట్రయికర్లకు విలువైన అవకాశాలు సృష్టించాడు. మొరాకో గోల్ ప్రయత్నాలను సమర్ధవంతంగా అడ్డుకున్న ఫ్రాన్స్ 2-0 విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది.
మొరాకో సగర్వంగా..!
సెమీఫైనల్లో నిష్క్రమణతో మొరాకో ఆటగాళ్లు కంటతడి పెట్టలేదు. ఫైనల్లోకి చేరుకునే చారిత్రక ఘట్టం చేజార్చుకున్నామని బాధ పడలేదు. అత్యుత్తమ జట్టుపై ఉత్తమ ప్రదర్శనే చేసిన మొరాకో.. అభిమానుల అండతో గర్వపడే ప్రదర్శనతో సగర్వంగానే మైదానం వీడింది. అల్ బయత్ స్టేడియం మొరాకో మద్దతుదారులతో నిండిపోగా.. అభిమానుల అరుపుల నడుమ మొరాకో కొన్ని మెరుపు విన్యాసాలు చేసింది. కానీ గోల్ చేయాల్సిన తరుణంలో ఆ జట్టు స్ట్రయికర్లలో వంద శాతం ప్రయత్నం కనిపించలేదు. కనీసం మూడుసార్లు మొరాకో గోల్‌కు చేరువగా వచ్చినా..ఆ జట్టు ఆటగాళ్లు ఆఖరు వరకూ ప్రయత్నం చేయలేదు. ప్రపంచకప్‌లో మేటి జట్లను ఓడించిన మొరాకో ఖతార్‌లో చిరస్మరణీయ జ్ఞాపకాలను సొంతం చేసుకుంది.