Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంచరీలతో కదం తొక్కిన బ్యాటర్లు
- తొలి టెస్టుపై భారత్ పట్టు
513 ఛేదనలో బంగ్లాదేశ్ 42/0
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (110), టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (102 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. సహజశైలికి విరుద్ధంగా దూకుడుగా ఆడిన పుజారా 130 బంతుల్లోనే శతకం సాధించాడు. సంప్రదాయ షాట్లతో మెప్పించిన గిల్ కెరీర్ తొలి టెస్టు శతకం అందుకున్నాడు. గిల్, పుజారా శతకాలతో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రికార్డు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 42/0తో కొనసాగుతోంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో టీమ్ ఇండియా భారీ విజయానికి రంగం సిద్ధం చేసుకుంది!.
నవతెలంగాణ-చిట్టగాంగ్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విజయానికి మార్గం సుగమం చేసుకుంది. చతేశ్వర్ పుజారా (102 నాటౌట్, 130 బంతుల్లో 13 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (110, 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక విహారం చేశారు. టాప్ ఆర్డర్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వేగంగా పరుగులు పిండుకుంది. 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు 513 పరుగుల రికార్డు ఛేదనకు ఆహ్వానించింది. ఛేదనలో బంగ్లాదేశ్ 42/0తో వికెట్ నష్టపోకుండా ఆడుతోంది. ఓపెనర్లు నజ్ముల్ (25 బ్యాటింగ్, 42 బంతుల్లో 3 ఫోర్లు), జాకిర్ హసన్ (17 బ్యాటింగ్, 30 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. అంతకముందు, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. నేడు నాల్గో రోజు ఆటలోనే పది వికెట్లను పడగొట్టేందుకు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది!.
గిల్, పుజారా దూకుడు
శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శతక ఫామ్‌లోకి వచ్చారు. కెరీర్ 12వ టెస్టు ఆడుతున్న శుభ్‌మన్ గిల్ నాలుగు అర్థ సెంచరీలు చేసినా, శతకానికి చేరువ కాలేదు. ఇక పుజారా సైతం గత కొంత కాలంగా పరుగుల వేటలో అనూహ్యంగా తడబడు తున్నాడు. ఇటీవల ఇంగ్లీశ్ కౌంటీల్లో విధ్వంసక పుజారాను ఆవిష్కరించుకున్న టెస్టు స్పెషలిస్ట్.. అదే కోవలో బంగ్లాదేశ్‌పై ఓ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. గత 52 ఇన్నింగ్స్‌లుగా (2019 జనవరి తర్వాత) సెంచరీ సాధించని పుజారా.. చిట్టగాంగ్‌లో చెలరేగాడు. 130 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 13 బౌండరీలతో బంగ్లాదేశ్ బ్యాటర్లతో విశ్వరూపం చూపించాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సైతం దూకుడుగా చూపించాడు. ఆరు ఫోర్లతో 84 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన గిల్.. 147 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో కెరీర్ తొలి శతకం అందుకున్నాడు. ఐదు ఫోర్లతో 87 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పుజారా ఆ తర్వాత ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు. ఈ ఇద్దరు శతకాలతో చెలరేగటంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ ఓవర్లలోనే ఆశించిన స్కోరు సాధించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (23, 62 బంతుల్లో 3 ఫోర్లు) పెద్దగా ఆకట్టుకోలేదు. గిల్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 70 పరుగులు జోడించినా తాత్కాలిక కెప్టెన్ ఇన్నింగ్స్‌లో దూకుడు కనిపించలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (19 నాటౌట్, 29 బంతుల్లో) సాధికారిక ప్రదర్శన చేశాడు. బౌండరీ కొట్టని కోహ్లి మరో ఎండ్‌లో పుజారాకు స్ట్రయిక్ రొటేషన్ చేశాడు. గిల్, పుజారా జోడీ రెండో వికెట్‌కు 113 పరుగులు జోడిం చగా.. పుజారా, కోహ్లి జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు పిండుకున్నారు.
కుల్దీప్కు ఐదు
తుది జట్టులో నిలుస్తాడా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. సుదీర్ఘకాలంగా జట్టుకు దూరమైన కుల్దీప్యాదవ్.. మూడో స్పిన్నర్‌గా బరిలో నిలిచినా బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్‌ను గిరగిరా తిప్పేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 133/8తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 17 పరుగులకే చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఎబాడాట్ హోస్సేన్ (17) వికెట్‌తో కుల్దీప్ ఐదు వికెట్ల ఘనత సాధించగా, మెహిది హసన్ మిరాజ్ (25)ను అవుట్ చేసి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరదించాడు అక్షర్ పటేల్. 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన టీమ్ ఇండియా.. బంగ్లాదేశ్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ రెండోసారి బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది.
బంగ్లాదేశ్ ససేమిరా!
మూడో రోజు ఆట చివరి సెషన్లో 12 ఓవర్లు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా ముగించింది. ఓపెనర్లు నజ్ముల్ శాంటో (25 బ్యాటింగ్), జాకిర్ హసన్ (17 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నారు. సిరాజ్, ఉమేశ్‌లకు స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్, అక్షర్ తోడైనా ఓపెనర్లు వికెట్ కాపాడుకున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, బంగ్లాదేశ్ 471 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. పిచ్ నుంచి టర్న్ లభిస్తున్న వేళ నేడు మూడు సెషన్ల పాటు పది వికెట్లు కాపాడుకోవటం సైతం ఆతిథ్య జట్టుకు కష్టమే.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 404/10
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : నజ్ముల్ (సి) పంత్ (బి) సిరాజ్ 0, జాకిర్ (సి) పంత్ (బి) సిరాజ్ 20, యాసిర్ (బి) ఉమేశ్ 4, లిటన్ (బి) సిరాజ్ 24, ముష్ఫీకర్ (ఎల్బీ) కుల్దీప్ 28, షకిబ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 3, నురుల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 16, మిరాజ్ (స్టంప్డ్) అక్షర్ 25, తైజుల్ (బి) కుల్దీప్ 0, హోస్సేన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17, ఖలీద్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం :(55.5 ఓవర్లలో ఆలౌట్) 150.
వికెట్ల పతనం : 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8-102, 9-144, 10-150.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 13-2-20-3, ఉమేశ్ యాదవ్ 8-1-33-1, అశ్విన్ 10-1-34-0, కుల్దీప్ యాదవ్ 16-6-40-5, అక్షర్ పటేల్ 8.5-4-10-1.
భారత్ రెండో ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) తైజుల్ (బి) ఖలీద్ 23, శుభ్‌మన్ గిల్ (సి) మహ్మదుల్ హసన్ (బి) మిరాజ్ 110, చతేశ్వర్ పుజారా నాటౌట్ 102, విరాట్ కోహ్లి నాటౌట్ 19, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(61.4 ఓవర్లలో 2 వికెట్లకు) 258.
వికెట్ల పతనం : 1-70, 2-183.
బౌలింగ్ : ఖలీద్ అహ్మద్ 13-0-51-1, తైజుల్ ఇస్లాం 23.4-3-71-0, మెహిది మిరాజ్ 14-1-82-1, యాసిర్ అలీ 6-0-28-0, లిటన్ దాస్ 2-0-13-0, నజ్ముల్ శాంటో 3-0-12-0.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : నజ్ముల్ శాంటో బ్యాటింగ్ 25, జాకిర్ హసన్ బ్యాటింగ్ 17, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం :(12 ఓవర్లలో) 42.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 3-0-11-0, ఉమేశ్ యాదవ్ 1-1-0-0, రవిచంద్రన్ అశ్విన్ 5-1-23-0, అక్షర్ పటేల్ 2-0-4-0, కుల్దీప్ యాదవ్ 1-0-4-0.