Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్జెంటీనా, ఫ్రాన్స్ టైటిల్ పోరు నేడు
- రాత్రి 8.30 నుంచి జియో సినిమాలో..
అశేష అభిమానుల ఆకాంక్ష, ప్రపంచ వ్యాప్తంగా గెలుపు ప్రార్థనలు, ఆటగాళ్లలో గొప్ప భావోద్వేగం.. లియోనల్ మెస్సి చివరి ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు నెలకొన్న సన్నివేశం. సాకర్ మాంత్రికుడు మెస్సి ప్రపంచకప్ నెగ్గాలనే భావోద్వేగం ఒకవైపు.. బలమైన ప్రదర్శనలనే నమ్ముకున్న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ ఒకవైపు. ఫిఫా ప్రపంచకప్ టైటిల్ కోసం నేడు అర్జెంటీనాతో ఫ్రాన్స్ ఢకొీట్టనుంది. కప్పు నెగ్గేది భావోద్వేగమా? బలమా? చూడాలి.
ఫిఫా ప్రపంచకప్ అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి అర్జెంటీనాను టైటిల్ ఫేవరేట్‌గా నిలుపగా, వర్థమాన స్టార్ కిలియన్ ఎంబాపె డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను రేసులో ముందంజలో నిలుపుతున్నాడు. 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ కోసం నేడు అర్జెంటీనా, ఫ్రాన్స్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అర్జెంటీనా రికార్డు స్థాయిలో ఆరో వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడుతుండగా, ఫ్రాన్స్ నాల్గో టైటిల్ పోరుకు సిద్ధమైంది. 1978, 1986లో అర్జెంటీనా కప్పు నెగ్గగా.. 1998, 2018లో ఫ్రాన్స్ ఫిఫా టైటిల్‌ను ముద్దాడింది. ఇటు అర్జెంటీనా, అటు ఫ్రాన్స్ మూడో ప్రపంచకప్ టైటిల్ కోసం నేడు వేటకు రంగంలోకి దిగనున్నాయి.
మెస్సి మాయ మరోసారి!
లియోనల్ మెస్సి సాకర్ దిగ్గజం. అతడు సాధించని రికార్డులు, ఘనతలు లేవు. మెరుపు వేగం, కండ్లుచెదిరే డ్రిబ్లింగ్ నైపుణ్యం, ప్రత్యర్థులను మాయ చేసే చాతుర్యం మెస్సి సొంతం. ఐదు గోల్స్‌తో అర్జెంటీనాను ఫైనల్స్‌కు చేర్చిన మెస్సి.. కెరీర్లో అందని ద్రాక్షగా మిగిలిన ఫిఫా వరల్డ్‌కప్ కోసం మరోసారి మాయ చేసేందుకు చూస్తున్నాడు. యువ ఆటగాడు అల్వారెజ్ దూకుడు మెస్సికి అదనపు బలం. గోల్ కీపర్ మార్టినెజ్ అడ్డుగోడ అండతో మెస్సి అండ్ కో ఫ్రెంచ్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మెస్సి చివరి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విజయంతో వీడ్కోలు పలకాలనే భావోద్వేగం ఆటగాళ్లను ఏ దారిలో నడిపిస్తుందో ఆసక్తికరం. భావోద్వేగం అవకాశాలు సృష్టించేందుకు, కసిగా గోల్ కొట్టేందుకు దోహదం చేస్తే మెస్సి తొలిసారి ఫిఫా కప్పుపై ముద్దు పెట్టినట్టే!.
ఫ్రెంచ్ పవర్!
ఫ్రాన్స్‌పై 2018లో పెద్దగా అంచనాలు లేవు. ఆ జట్టులో సామర్థ్యం లేదని పెదవి విరిచారు. స్టార్ స్ట్రయికర్ బెంజమా దూరం కావటంతో 2022లోనూ ఫ్రాన్స్‌ను టైటిల్ ఫేవరేట్‌గా పరిగణించలేదు. కానీ యువ కెరటం కిలియన్ ఎంబాపె, ఆంటోని గ్రిజ్మ్యాన్, ఒలీవర్ జిరూడ్లు ఫ్రెంచ్ జట్టును విజయ పథాన నడిపిస్తున్నారు. అర్జెంటీనా తరహాలోనే ఫ్రాన్స్ సైతం బంతిని ఎక్కువగా నియంత్రణలో ఉంచుకునేందుకు ఇష్టపడదు. బంతి అందినప్పుడే అలవోకగా గోల్ కొట్టడంపైనే ఆ జట్టు ధ్యాస. మెస్సితో సమానంగా ఐదు గోల్స్ చేసిన ఎంబాపె నేడు గోల్డెన్ బూట్‌తో పాటు ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు వేట మొదలెట్టనున్నాడు. మిడిల్లో గ్రిజ్మ్యాన్ను నిలువరిస్తే.. ఫ్రాన్స్ గోల్ అవకాశాలకు అర్జెంటీనా గండి కొట్టవచ్చు.
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడటం ఇది నాల్గోసారి. గత మూడు మ్యాచుల్లో రెండింట అర్జెంటీనా గెలుపొందింది. 2018 ప్రీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 4-3తో మెస్సిసేనపై పైచేయి సాధించింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న లియోనల్ మెస్సి సేన 90 నిమిషాల్లో ఏం మాయ చేస్తుందో చూడాలి.